ఏపీలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 12 డిమాండ్ల పరిష్కారం కోరుతూ విద్యుత్ ఉద్యోగులు సంఘం సమ్మెకు పిలుపునిచ్చారు. బుధవారం ఆర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లానున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓవైపు వారి సమ్మెకు ప్రత్యామ్నాయాల్ని అన్వేషిస్తూనే మరోవైపు చర్చలకు కూడా ఆహ్వనించింది. దీంతో చర్చలో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది. తాజాగా చర్చలపై కీలక ప్రకటన వెలువడింది.
బుధవారం ఏపీ విద్యుత్ ఉద్యోగులతో..ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. ఈ చర్చలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల డిమాండ్ చేసిన పీఆర్సీపై ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. 8శాతం ఫిట్ మెంట్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలానే మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పదించడంతో విద్యుత్ సంఘాల జేఏసీ సమ్మె నోటీసు ఉపసంహరించుకుంది. ప్రభుత్వ ప్రతిపాదనలను విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఆమోదించాయి.పే స్కేలు ఫిక్స్ చేసేందుకు ఏపీ జెన్ కో ఎండీ ఆధ్వర్యంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్దమవుతున్న నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ అప్రమత్తం అయ్యారు. సమ్మెను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల్ని పలువురు మంత్రులు, అధికారులతో చర్చించారు. అనంతరం ఉద్యోగులతో మరోసారి చర్చలు జరపాలని సూచించారు. వీలైనన్ని డిమాండ్లు పరిష్కరించాలని సూచించినట్లు తెలుస్తోంది. సీఎం సూచనల మేరకు బుధవారం సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో చర్చలకు రావాలని విద్యుత్ ఉద్యోగులను మంత్రులు ఆహ్వానించారు. సీఎస్ తో పాటు మంత్రుల సబ్ కమిటీ విద్యుత్ ఉద్యోగ నేతలతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఉద్యోగులు లేవనెత్తిన 12 డిమాండ్ల పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. విద్యుత్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ప్రతి ఒక్కరి చేతిలో చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలి: సీఎం జగన్