ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఏపీపీఎస్సీ మెంబర్ పరిగె సుధీర్ గౌడ్. గ్రూప్-2 ఖాళీల భర్తీ కోసం ఫైనాన్షియల్ క్లియరెన్స్ జరుగుతోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ వేదికగా ఆయన ప్రకటించారు. ఇందుకు కృషి చేసిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ డి.గౌతం సవాంగ్‌తో పాటు సలాం బాబుకు ధన్యవాదాలు తెలిపారు సుధీర్ గౌడ్. ప్రస్తుత నియామక ప్రక్రియపై ప్రతిపాదిత జోనల్ వ్యవస్థ ఎలాంటి ప్రభావం చూపించదని ఆయన స్పష్టం చేశారు.
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 రాత పరీక్షలకు సంబంధించి కొత్త సిలబస్ విడుదలైన సంగతి తెలిసిందే. దీని ప్రకారం.. మొత్తం 450 మార్కులకు గానూ రెండు దశల రాత పరీక్షల ద్వారా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అభ్యర్థులను ఎంపిక చేయనుంది. తొలి దశలో 150 మార్కులకు స్క్రీనింగ్ టెస్ట్.. అనంతరం రెండో దఫాలో 300 మార్కులకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధిస్తేనే మెయిన్స్ ఎగ్జామ్‌కు అర్హులవుతారు. ప్రిలిమ్స్‌లో ఈసారి కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చారు.
ఏపీ గ్రూప్-2కు సంబంధించి సవరించిన కొత్త సిలబస్, పరీక్షా విధానం ప్రకారం.. 150 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్టులో భారతదేశ చరిత్ర, భూగోళశాస్త్రంతో పాటు భారతీయ సమాజం, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. వాటిలో ఒక్కొక్కటి 150 మార్కులకు (మొత్తం 300 మార్కులు) ఉంటుంది. పేపర్-1లో ఏపీ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఆర్థిక వ్యవస్థతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ప్రశ్నలు అడగనున్నారు.