పాఠశాల ఉపాధ్యాయులు ఏం చేస్తారు?. అసలు ఇది ప్రశ్నేనా అనే సందేహం మీకు రావచ్చు. అంతేకాక టీచర్లు ఏం చేస్తారు పిల్లలకు చదువు చెప్తుంటారు. ఇదే చాలా మంది చెప్పే సమాధానం. ఆ విధంగానే ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధిస్తుంటారు. పిల్లలకు తెలియని ఎన్నో విజ్ఞాన విషయాలను చెబుతుంటారు. అందుకే సమాజంలో గురువుల పట్ల ఎంతో గౌరవం ఉంటుంది. కానీ కొందరు టీచర్ల నిర్వాకం కారణంగా ఆ వృతికే అపకీర్తి వస్తోంది. తాజాగా కొందరు ఉపాధ్యాయురాలు చేసిన పనిపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఉన్న సోషల్ మీడియా పిచ్చి..పిల్లపై రుద్దే ప్రయత్నం చేశారు. అంతేకాక తమ ఇన్ స్టా రీల్స్ కి లైక్ చేయకుంటే కొడతామని బెదిరించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలోని స్థానిక పాఠశాలలో కొందరు మహిళా టీచర్ల చదువు చెప్పడం పక్కన పెట్టి.. రీల్స్ చేయడం ప్రారంభించారు. విద్యాబుద్దులు చెప్పాల్సిన ఈ పంతులమ్మలు సోషల్ మీడియాకు బానిసలై విద్యార్థులను వేధింపులకు గురి చేశారు. నిత్యం పాఠశాలకు వచ్చినా కూడా రీల్స్ చేయడంలో మునిగితేలేవారు. స్కూలుకు రావడం ఆలస్యం అన్నట్టు వచ్చీ రావడమే రీల్స్‌కు రెడీ అయిపోతున్నారట. ‘రవిపూజా’ అనే ఖాతాలో రీల్స్ పోస్టు చేస్తున్న టీచర్ స్కూల్‌లోనే వాటిని షూట్ చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు
అంతేకాక.. తాము చేసిన రీల్స్ కు లైక్ కొట్టాలని, షేర్ చేయాలని విద్యార్థులను హెచ్చరించారు. ఇన్ స్టాగ్రామ్ లో తమ రీల్స్ ను లైక్ చేయకుంటే కొడతామని విద్యార్థులను ఆ టీచర్లు బెదిరించారు. విద్యార్థులు చేయడంతో పాటు మరికొందరితో చేయించాలని వారిపై ఒత్తిడి తెచ్చారు. ఇక టీచర్ల వేధింపులను భరించలేక పోయిన విద్యార్థులు.. ఇదే విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. రీల్స్ కాకుండా తమతో బయట నుంచి టీ, ఆహారం వంటివి తెప్పించుకుంటున్నారని విద్యార్థులు చెప్పారు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు కలెక్టర్ వద్దకెళ్లి ఫిర్యాదు చేశారు.
తమ పిల్లల్ని స్కూళ్లకు చదువుకోవటానికి పంపిస్తున్నామని, టీచర్లు చేసే రీల్స్ లైక్,షేర్,సబ్‌స్క్రైబ్ చేయటానికి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశఆరు. ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ఆ మహిళ టీచర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. దీంతో స్కూల్‌లో నడుస్తున్న ఈ రీల్స్ వ్యవహారంపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వర్ ఆర్తి గుప్తా దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలో రీల్స్ చేస్తున్న టీచర్లను అంబికా గోయల్, పూనమ్ సింగ్, నీతూ కశ్యప్ అని గుర్తించారు. అయితే ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని గంగేశ్వరి గుప్తా తెలిపారు. మరీ.. రీల్స్ పిచ్చి పంతులమ్మలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి