Dharani
Dharani
టమాటా ధర చూస్తేనే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా టమాటా ధర కొండెక్కి కూర్చింది. టమాటా ధర సెంచరీ దాటిన తర్వాత నుంచి జనాలు.. దాన్ని కొనాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడైతే ఏకంగా కిలో టమాటా ధర డబుల్ సెంచరీకి పైనే ఉంది. టమాటా ధర సామాన్యుల చేత కన్నీరు పెట్టిస్తోంటి.. ఈ ఏడాది టమాటా పండించిన అన్నదాతలు మాత్రం సంతోషంగా ఉన్నారు. ప్రతి ఏటా అరకొర ధరలతో ఇబ్బంది పడ్డ అన్నదాతలు.. ఈ ఏడాది టమాటా రూపంలో జాక్‌పాట్ కొట్టారు. ఈ ఏడాది నెల నుంచి 2 నెలల వ్యవధిలో టమాటా రైతుల దశ తిరిగింది. కోటీశ్వరలు, లక్షాధికారులు అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో టమాటా ధర ఇప్పట్లో దిగి వచ్చే సూచనలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో టమాటా ధర ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది.
ఏపీలో టమాటా ధరకు ఇప్పట్లో బ్రేకులు పడే సూచనలు కనిపించడం లేదు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మార్కెట్‌లో మంగళవారం నాణ్యమైన టమాటా ధర రికార్డు స్థాయికి చేరింది. కిలో ధర ఏకంగా 224 రూపాయలు పలికింది. దాదాపు పది వేల క్రేట్ల పంట రాగా.. వేలంలో క్రేటు ధర రూ.5,600 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. ఇక్కడికి వచ్చిన టమాటా ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారట.
అలానే అనంతపురం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. కక్కలపల్లి టమాటా మార్కెట్ మండీలో కిలో టమాటా 215 రూపాయలు పలికింది. 15 కిలోల టమాటా బుట్ట అనూహ్యంగా 3200 రూపాయలకు అమ్మడయ్యింది. ఈ సీజన్‌లోనే కాక.. ఈ మార్కెట్ చరిత్రలోనే ఇదే అత్యధిక రేటు అంటున్నారు వ్యాపారులు. జిల్లాకు చెందని ఓ రైతు ఏకంగా 90 బుట్టల టమాటాల తీసుకువచ్చాడు. నాణ్యత బాగున్న సుమారు 79 బుట్టల టమాటాలను ఒక్కొటి 3200 రూపాయలకు అమ్మినట్లు వెల్లడించాడు.
ఈ సందర్భంగా సదరు రైతు మాట్లాడుతూ.. ‘‘ఇంజనీరింగ్ చదివాను. కానీ వ్యవసాయం మీద ఆసక్తి ఉండటంతో.. ఇటువైపు వచ్చాను. ఈ ఏడాది 2 ఎకరాల్లో సుమారు లక్ష రూపాయల పెట్టుబడితో టమాటా వేశాను. సాగులో మంచి మెలకువలు పాటించి.. నాణ్యమైన పంట పండించాను. అందుకే ఇంత మంచి ధర పలికింది. టమాటాకు ఇంత మంచి ధర రావడం చాలా సంతోషంగా ఉంది’’ అని తెలిపాడు. మన దగ్గర టమాటా కోసం ఉత్తరాది రాష్ట్రాల వారు క్యూ కడుతున్నారు. ఇక ఇప్పట్లో టమాటా ధర దిగి వచ్చే అవకాశం లేదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.