మహిళలకు జగన్ సర్కారు శుభవార్త.. వారి ఖాతాలో రూ.15 వేలు జమ!

  • Author singhj Published - 09:48 PM, Sat - 19 August 23
  • Author singhj Published - 09:48 PM, Sat - 19 August 23
మహిళలకు జగన్ సర్కారు శుభవార్త.. వారి ఖాతాలో రూ.15 వేలు జమ!

మహిళా సాధికారత కోసం సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ఇప్పటికే వారి కోసం పలు పథకాలను తీసుకొచ్చారు ముఖ్యమంత్రి. తాజాగా ఏపీలో కాపు మహిళలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 22వ తేదీన కాపు నేస్తం స్కీమ్ నిధుల్ని సీఎం జగన్ విడుదల చేయనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలులో జరిగే ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేయనున్నారు. జగన్ పర్యటన ఏర్పాట్ల మీద ఆ జిల్లా కలెక్టర్ మాధవీలత సమీక్ష చేశారు.

నిడదవోలులో నిర్వహించే సభలో వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి ప్రారంభిస్తారని కలెక్టర్ మాధవీలత తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, సభ నిర్వహించే సెయింట్ ఆంబ్రోస్ హైస్కూలుతో పాటు నెహ్రూ బొమ్మ సెంటర్​ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్​లో హెలిప్యాడ్ స్థలాలను ఆమె పరిశీలించారు. ఇకపోతే, ఏపీలోని బలిజ, తెలగ, కాపు, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలకు సర్కారు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున సాయం అందిస్తోంది. ఆ లెక్కన ఐదేళ్లలో మొత్తం రూ.75,000 ఆర్థిక సాయాన్ని స్త్రీలకు ఇస్తోంది. ఇప్పుడు నాలుగో విడత డబ్బుల్ని విడుదల చేయనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ.10,000 లోపు ఉన్నవారు కాపు నేస్తం పథకానికి అర్హులు. అదే పట్టణ ప్రాంతాల్లోనైతే నెలసరి ఆదాయం రూ.12,000 లోపు ఉంటే అర్హులు. అలాగే కుటుంబానికి గరిష్టంగా మూడెకరాల మాగాణి లేదా పదెకరాల మెట్ట భూమి లేదా మాగాణి, మెట్ట రెండూ కలిపి పదెకరాలకు మించి ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగులు, అంతకంటే తక్కువ విస్తీర్ణంలో ఉండేవారు మాత్రమే కాపు నేస్తం స్కీమ్​కు అర్హులు. నాలుగు చక్రాల వాహనాలు ఉంటే ఈ పథకానికి అనర్హులు. ప్రభుత్వ పెన్షన్ పొందుతున్న వారూ కాపు నేస్తానికి అనర్హులు.

Show comments