నన్ను అరెస్టు చేస్తారేమో!.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమర్శలు యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. అవినీతికి పాల్పడుతుంది మీరంటే మీరని పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ అగ్గి రాజేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చింది. లెక్కలు చూపని రూ. 118 కోట్లకు సంబందించిన ఆదాయంపై నోటీసులు ఇచ్చింది. దీనిని అస్త్రంగా మలుచుకున్న వైసీపీ మంత్రులు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతికోసం ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతుంటే అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయాలని చూస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై నేను పోరాటం సాగిస్తా అని చంద్రబాబు అన్నారు. అందుకే రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేస్తారేమో, లేదా దాడులకు పాల్పడుతారంటూ అంటూ చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గత 45 సంవత్సరాలుగా నిప్పులా బతికా. నేను ఏ తప్పూ చేయలేదు అని చంద్రబాబు అన్నారు.

అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నాయకులు నాపై హత్యాయత్నానికి పాల్పడ్డి, తిరిగి తనపైనే కేసులు పెట్టారని తెలిపారు. నేను చెబితేనే దాడులు చేసినట్లు ఒత్తిడి చేస్తూ స్టేట్మెంట్ రాయిస్తున్నారు అంటూచంద్రబాబు వైసీపీపై ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు చేసిన ఈ వ్యాఖ్యల పట్ల టీడీపీ శ్రేణులను ఆందోళన చెందుతున్నారు. తమ అధినేత చంద్రబాబు అరెస్టు తప్పదేమో అంటూ తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. పుంగళూరు, అంగళ్లు ఘటనల్లో చంద్రబాబుపై ఏ వన్ గా కేసు నమోదైంది. ఈ కేసులోనే టీడీపీ అధినేతను అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఇక ఈ అరెస్టు వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.

Show comments