Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధం గురించి సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రోజు హిట్‌మ్యాన్ చెప్పిన ఆ ఒక్క మాటతో అతడిపై మరింత రెస్పెక్ట్ పెరిగిందన్నాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధం గురించి సంజూ శాంసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ రోజు హిట్‌మ్యాన్ చెప్పిన ఆ ఒక్క మాటతో అతడిపై మరింత రెస్పెక్ట్ పెరిగిందన్నాడు.
Nidhan
సంజూ శాంసన్.. టీ20 వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ సమయంలో బాగా వినిపించిన పేరు. ఈ వికెట్ కీపర్, బ్యాటర్ భారత జట్టులో ఉండాల్సిందేనని జోరుగా డిమాండ్లు వచ్చాయి. బ్యాటింగ్, కీపింగ్, ఫిట్నెస్.. ఇలా అన్నింటా సంజూ తనను తాను నిరూపించుకున్నాడని, అతడ్ని జట్టులోకి తీసుకోవాల్సిందేనని భారత క్రికెట్ బోర్డును కోరారు అభిమానులు. ఐపీఎల్-2024లో శాంసన్ అదరగొట్టడంతో అతడ్ని టీమ్‌లోకి తీసుకోక తప్పలేదు. అయితే 9 ఏళ్ల కిందే ఇంటర్నేషనల్ డెబ్యూ ఇచ్చిన సంజూ.. టీమ్‌లో తన ప్లేస్‌ను మాత్రం పదిలపర్చుకోలేదు. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన టైమ్‌లోనూ ఇబ్బందులు పడ్డాడు. ఆ రోజుల్ని గుర్తుచేసుకున్నాడీ డాషింగ్ బ్యాటర్. ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ తనకు ఇచ్చిన సపోర్ట్ గురించి షేర్ చేసుకున్నాడు.
జింబాబ్వే జట్టుతో 2015లో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు సంజూ శాంసన్. అయితే అనుకున్నంతగా రాణించకపోవడంతో టీమ్‌కు దూరమయ్యాడు. మళ్లీ జట్టులోకి రావడానికి చాలా కాలం పట్టింది. శ్రీలంక సిరీస్‌తో టీమిండియాతో తన జర్నీని తిరిగి స్టార్ట్ చేశాడు. అప్పటి రోజుల్ని ఓ ఇంటర్వ్యూలో అతడు గుర్తుచేసుకున్నాడు. ఆ సిరీస్ టైమ్‌లో రోహిత్ తనతో మాట్లాడిన క్షణాల్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. హిట్‌మ్యాన్ చెప్పిన ఆ ఒక్క మాటతో అతడిపై తనకు ఉన్న గౌరవం మరింత పెరిగిందన్నాడు. టీమ్‌తో జాయిన్ అయ్యాక తనతో మాట్లాడిన మొదటి వ్యక్తి రోహితేనని తెలిపాడు శాంసన్.
‘భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడాక టీమ్‌లో చోటు కోల్పోయా. మళ్లీ 5 ఏళ్ల తర్వాత జట్టులోకి తిరిగొచ్చా. 24 ఏళ్ల వయసులో నేను కమ్‌బ్యాక్ ఇచ్చా. టీమ్‌లోకి నేను రాగానే నాతో రోహిత్ భాయ్ మాట్లాడాడు. జట్టుతో చేరగానే నాతో మాట్లాడిన మొదటి వ్యక్తి అతడే. సంజూ ఎలా ఉన్నావ్? అంతా ఓకేనా? నువ్వు ఐపీఎల్లో చాలా బాగా ఆడావ్. ముంబై ఇండియన్స్ మీద భారీ సిక్సులు కొట్టావ్ అంటూ నన్ను మెచ్చుకున్నాడు. నాకు కావాల్సిన సపోర్ట్‌ను అతడు అందించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో ఓ రోజు ఏం తోచక నా రూమ్‌లో ఒంటరిగా కూర్చున్నా. అప్పుడు రోహిత్ భాయ్ కాల్ చేసి డిన్నర్‌కు వెళ్దామని పిలిచాడు. భోజనం సమయంలో రేపు సిక్సర్లు కొట్టు అంటూ ప్రోత్సహించాడు. అతడి మాటలు నాలో ఎనలేని విశ్వాసం నింపాయి’ అని చెబుతూ సంజూ ఎమోషనల్ అయ్యాడు.