iDreamPost

అధిష్టానాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న టీడీపీ ఎమ్మెల్సీలు, ర‌స‌వ‌త్త‌రంగా మండ‌లి రాజ‌కీయం

అధిష్టానాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న టీడీపీ ఎమ్మెల్సీలు, ర‌స‌వ‌త్త‌రంగా మండ‌లి రాజ‌కీయం

ఏపీలో శాస‌న‌మండ‌లి వ్య‌వ‌హారం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. రాజ‌కీయ కోణంలో బిల్లులు అడ్డుకోవ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం చివ‌ర‌కు మండ‌లికే ముప్పు తెస్తుంద‌నే సంకేతాలు రావ‌డంతో ఎమ్మెల్సీల్లో క‌ల‌వ‌రం మొద‌ల‌య్యింది. త‌మ కుర్చీల కింద‌కే నీళ్లు వ‌స్తున్నాయ‌నే ఆందోళ‌న వారిలో క‌నిపిస్తోంది. దాంతో అమ‌రావ‌తి క‌న్నా , అధిష్టానం క‌న్నా త‌మ ప‌ద‌వే మిన్న‌గా ప‌లువురు భావిస్తున్నారు. చంద్ర‌బాబు ఎంత భ‌రోసా ఇస్తున్నా టీడీపీ నేత‌ల‌కు ధీమా క‌నిపించ‌డం లేదు.

జ‌గ‌న్ చెప్పాడంటే..చేస్తాడంతే అనే నినాదం వారిలో క‌ల‌వ‌రం క‌లిగిస్తోంది. మండ‌లి ర‌ద్ద‌యితే అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌నే బెంగ ముంచుకొస్తోంది. ఇంకా మూడేళ్ల‌కు పైగా ప‌ద‌వీ కాలం ఉన్న వారే మెజార్టీ ఉన్నారు. అలాంటి నేత‌ల‌కు ఇప్ప‌టికిప్పుడు ఎమ్మెల్సీ హోదా కోల్పోయే ప్ర‌మాదం పొంచి ఉండ‌డంతో ప్ర‌మాదం నుంచి గ‌ట్టెక్కే ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు క‌నిపిస్తోంది.

Read Also: మండ‌లికి మంగ‌ళం పాడితే వాళ్ల ప‌రిస్థితి ఏమిటీ?

తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఇది పెద్ద త‌ల‌నొప్పిగా మారుతోంది. రాజ‌కీయంగా వైసీపీకి ఉన్న అధికారం త‌మ ఎమ్మెల్సీల‌ను దూరం చేస్తుంద‌నే భ‌యం వెంటాడుతోంది. అలాంటి ఎమ్మెల్సీలంద‌రికీ తాను అండ‌గా ఉంటాన‌ని చెప్పేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నారు. 1985 ప్ర‌జాస్వామ్య పున‌రుద్ద‌ర‌ణ పేరుతో ఎన్టీఆర్ హ‌యంలో జ‌రిగిన అనుభ‌వాల‌తో ఈ ప‌రిణామాల‌ను పోల్చుతున్నారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా ఆర్థికంగా పార్టీ నుంచి స‌హాయం అందిస్తామ‌ని కూడా చెప్పే య‌త్నం జ‌రిగింది. రాజ‌కీయంగా ప‌ద‌వుల‌కు ఢోకా లేకుండా చూస్తామ‌ని ఆయ‌న హామీలు ఇస్తున్నారు. అయితే చంద్ర‌బాబు హామీల‌ను మెజార్టీ టీడీపీ నేత‌లు విశ్వ‌సించ‌డం లేద‌ని ప్ర‌చారం మొద‌ల‌య్యింది. త‌మ‌కు ఎమ్మెల్సీ హోదా ఇవ్వ‌డానికి పెట్టిన ష‌ర‌తులు, ఆ సంద‌ర్భంగా వ్య‌వ‌హ‌రించిన తీరు కొంద‌రు గుర్తు చేసుకుంటున్నారు. అవ‌కాశం ఉన్న స‌మ‌యంలో అనుగుణంగా మార్చుకోవాలే త‌ప్ప‌, ఒక‌సారి చేజారితే మ‌ళ్లీ త‌మ‌కు ఈ ప‌ద‌వి ద‌క్కుతుందో లేదోన‌నే భ‌యాందోళ‌న వారిని వెంటాడుతోంది. బాబుని న‌మ్ముకుని ఉన్న మండ‌లిని చేజార్చుకోవ‌డ‌మా..లేక మండ‌లిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మా అనే ప్ర‌త్యామ్నాయాల్లో రెండో దానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్న‌ట్టు చెబుతున్నారు.

