iDreamPost
android-app
ios-app

స్కిల్ స్కామ్ అందరికీ తెలుసు! ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఏమిటి?

  • Published Sep 26, 2023 | 2:59 PM Updated Updated Sep 26, 2023 | 2:59 PM
  • Published Sep 26, 2023 | 2:59 PMUpdated Sep 26, 2023 | 2:59 PM
స్కిల్ స్కామ్ అందరికీ తెలుసు! ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఏమిటి?

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆయనను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. మరో ఐదు రోజులు కస్టడీకి అప్పగించాలంటూ.. సీఐడీ.. ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇక చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన తర్వాత.. విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. మరి ఇంతకు ఈ కేసు ఏంటి అంటే..

లింగమనేని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు లాభం చేకూర్చడం కోసం.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, మాజీ మంత్రి నారాయణ.. కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారని.. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని సీఐడీ దర్యాప్తులో వెల్లడయ్యింది. క్విడ్‌ప్రోలో భాగంగా అలైన్‌మెంట్‌లో మార్పులకు బదులుగా.. ఈ కేసులో ఏ1గా ఉన్న చంద్రబాబుకి కరకట్ట నివాసం, ఏ2గా ఉన్న నారాయణకు సీడ్‌ క్యాపిటల్‌ భూములు దక్కాయని సీఐడీ దర్యాప్తులో తేలింది.

అసలేం జరిగింది అంటే..

రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు హయాంలో ఎంత అవినీతి చోటు చేసుకుందో అందరికి తెలిసిన విషయమే. ఇక అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అంతా బాబు కనుసన్నల్లోనే జరిగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో చంద్రబాబు నాయుడే సీఆర్‌డీఏ ఎక్స్‌ అఫీషియో చైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు మాస్టర్‌ ప్లాన్‌ గురించి మొత్తం ముందే తెలుసు. రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఖరారు ప్రక్రియలో చంద్రబాబుకి పూర్తి భాగస్వాయ్యం ఉంది.

అయితే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా లింగమనేని రమేష్‌ కుటుంబంతో.. చంద్రబాబు, నారాయణ క్రిడ్‌ప్రోకు పాల్పడ్డారని స్పష్టమయ్యింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో.. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడు సార్లు మార్చారు అనే దానికి ప్రాథమిక ఆధారాలున్నాయని దర్యాప్తులో వెల్లడయ్యింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్‌ 4, 2018 అక్టోబరు 31న ఇలా మొత్తంగా మూడుసార్లు ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు జరిగాయి.

కరకట్ట నివాసానికి లింగమనేని రమేష్‌ టైటిల్‌దారు..

ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్‌ కుటుంబానికి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకుని.. 168.45 ఎకరాలు ఉన్నాయి. ఈ క్రమంలో లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకు బదులుగా లింగమనేని రమేష్‌ తన నివాసాన్ని చంద్రబాబుకి ఇచ్చారు. ఆ నివాసంలో ఏడేళ్లుగా బాబు ఉంటున్నారు. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ ఇప్పటికి కూడా చంద్రబాబు అదే ఇంట్లో నివసిస్తున్నారు. అయితే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసానికి ఏ3గా ఉన్న లింగమనేని రమేశ్‌ టైటిల్‌దారుగా ఉన్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు జరపలేదని సీఐడీ వెల్లడించింది.

కానీ టీడీపీ శ్రేణులు మాత్రం.. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్‌ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్‌ ప్రోకోలో భాగంగానే లింగమనేని.. కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.

హెరిటేజ్‌ భూముల లావాదేవీలు గోప్యం..

అంతేకాక లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదు. అలానే లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్‌ ఫుడ్స్‌ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని దర్యాప్తులో తేలింది.

లోకేశ్‌దే కీలక పాత్ర…

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌లో లోకేష్‌దే కీలక పాత్ర అంటుది సీఐడీ. క్విడ్‌ ప్రోకో కింద అమరావతిలో ఉన్న తమ భూములను లింగమనేని కుటుంబం హెరిటేజ్‌కు బదలాయించడంలో లోకేశ్‌ కీలక పాత్ర పోషించారన్నది వెల్లడయ్యింది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. ఆ సమయంలో హెరిటేజ్‌ డైరెక్టర్‌గా లోకేశ్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్‌ ప్రోకో కింద హెరిటేజ్‌ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్‌ కీలక పాత్ర పోషించారన్నది స్పష్టమైంది.

కథ నడిపిన నారాయణ..

అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం కూడా భారీగా ప్రయోజనం పొందినట్లు సీఐడీ స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని దర్యాప్తులో వెల్లడయింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌లో నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు.. సీడ్‌ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారన్నదానికి ప్రాథమిక ఆధారాలున్నాయని సీఐడీ వెల్లడించింది. వీరు సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములనే తర్వాత భూసమీకరణ కింద.. సీఆర్‌డీఏకి ఇచ్చి.. 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని దర్యాప్తులో తేలింది. పైగా ఈ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని తెలిసింది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్‌ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్‌ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడి పేరుని ఏ1గా చేర్చగా.. లోకేష్‌ పేరును ఏ14గా చేర్చింది సీఐడీ.