ప్రజల్ని వరుణడు భయపెడుతున్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం మీద చాలా రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల ధాటికి దేశ రాజధాని ఢిల్లీ నగరం మునిగిపోయింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ది కూడా దాదాపుగా అదే పరిస్థితి. జోరు వానలతో భాగ్యనగరంలోని లోతట్టు ప్రాంతాలు సహా అనేక ఏరియాలు నీట మునిగాయి. జోరు వానలతో ప్రజా జీవనం పూర్తిగా స్తంభించింది. పిల్లలు స్కూళ్లకు, పెద్దలు ఆఫీసులకు వెళ్లలేని పరిస్థితి. ఇక ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరిగ్గా ఆఫీసులు మూతపడే సమయానికి వానలు పడుతుండటంతో రోడ్లన్నీ వాహనాలతో జామ్ అవుతున్నాయి.
గత పది రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నదికి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతి కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం 14.70 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఇన్‌ఫ్లో 14.42 లక్షల క్యూసెక్కులు ఉండగా.. రెండో ప్రమాద హెచ్చరిక దాటి నీటి ప్రవాహం కొనసాగుతోంది. చింతూరు విలీన మండలాల్లో ఇప్పటికే 120 గ్రామాలు వరద నీటిలో చిక్కుకోవడం గమనార్హం.
వరద నీటిలో చిక్కుకున్న గ్రామాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో లాంచీల సాయంతో ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులను అందిస్తున్నారు అధికారులు. వరద ముప్పు అధికంగా ఉన్న కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, కోటిపల్లి దగ్గర ఇసుక బస్తాలు మోసారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. గోదావరికి వరద ఉధృతి పెరగడంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఏటి గట్టు ప్రమాదకరంగా మారిన చోట ఇసుక బస్తాలు వేశారు. రైతులు, కూలీలతో కలసి ఇసుక బస్తాలు మోశారు మంత్రి. ఏటి గట్టు పటిష్టానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పనులు పూర్తవుతాయని తెలిపారు మంత్రి వేణుగోపాల్.