iDreamPost
android-app
ios-app

Atchutapuram: అచ్యుతాపురం ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  • Published Aug 22, 2024 | 8:31 AM Updated Updated Aug 22, 2024 | 8:31 AM

Narendra Modi-Atchutapuram Incident: అనకాపల్లి అచ్యుతాపురంలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు వల్ల సుమారు 17 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ వివరాలు..

Narendra Modi-Atchutapuram Incident: అనకాపల్లి అచ్యుతాపురంలో దారుణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడు వల్ల సుమారు 17 మంది చనిపోయారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఆ వివరాలు..

  • Published Aug 22, 2024 | 8:31 AMUpdated Aug 22, 2024 | 8:31 AM
Atchutapuram: అచ్యుతాపురం ఘటనపై మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా, అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో బుధవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుమారు 17 మంది మృతి చెందగా.. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో పేలుడు ధాటికి కంపెనీ పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేసే సిబ్బంది 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోగా.. 17మంది ప్రాణాలు కోల్పోయారు.. సుమారు 60 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. అక్కడ వైద్యం కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. బాధితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆ వివరాలు..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. ఈ ఘటనపై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు.

మరోవైపు అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు ఘటనపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి స్పందిస్తూ.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు గాయపడినవారు పూర్తిగా కోలుకునే వరకు వారికి కూడా ఆర్థికసాయం అందించాలన్నారు. ఘటనాస్థలాన్ని శుక్రవారం జగన్‌ పరిశీలిస్తారని వైఎస్సార్‌సీపీ తెలిపింది. అలాగే పార్టీ నేతలు, కార్యకర్తలు బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.  ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు అచ్యుతాపురం వెళుతున్నారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగ్రాతులకు చికిత్స అందుతుంది. ఇక ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరగడానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక నివేదిక ప్రకారం.. రియాక్టర్‌ పేలడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని.. సాల్వంట్‌ లీకేజీ వల్ల ఘటన చోటు చేసుకుందని అంటున్నారు. ఒకవేళ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలితే.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవంటున్నారు అధికారులు