Read Also: ఇద్ద‌రు మంత్రులు భవిషత్తు ?

ఇప్ప‌టికే టీడీపీకి బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న వారు తుది నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన అంగ‌ర రామ్మోహ‌న్ రావు, దువ్వూరి రామారావు వంటి ఎమ్మెల్సీలు ఇప్ప‌టికే అధిష్టానానికి అందుబాటులో లేర‌ని స‌మాచారం. వారితో పాటుగా అర‌డ‌జ‌ను మంది ఎమ్మెల్సీలు బాబు వెంట న‌డిస్తే త‌మ‌కు భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇంకా మ‌రికొంద‌రు కూడా మండ‌లిని కాపాడుకునే య‌త్నంలో ఏం చేయ‌డానికైనా సంసిద్ధుల‌మే అన్న‌ట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. 27వ తేదీ ఉద‌యం క్యాబినెట్ భేటీ జ‌ర‌గ‌బోతోంది. అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌భుత్వానికి త‌మ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించే అవ‌కాశం ఎమ్మెల్సీల‌కు ఉంటుంది. అప్ప‌టి వ‌ర‌కూ మెజార్టీ త‌మ వైపు మొగ్గు చూప‌క‌పోతే ఇక మండ‌లికి మంగ‌ళం పాడ‌డ‌మే అనే సంకేతాల‌ను ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇచ్చేస్తున్నారు. దాంతో ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్సీల్లో ఇప్ప‌టికే ముగ్గురు చేజారిపోయారు. కాగా మ‌రో 10 మంది ఎమ్మెల్సీలు కూడా బైబై బాబు అంటే మాత్రం ఇక ఆపార్టీ ఆశ‌లు నెర‌వేరే అవ‌కాశం లేదు.

Read Also: మండలి రద్దుపై చంద్రబాబు Uturn తీసుకుంటారా ?

ఎమ్మెల్సీల‌ను కాపాడుకునే య‌త్నంలో టీడీపీ గ‌ట్టిగా శ్ర‌మిస్తోంది. చేజారిపోతే మొత్తం రాజ‌కీయంగా సీన్ మారిపోయే ప్ర‌మాదం ఉన్నందున అన్ని ర‌కాల ఎత్తులు వేస్తోంది. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీలు ఎంత‌మంది త‌మ వెంట నిలుస్తారోన‌నే ధీమా టీడీపీ క్యాంపులో క‌నిపించ‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టు విడ‌వ‌కూడ‌ద‌నే బాబు ప్ర‌య‌త్నాల‌తో ముందుకు సాగుతున్నారు. సీనియ‌ర్ టీడీపీ నేత‌లు కూడా మండ‌లి ర‌ద్దు ప‌ట్ల ఆందోళ‌న చెందుతున్న త‌రుణంలో టీడీపీ వెంట ఎంత మంది నిలుస్తారోన‌నేది ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది. దాంతో జంపింగ్ చేస్తారా..లేక మండ‌లి ని కాపాడుకునేందుకు మ‌రికొన్ని ఎత్తుగ‌డ‌లు వేస్తారా అన్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం అవుతోంది. ప్ర‌భుత్వం మాత్రం బిల్లుల విష‌యంలో స్ప‌ష్ట‌త కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నందును అవి కొలిక్కి వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. చివ‌ర‌కు ఏమ‌వుతుందోన‌నే ఉత్కంఠ మాత్రం ప్ర‌స్తుతం నెల‌కొని ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి