Dharani
Dharani
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్.. ఏలూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. వాలంటీర్ల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మహిళల అదృశ్యం వెనక వాలంటీర్ల హస్తం ఉందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్‌పై జనాలు, ప్రజా ప్రతినిధులు మండి పడుతున్నారు.
ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై విజయవాడ నగరంలోని 228 సచివాలయంలో పని చేస్తోన్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈనేపథ్యంలో విజయవాడ కృష్ణలంక పోలీసులు పవన్‌పై 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి.. ఆయనపై సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పవన్ వ్యాఖ్యల కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే సెక్షన్లను చేర్చారు.
ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు మండి పడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ పవన్ కళ్యాణ్‌కు లేఖ రాశారు. ఇక వారహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజలను అదుపు చేయడానికే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారని.. వారు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుందని పవన్ ప్రశ్నించారు. 6 కోట్ల ఆంధ్రుల సమాచారం హైదరాబాద్‌కు ఎందుకు పోతుందని ప్రశ్నించారు జనసేన పార్టీ అధినేత. నానాక్‌రాం గూడాలోని ఎఫ్ఓఏ ఏజెన్సీ ఎవరిదని.. ఆ సంస్థలోని 700 మందికి జీతాలు ఇస్తోంది ఎవరని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చేసిన ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి.