CM జగన్‌తో రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ భేటీ.. రాష్ట్రానికి కోట్ల రూపాయల పెట్టుబడులు!

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రాష్ట్రంలో అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారు. ఇక రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులను ఆకర్షించడం కోసం అనేక రకాల సంస్కరణలు తీసుకువచ్చారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడులను ఆకర్షించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సీఎం జగన్‌తో కె.రహేజా గ్రూప్ ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా మంగళవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌తో జరిగిన ఈ సమావేశానికి నీల్ రహేజాతో పాటు ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈఓ రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో త్వరలోనే ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనులు ప్రాంరభించనున్నారు. ఈ క్రమంలో మాల్‌ శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కె.రహేజా గ్రూప్ ప్రతినిధులు ఆహ్వానించారు. కాగా, విశాఖపట్నంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మించనున్న సంగతి తెలిసిందే.. రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో కె రహేజా గ్రూప్‌ రూ. 600 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది. ఏపీలో మరిన్ని పెట్టుబడులపై సీఎం జగన్‌తో రహేజా గ్రూప్‌ ప్రతినిధులు చర్చించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

విశాఖ న‌గ‌రంలోని ఈస్ట్ అసెంబ్లీ నియోజ‌కవ‌ర్గంలోని సాలిగ్రామ‌పురంలో ఉన్న పోర్ట్ హాస్పిటల్ స్థలంలో త్వరలో ఇన్ ఆర్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నారు. వైజాగ్ పోర్ట్‌కు చెందిన నిరుపయోగంగా ఉన్న 17 ఎక‌రాల స్థలం.. ఇన్ ఆర్బిట్ మాల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంద‌ని భావించిన రహెజా సంస్థ భావించింది. దాంతో ఈ స్థలాన్ని తమకు కేటాయించాల్సిందిగా కోరుతూ.. కొద్ది నెలలుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. ఇక అదే సమయంలో పోర్ట్‌ యాజమాన్యం.. తన పరిధిలో నిరుపయోగంగా ఉన్న స్థలాలను లీజ్‌కు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఆలోచనలో ఉంది.

రహేజా సంస్థలు కూడా అదే ప్రతిపాదనతో రావడంతో.. పోర్ట్‌ యాజమాన్యం.. అందుకు అనుకూలంగా స్పందించింది. తన పరిధిలో ఉన్న సుమారు 17 ఎకరాల స్థలాన్ని రహేజా సంస్థకు.. 30 ఏళ్ల కాలానికి గాను లీజుకు ఇచ్చింది. ఇందుకు గాను పోర్ట్ నిర్దేశించిన 125 కోట్ల రూపాయలను ర‌హేజా గ్రూప్ చెల్లించింది. మిగతా డాక్యుమెంటేషన్ వర్క్ కూడా పూర్తి కావడంతో త్వరలోనే భూమి పూజ చేసి.. మాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని భావిస్తోంది.

రహేజా సంస్థ ఇప్పటికే భారతదేశంలోని అనేక ప్రసిద్ధ నగరాల్లో షాపింగ్ మాల్‌లను నిర్వహిస్తోంది. దానిలో భాగంగానే దేశంలోనే ఏడవ ఇన్ ఆర్బిట్ మాల్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రహేజా సంస్థ తన మొదటి మాల్‌ను 2004లో ముంబైలోని మలాడ్‌లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ముంబైలోని వాషి, హైదరాబాద్‌, పుణె, బెంగళూరు, వడోదరలో మొత్తం ఆరు నగరాల్లో మాల్స్‌ స్థాపించింది. ఇక ఏడవ మాల్‌ని ఏపీలో ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది విశాఖలో ఏర్పాటు చేయబోయే మాల్‌ నిర్మాణ పనులు ప్రారంభించనుంది.

Show comments