iDreamPost

ఎన్నికలు ఏవైనా సరే.. వారి ప్రస్తావన గ్యారెంటీ

ఎన్నికలు ఏవైనా సరే.. వారి ప్రస్తావన గ్యారెంటీ

ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల తర్వాత.. జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఓ ప్రస్తావన వస్తోంది. ప్రతిపక్షాలు వారి పేరును పలకకుండా ఎన్నికలు పూర్తికావడంలేదంటే అతిశయోక్తికాదు. వారే వాలంటీర్లు. అవును.. వాలంటీర్లు అనే ప్రస్తావన లేకుండా ఏపీలో ఏ ఎన్నికలు జరగడం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉంటూ అర్హులకు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందిస్తున్న వాలంటీర్లు ప్రతిపక్ష పార్టీలకు సింహస్వప్నాలుగా మారిపోయారు.

ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకపోయినా.. వారంటే ప్రతిపక్ష పార్టీలకు వెన్నులో వణుకుపుడుతోంది. అందుకే వాలంటీర్లపై ఆధారరహిత విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. వాలంటీర్లు ఓటర్లను బెదిరిస్తున్నారని, అధికార పార్టీకి ఓట్లు వేపిస్తున్నారని.. ఇలా రకరకాల విమర్శలు వాలంటీర్లపై చేస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు మాత్రం చూపడం లేదు.

వాలంటీర్ల ప్రస్తావన ఫిబ్రవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెరపైకి వచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. వాలంటీర్ల ప్రస్తావన తెచ్చారు. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలని, ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. నాటి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ బాబు వినతికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే టీడీపీ నేతలు ఆరోపణలకు ఆధారాలు లేకపోయినా.. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే తంతు జరిగింది.

వాలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉంటున్నా.. వారి వద్ద సెల్‌ఫోన్లు వెనక్కి తీసుకోవాలనే ఎస్‌ఈసీ ఆదేశాలపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రభుత్వ పథకాలు, ప్రతి నెలా జరిగే ఫింఛన్ల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందనే ప్రభుత్వ వాదనను సమర్థించిన న్యాయస్థానాలు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

తాజాగా తిరుపతి ఎన్నికల్లోనూ టీడీపీ నేతల నుంచి.. వాలంటీర్ల పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో మాదిరిగా వాలంటీర్లపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు.. వారిని ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. టీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్‌ రెడ్డి వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వారంటే ప్రతిపక్ష పార్టీ ఏ స్థాయిలో ఆందోళన చెందుతుందో అర్థమవుతోంది. వాలంటీర్లు లేకుండా ఎన్నికలకు రావాలంటూ ఆయన సవాల్‌ చేయడం విశేషం. టీడీపీ నేతలు చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలతో.. వాలంటీర్ల వ్యవస్థ ఏ స్థాయిలో విజయవంతమైందో స్పష్టంగా తెలుస్తోంది.

Also Read : విక‌టించిన వ్యూహం : చంద్ర‌బాబుకే నోటీసులు?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి