iDreamPost
android-app
ios-app

సౌతిండియాలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

  • Published Jul 31, 2023 | 11:38 AM Updated Updated Jul 31, 2023 | 11:55 AM
  • Published Jul 31, 2023 | 11:38 AMUpdated Jul 31, 2023 | 11:55 AM
సౌతిండియాలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్.. శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్

విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించిన తర్వాత.. దాని అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. విశాఖను మెట్రో పాలిటన్‌ సిటీగా తీర్చి దిద్దే క్రమంలో ఇప్పటికే నగరంలో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు టెక్నాలజీ హబ్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక విశాఖ నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉన్న పర్యటాక రంగాన్ని ఆసరాగా చేసుకుని.. పెట్టుబడులు ఆకర్షించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు సీఎం జగన్‌. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్‌ మాల్‌ని విశాఖలో ఏర్పాటు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 1న సీఎం జగన్‌ దీనికి శంఖుస్థాపన చేయనున్నారు. కైలాసపురం వద్ద నిర్మించనున్న ఇనార్బిట్‌ మాల్‌కి రేపు భూమి పూజ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ రేపు విశాఖలో పర్యటించనున్నారు.

సుమారు రూ. 600 కోట్ల వ్యయంతో 16 ఎకరాల స్థలంలో ఈ ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్‌గా నిలవనుంది. ఈ క్రమంలో సీఎం జగన్‌ ఇనార్బిట్‌ మాల్‌తో పాటు జీవీఎంసీ చేపడుతున్న రూ. 136 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు కూడా శంఖుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఇనార్బిట్‌ మాల్‌.. 8 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. విశాఖలో మాత్రం 17 ఎకరాల్లో దాదాపు 13 ఎకరాల్లో మాల్‌ నిర్మాణం జరగనుంది. ఈ మాల్‌ నిర్మాణం గురింంచి చెప్పగానే.. 80 మల్టీనేషనల్ కంపెనీలు బుకింగ్ చేసుకున్నాయని ఏపీ మంత్రులు తెలిపారు. రు. 6 లక్షల చదరపు అడుగుల్లో ఏవైతే అవుట్ లెట్స్ పెడుతున్నామో వాటిలో 80 శాతం ఒప్పందం చేసుకున్నామని.. 7 మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని.. భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేట పోర్ట్, వైజాగ్ టెక్నాలజీ పార్క్, ఒబెరాయ్ హోటల్స్ నిర్మాణంలో ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రానున్న కాలంలో విశాఖ నగరంలో మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడులు పెట్టడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఇటీవల నిర్మించిన ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ ప్రాంగణాలను కూడా వైఎస్ జగన్ రేపు ప్రారంభించనున్నారు.