iDreamPost

మన మజిలీ మరాఠిలోనూ హిట్టే

మన మజిలీ మరాఠిలోనూ హిట్టే

2019లో వచ్చిన మజిలీ నాగచైతన్య కెరీర్లోనే అతి పెద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విడాకులు తీసుకోవడానికి ముందు చేసిన ఈ సినిమా అభిమానులకు చాలా స్పెషల్. గోపి సుందర్ పాటలు, చైతు సామ్ ల కెమిస్ట్రీ. శివ నిర్వాణ టేకింగ్, హృద్యంగా సాగే ఎమోషన్స్ వెరసి దీన్నో సక్సెస్ ఫుల్ మూవీగా నిలబెట్టాయి. అందుకే అక్కినేని ఫ్యాన్స్ మజిలీని ప్రత్యేకంగా చూస్తారు. నాలుగేళ్ల తర్వాత ఇది మరాఠిలో వేద్ గా రీమేక్ అయ్యింది. రితీష్ దేశముఖ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా రూపొంది డిసెంబర్ 30న విడుదలై కేవలం మూడు రోజులకే పది కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఇంత తక్కువ గ్యాప్ లో ఈ మార్కు అందుకున్న చిత్రం ఇదేనట

ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. మజిలీలో చైతన్య సమంతాలు ఎలాగైతే నిజమైన భార్యా భర్తలో ఇప్పుడీ వేద్ లో రితీష్ దేశముఖ్ జెనీలియా కూడా రియల్ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ లు. వీళ్లకు పిల్లలు కూడా ఉన్నారు. రీ ఎంట్రీ కోసం సరైన కథతో కంబ్యాక్ ఇచ్చిన బొమ్మరిల్లు హాసిని ఆనందం ఇప్పుడు మాములుగా లేదు. తన ఈడు వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోతే తను మాత్రం ఇంకా హీరోయిన్ పాత్రలో అంగీకరింపబడటం చిన్న విషయం కాదు. వేద్ కి మహారాష్ట్రలో భారీ వసూళ్లు దక్కుతుండగా ఢిల్లీ లాంటి బయట నగరాల్లోనూ కలెక్షన్లు బాగున్నాయి. హైదరాబాద్ లో కొన్ని షోస్ ఇచ్చారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు

మరాఠి పరిశ్రమ చాలా చిన్నది. అక్కడ వందల కోట్లనేది కలలో మాట. పరిమిత బడ్జెట్ లో సినిమాలు తీస్తూ రిస్క్ లేకుండా చూసుకుంటున్నారు. హిందీ చిత్రాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది కాబట్టి వీటి మీద ఫోకస్ తక్కువే. అయితే ఇటీవలి కాలంలో ఎంటర్ టైన్మెంట్ రంగంలో మరాఠి పరిధి చాలా పెరిగింది. ప్రత్యేకంగా ఓటిటిలు వచ్చాయి. వెబ్ సిరీస్ లు తీస్తున్నారు. ఆడియన్స్ పెరుగుతున్నారు. థియేటర్లకు జనం బాగా వస్తున్నారు. బాలీవుడ్ కు పోటీ ఇచ్చే దిశగా సైరాత్ నుంచే పరుగులు మొదలుపెట్టిన మరాఠి సినిమా ఇప్పుడీ వేద్ తో కొత్త మార్పు దిశగా వెళ్తోంది. మరి తెలుగులో ఏవైనా అవకాశాలు వస్తే జెనీలియా ఎస్ అంటుందో లేదో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి