Dharani
Dharani
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులకు.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న కలను సాకారం చేసే దిశగా అడుగులు వేయనున్నారు. అందుకు సెప్టెంబర్ 18న ముహుర్తం నిర్ణయించారు. అంటే మరో 3 రోజుల్లో.. టీటీడీ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తోన్న కల నెరవేరనుంది. ఇంతకు అది ఏంటంటే.. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఇంటి స్థలాల సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ నెల 18న టీటీడీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటి స్థలాల పత్రాలను అందజేయనున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా.. శ్రీనివాసుడికి పట్టువస్త్రాల సమర్పణకు వచ్చిన సమయంలోనే.. టీటీడీ ఉద్యోగులుకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు సీఎం జగన్.
ఏపీ సీఎం జగన్.. ఈ నెల 18, 19న తిరుమల, తిరుపతిలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. సోమవారం అనగా సెప్టెంబర్ 18 మధ్యాహ్నం 2 గంటల సమయంలో.. సీఎం జగన్.. గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆతర్వాత తిరుపతిలో నిర్మించిన శ్రీనివాస సేతును ప్రారంభించి.. అనంతరం వర్చువల్ విధానంలో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు అందజేస్తారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వత సీఎం జగన్.. తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని తిరుమల చేరుకుంటారు.
కొండపై వకుళామాత, రచన అతిథి గృహాలు ప్రారంభించిన తర్వాత సీఎం జగన్.. పద్మావతి అతిథిగృహానికి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు రాత్రి 7.45 గంటలకు బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని శిరోవస్త్రాన్ని ధరిస్తారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు సీఎం జగన్. పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత.. 2024 టీటీడీ దైనందిని, క్యాలెండర్లు ఆవిష్కరిస్తారు. రాత్రి 9 గంటలకు చిన్నశేష వాహన సేవలో పాల్గొని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 19న ఉదయం శ్రీవారిని మరోమారు దర్శించుకుని 7.35 గంటలకు తిరిగి ఓర్వకల్లుకు బయల్దేరి వెళ్తారు.