అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్​కు ఎంపికైన ఏపీలోని 11 రైల్వే స్టేషన్లు.. వాటి వివరాలివే..!

  • Author singhj Published - 12:50 PM, Mon - 31 July 23
  • Author singhj Published - 12:50 PM, Mon - 31 July 23
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్​కు ఎంపికైన ఏపీలోని 11 రైల్వే స్టేషన్లు.. వాటి వివరాలివే..!

మన దేశంలో ప్రయాణాల కోసం ఎక్కువగా ఆధారపడేది బస్సులు, రైళ్ల పైనే అనేది తెలిసిందే. సాధారణ ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. తక్కువ ధరలో జర్నీ చేసే సౌకర్యం ఉండటం, అంతర్​జిల్లాతో పాటు అంతర్​రాష్ట్ర ప్రయాణాలు సులువుగా చేసే అవకాశం ఉండటంతో వీటి మీదే అధికంగా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా రైళ్లలో ఎంత దూరమైనా ప్రయాణాలు చేయొచ్చు. అందుకే రైల్వే స్టేషన్లు ఎప్పుడూ ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. కొన్ని స్టేషన్లు ఎప్పుడూ ప్యాసింజర్లతో నిండిపోతాయి. అలాంటి రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం.

రద్దీ అధికంగా ఉండే రైల్వే స్టేషన్లను గుర్తించి, ఆధునికీకరించే టార్గెట్​తో కేంద్ర సర్కారు ఈ ఏడాది ‘అమృత్ భారత్ స్టేషన్’ స్కీమును ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్యాసింజర్లకు మెరుగైన వసతులు కల్పించేలా పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మార్చనున్నారు. ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్​ నుంచి తొలి విడతలో 11 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. రైల్వే స్టేషన్ల ఎంపిక విషయాన్ని విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏపీలో తొలి విడత కింద ఎంపికైన రైల్వే స్టేషన్లలో అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపురం, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని ఉన్నట్లు పాటిల్ చెప్పారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సెలెక్ట్ అయిన రైల్వే స్టేషన్లలో భారీ మార్పులు చేయనున్నట్లు డీఆర్ఎం నరేంద్ర ఆనందరావు తెలిపారు. ఈ స్కీమ్ కింద ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ వ్యాప్తంగా మొత్తం 1,275 స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు గానూ ఎంపిక చేశారు. అందులో ఏపీ నుంచి 72 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఎంపికైన రైల్వే స్టేషన్లలో రాకపోకలు మరింత సులువయ్యేలా ప్రయాణికులకు కొత్త అనుభూతిని పంచేలా సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ఆయా స్టేషన్లలో విశాలమైన ప్లాట్​ఫామ్​లు, 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్​లు, ఎస్కలేటర్లు, లిఫ్టులు, ఫర్నీచర్ లాంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

Show comments