ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వరాల జల్లులు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా కీలక హామీలు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న డీఏలో ఒకదాన్ని దసరా పండుగ కానుకగా అందిస్తామన్నారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఐద్రోజుల క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా 3.19 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించామన్నారు. అలాగే 53 వేల మందిని హెల్త్ సెక్టార్లో రిక్రూట్ చేశామని గుర్తుచేశారు.
ఉద్యోగ వ్యవస్థను మెరుగుపర్చేలా అడుగులు వేశామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఎంప్లాయీస్ ఇబ్బందుల గురించి ఎప్పుడూ సానుకూలంగా స్పందించామన్నారు. ఉద్యోగుల సమస్యలను చాలా నిజాయితీగా పరిష్కరించామని.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు జగన్. ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గ్యారెంటీ పెన్షన్ స్కీమ్‌ను తీసుకొచ్చామని.. జీపీఎస్ పెన్షన్ పథకానికి రెండు, మూడ్రోజుల్లో ఆర్డినెన్స్ వస్తుందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే తపన ఉన్న వ్యక్తినన్న ముఖ్యమంత్రి జగన్.. ఈ పెన్షన్ స్కీమ్ దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
నూతనంగా ఏర్పడిన 13 జిల్లాల్లో సర్కారు యంత్రాంగం విస్తరించిందన్నారు సీఎం జగన్. ఆయా జిల్లాల్లో ఏడు నియోజకవర్గాలకు ఒక కలెక్టర్, ఒక ఎస్పీని నియమించామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం పక్కన పడేసిన సమస్యలను తాము పరిష్కరించామని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు మినిమం టైమ్ స్కేల్ ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జగన్ వ్యాఖ్యానించారు. దళారీ వ్యవస్థకు ప్రతి చోటా చెక్ పెట్టామని.. ప్రతి నెలా తొలి వారంలోనే జీతాలు ఇస్తూ ఉద్యోగులకు అండగా నిలిచామన్నారు. కారుణ్య నియామకాల్లోనూ పారదర్శకత పాటించామన్నారు సీఎం జగన్. ఇప్పటిదాకా 10 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామని వివరించారు.