iDreamPost

జగన్‌కో వైశ్రాయ్ … టీడీపీ నేత ఆనంద్‌ సూర్య..

జగన్‌కో వైశ్రాయ్ … టీడీపీ నేత ఆనంద్‌ సూర్య..

75 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారు… మీరు చదువుతున్నది నిజమే. ఈ మాటలు సరదాగా ఓ సామాన్య వ్యక్తి అన్నది కాదు. టీడీపీ నేత, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్య చాలా సీరియస్‌గా పై విధంగా ప్రకటన చేశారు.

మండలి రద్దు వార్తల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీకి ఇప్పటికే ఇద్దరు దూరమయ్యారు. దాదాపు పది మంది వరకూ మౌనంగా, అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు తన ఎమ్మెల్సీలను కాపాడుకునేందుకు వారికి భవిష్యత్‌పై భరోసా ఇస్తున్నారు. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్సీలకు, పార్టీ నేతలకు ఓ కథ చెప్పి ఉంటారు. వైఎస్‌ జగన్‌తో వేగలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని వారిని బలంగా నమ్మించే మాటలు చెప్పి ఉంటారు. అది పట్టుకుని వేమూరి ఆనంద్‌ సూర్య పై విధంగా ప్రకటించి ఉంటారు.

మాటలతో మ్యాజిక్‌ చేయడం, చెప్పిందే పదే పదే చెప్పి తన చుట్టూ ఉండేవాళ్లను, తనతో నడిచేవాళ్లను నమ్మించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గ్లోబెల్స్‌ని తలదన్నేలా చంద్రబాబు ప్రచారం ఉంటుందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. దీనికి పెద్ద ఉదహారణ.. వైశ్రాయ్ ఘటన. 1995 ఆగస్టులో ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి దించి తాను ఆ పీఠం ఎక్కేందుకు ఆయన చేసిన ప్రచారమే పెద్ద సాక్ష్యం. ముందుగా లక్ష్మీ పార్వతిపై దష్ప్రచారం చేసి ఏదో జరిగిపోతోందని, పార్టీని కాపాడుకోవాలనే భావనను ఆ పార్టీ నేతల్లో బలంగా నెలకొల్పారు. ఆ తర్వాత వైశ్రాయ్ ఎపిసోడ్‌ను తెరమీదకు తెచ్చారు.

చంద్రబాబు శిబిరంలో భారీగా ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రచారం చేశారు. వైశ్రాయ్ భారీగా ఎమ్మెల్యేలు ఉన్నారని, గంట గంటకు ఈ సంఖ్య పెరుగుతోందని నమ్మించాడు. ఎక్కడ తాము వెనకబడిపోతామోన్న భావనలో మిగతా ఎమ్మెల్యేలు అక్కడకి చేరుకోవడం మొదలుపెట్టారు. అక్కడకు వెళ్లిన తర్వాతే ఎమ్మెల్యేలకు అసలు విషయం బోధపడింది. ఒకసారి వెళ్లిన వారు తిరిగి రాలేని ఉచ్చులాంటి వ్యూహమది. మరో వైపు తన వద్ద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యా బలం లేనప్పటికీ ఉందని చెబుతూ చంద్రబాబు గవర్నర్‌ను కలిశారు. ఇలా ఓ కథ నడిపి ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలను వైశ్రాయ్ రప్పించుకుని, వచ్చిన వారు మళ్లీ చేజారకుండా గవర్నర్‌ ఎపిసోడ్‌ను నడిపారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేసి దిగిపోయిన ఐవైఆర్‌ కృష్ణారావు.. టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ధ్వజమెత్తారు. ఐవైఆర్‌కు కౌంటర్‌గా వేమూరి ఆనంద్‌ సూర్య మాట్లాడారు. ఐవైఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాని ఫలితమే.. ఆనంద్‌ సూర్యకు బ్రహ్మణ కార్పొరేషన్‌ పదవి దక్కింది. అంతకు ముందు వేమూరి ఆనంద్‌ సూర్య అంటే రోజూ రాజకీయాలను గమనిస్తున్న వారికే కాదు, మీడియా, చివరకు టీడీపీ నాయకులకే తెలియదు.

ఒక వేళ వేమూరి ఆనంద్‌ సూర్య చెప్పిన్న దాంట్లో కొసరంతైనా వాస్తవం ఉంటే.. ఈ ఈపాటికి చంద్రబాబు అనుకూల మీడియా.. చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూ.. వైఎస్‌ జగన్‌ వైఖరిని తప్పబడుతూ కథనాలు వండి వార్చేది. చంద్రబాబు చాణక్యాన్ని ఆకాశానికెత్తేది. రేపో, మాపో గవర్నర్‌ను కలవనున్న చంద్రబాబు అంటూ వార్తలు వచ్చేవి. అంతేకానీ ఎమ్మెల్సీలకు వైఎస్సార్‌సీపీ గాలం వేస్తోందని కథనాలు రాసేది కాదు. 75 మంది కాదు కదా కనీసం ఓ ఏడుగురు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు టచ్‌లో ఉండి ఉంటే.. ఆయన తీరు మరోలా ఉండేది. కానీ స్వయంగా చంద్రబాబే.. ‘‘మా పార్టీ ఎమ్మెల్సీలను కొనడానికి చూస్తున్నారు, బెదిరిస్తున్నారు, అయినా మా ఎమ్మెల్సీలు నీతి నిజాయతీతో ఉన్నార’’ంటూ మాట్లాడేవారు కాదు. ఈ పాటికే క్యాంపు రాజకీయాలకు తెరతీసేవారు. ఆ క్యాంపుకు వేమూరి ఆనంద్‌ సూర్యను ఇన్‌ఛార్జిగా పెట్టేవారు.

ఇలాంటి ప్రకటనలు చేస్తున్న ఆనంద్‌ సూర్యతోపాటు చంద్రబాబు వీర విధేయులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలో ఇప్పటికే వల్లభనేని వంశీ, మాద్దాలి గిరిలు సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత వారు టీడీపీ దూరంగా ఉంటున్నారు. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు యత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. అందుకే టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీలో కూడా ఆ సీనియర్‌ నేతలు మాట కూడా మాట్లాడడం లేదు. పార్టీలో చేరే ఎమ్మెల్యేలు పదవి రాజీనామా చేసి రావాలన్న నిబంధనను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విధించకపోతే.. ఈ పాటికి టీడీపీ ఖాళీ అయ్యేది. చివరగా.. చంద్రబాబుకు వీర విధేయుడు, పరిటాల రవీంద్ర అనుచరుడుగా ఉన్న పోతుల సురేష్‌ కూడా తన సతీమణి ఎమ్మెల్సీ పోతుల సునీతతో కలసి రెండు రోజుల క్రితం వైఎస్‌ జగన్‌ను కలవడం ఆనంద్‌ సూర్య లాంటి వారు గమనించాల్సిన విషయం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి