iDreamPost
android-app
ios-app

ఏపీకి మరోమారు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రెండ్రోజులు వర్షాలు!

  • Author singhj Published - 07:48 AM, Thu - 17 August 23
  • Author singhj Published - 07:48 AM, Thu - 17 August 23
ఏపీకి మరోమారు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో రెండ్రోజులు వర్షాలు!

ఆంధ్రప్రదేశ్​లో గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎండలకు ఉక్కపోత కూడా తోడవ్వడంతో జనాలు అల్లాడిపోతున్నారు. అయితే రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఏపీని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షాలు కురుస్తాయంటోంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ మోస్తరు వానలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.

రెండ్రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పైన పేర్కొన్న జిల్లాలతో పాటు మిగిలిన పలు జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇకపోతే, బుధవారం కూడా రాష్ట్రంలో వానలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లా మందసలో 55.4 మిల్లీ మీటర్లు, గుంటూరులో 58.4, రణస్థలంలో 40.2, పార్వతీపురం మన్యం జిల్లా కొరాడలో 38.4, బాపట్లలో 35.9, గుంటూరు జిల్లా తెనాలిలో 31.2, ఏలూరు జిల్లా కుక్కునూరులో 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

ఆంధ్రప్రదేశ్​లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. గత రెండు వారాల నుంచి నైరుతి రుతుపవనాల ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. జులై నెలలో కురిసిన వానలతో సీజన్ గాడిలో పడిందని అంతా అనుకున్నారు. కానీ ఆగస్టు తొలి వారం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత రెండు వారాల్లో కేవలం అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు పడటం లేదు. ఎండలు, ఉక్కపోత దెబ్బకు ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. అన్నదాతలు వానల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు కురవకపోవడానికి బంగాళాఖాతంలో అల్పపీడనాలకు అనువైన వాతావరణం లేకపోవడంతో పాటు నైరుతి రుతుపవనాలు బలహీనపడటమే కారణమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.