తమిళ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా ఆత్మహత్యతో కోలీవుడ్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. ఇటీవలే జైలర్ నటుడు మరిముత్తు గుండెపోటుతో మరణించిన విషాదం మరచిపోకముందే మీరా ఘటన ఇండస్ట్రీని కలచివేసింది. కాగా.. మీరా మరణంతో కోలీవుడ్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇందుకు సంబంధించి నిర్మాతల సంఘం అధ్యక్షుడు భారతీరాజా ఓ ప్రకటనను విడుదల చేశాడు. తమిళ పరిశ్రమ తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. మరిన్ని వివరాల్లోకి వెళితే..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు మీరా మంగళవారం చెన్నైలోని తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. దీంతో విజయ్ ఆంటోని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. అయితే మీరా మృతితో కీలక నిర్ణయం తీసుకుంది తమిళ నిర్మాతల సంఘం. ప్రముఖుల మృతి ఘటనల్లో ఇకనుంచి మీడియాను అనుమతించబోమని సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మీరా మరణమే కాకుండా ఇటీవల గుండెపోటుతో మరణించిన జైలర్ నటుడు మరిముత్తు విషయంలో కూడా తమిళ ప్రముఖ మీడియా ఛానల్స్ తో పాటుగా పలు యూట్యూబ్ ఛానల్స్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలోనే మరణించిన వారికి నివాళులు అర్పించేందుకు వచ్చే సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేస్తూ.. మైక్ లు పట్టుకుని ఇంటర్వ్యూలు చేసి, ఆ వీడియోలకు తప్పుడు తంబ్ నైల్స్ పెట్టి వ్యూవ్స్ కోసం పోటీపడుతున్నాయని నిర్మాతల సంఘం మండిపడింది. ఒక వ్యక్తి మరణిస్తే ఎక్కువ నష్టం బాధిత కుటుంబానికే ఉంటుంది. ఇలాంటి టైమ్ లో మీడియా, యూట్యూబ్ ఛానల్స్ వ్యవహరించే తీరు తీవ్ర బాధాకరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం అధ్యక్షుడు భారతీరాజా ప్రకటించారు.
గతంలో తమిళ నటులు వివేక్, మైలస్వామి, మనోబాల మరణించిన సంఘటనల్లో మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఇదే విధంగా ప్రవర్తించాయని వారు తెలుపుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని మీడియా గౌరవించాలని ఆయన కోరారు. పోలీసుల అనుమతి ఉన్నాగానీ.. మరణించిన వారి ఇంటి వద్దకు ఎలాంటి మీడియా వారికి అనుమతి ఉండదని ఈ ప్రకటనలో సంఘం తెలిపింది. మరి తమిళ నిర్మాతల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.