AP లో మండిపోతున్న ఎండలు.. కారణాలు చెప్పిన విపత్తులు నిర్వహణ సంస్థ

ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కురిస్తే వర్షాలు కురుస్తాయి.. లేదంటే ఎండలు మండి పోతున్నాయి. ఇక జూలై చివరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొట్టాయి. ఓ పది రోజులు వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను వణికించాయి. వారం రోజుల్లోనే.. వర్షాకాలం సీజన్‌కు సరిపడా నష్టం కలిగించాయి. ఆ తర్వాత వానలు జాడపత్తా లేకుండా పోయాయి. ఇక తెలంగాణ సంగతి ఏమో కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎండలు మండి పోతున్నాయి. వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల జనాలు ఎంత ఇబ్బంది పడతారో.. వర్షాకాలం కూడా అలానే బాధపడుతున్నారు. ఉక్కపోత తట్టుకోలేకపోతున్నారు. మరి రాష్ట్రంలో ఎండలు ఎందుకు ఇంతలా మండి పోతున్నాయో.. అందుకు గల కారణాలు వివరించింది ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ. ఆ వివరాలు..

రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండలతో పాటు ఉక్కపోత కూడ తోడవుతుండటంతో.. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. వాతావరణంలోని మార్పుల వలన ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. సాధారణంగా మే నెల నుంచి ఆగష్టు వరకు ఏపీ వాతావరణంపై సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉంటుంది.

ఇలా భూమి ఉపరితలం మీదకు వచ్చే సూర్యకిరణాల ప్రసరణ వర్షాకాలంలో ఉండే మేఘాల కారణంగా వాటి తీవ్రత తగ్గి.. వాతావరణం అంత వేడిగా ఉండదు. అయితే ప్రస్తుతం ఏపీ పైభాగంలో మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్యుడి కిరణాలు నేరుగా తాకడం వల్ల.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఈ అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఎంట తీవ్రత అధికంగా ఉండటం వల్ల.. పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు అవుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పైగా ఈ ఏడాది వర్షాకాలంలో ఇప్పటి వరకు ఏపీలో నమోదైన వర్షపాతం కూడా తక్కువే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక జూలై నెలలో ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురిసాయి తప్ప ఆశించిన స్థాయిలో మాత్రం వానలు పడలేదు అంటున్నారు అధికారులు. వాస్తవానికి ఆగస్టు నెలలో వర్షాలు విస్తారంగా కురవాలి.. కానీ అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. పైగా ఎండలు మండిపోతూ.. ఆగస్టు నెల కూడా ఎండాకాలాన్ని తలపిస్తుందనే చెప్పవచ్చు.

పలు ప్రాంతాల్లో వర్షాలు..

ఏపీలో అత్యధిక ప్రాంతాల్లో ఎండలు మండిపోతుండగా.. పలు జిల్లాల్లో మాత్రం వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం లేదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.

Show comments