ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వడివడిగా దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమంపై ఆయన దృష్టి పెడుతున్నారు. దీంతో ఫలితాలు కూడా అద్భుతంగా కనిపిస్తున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2023 వరకు ఎస్సీ కుటుబాలకు సాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని మొత్తం 24 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 53,85,270 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించారు.
దేశవ్యాప్తంగా 53.85 లక్షల మందికి సాయం అందితే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 96.39 శాతం అంటే 51,91,091 ఎస్సీ కుటుంబాలు ఉండటం గమనార్హం. భారత్‌లోని మరే ఇతర రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటంబాలకు సాయం అందించలేదు. దేశంలో ఉన్న ఎస్సీలకు అందిన సాయం విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ రిపోర్టు స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాల పురోగతిపై విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది.
కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదికలో టార్గెట్ కంటే 90 శాతం పైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు బాగుందని, లక్ష్యాల్లో 80 శాతం నుంచి 90 శాతం మధ్య సాధిస్తే మంచి పనితీరు చూపిందని.. 80 శాతం లోపు ఉంటే ఆయా రాష్ట్రాల పనితీరు పేలవంగా ఉందని విశ్లేషించింది. గతంలో ఏప్రిల్ నెల నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ చేసిన రిపోర్టులో ఏపీలో 33.57 లక్షల ఎస్సీ కుటుంబాలకు సాయం అందిందని, ఆ తర్వాత జనవరి నుంచి మార్చి వరకు అదనంగా మరో 18.34 లక్షల కుటుంబాలకు సాయం అందిందని నివేదిక స్పష్టం చేసింది. ఎస్సీలకు సాయం అందించడంలో దేశంలో ఏపీ తర్వాత స్థానంలో కర్ణాటక ఉంది. ఆ రాష్ట్రంలో 59,345 ఎస్సీ కుటుంబాలకు సాయం అందింది.
గత ఆర్థిక ఏడాది పట్టణాల్లో ఉన్న పేదలకు చేయూతను అందించడంలోనూ దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేసులో ఉన్నట్లు కేంద్ర నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 8.49 లక్షల మంది పట్టణ పేదలకు సాయం అందగా.. అందులో 7.24 లక్షల మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని కేంద్ర రిపోర్టు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని నూటికి నూరు శాతం అమలు చేశారని ప్రశంసించింది. గతేడాది దేశవ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో కూడా ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్రంలో 7.61 లక్షల డెలివరీలు జరిగాయని రిపోర్టు తెలిపింది. ఏపీలో అంగనవాడీ కేంద్రాలు వందకు వంద శాతం చాలా మంచి పనితీరు కనబరిచాయని మెచ్చుకుంది.