ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత నెలాఖరు వరకు రాష్ట్రాన్ని వానలు ముంచెత్తాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. గత ఏడెనిమిది రోజుల నుంచి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఈ పరిస్థితికి రుతుపవనాల మందగమనమే కారణమని నిపుణులు అంటున్నారు. అయితే ఒకవైపు ఎండలు మండిపోతున్నా ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో అయితే గడిచిన నాలుగైదు రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి.
ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలతో పాటు ఉక్కపోత పరిస్థితులు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో పగటి సమయంలో ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. వానాకాలంలో ఇలాంటి వాతావరణం ఉండటం చాలా అరుదని అంటున్నారు. తీవ్రమైన ఎండలకు తోడు ఉక్కపోత దెబ్బకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆగస్టు నెల మొదట్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. అప్పటి నుంచి వాతావరణంలో మార్పులు వచ్చాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ ఉదయం 9 గంటల నుంచే ఎండ పెరుగుతుండటం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలంలో మాదిరిగా పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో ఉంటున్నాయి. సోమవారం నాడు బాపట్ల జిల్లాలో అత్యధికంగా 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని చెబుతున్నారు. అయితే ఎండలతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.