iDreamPost

DRS కోసం డ్రెస్సింగ్ రూమ్ సాయం.. రూల్​ను అతిక్రమించినట్లా? కాదా?

  • Published Jun 17, 2024 | 3:21 PMUpdated Jun 17, 2024 | 3:21 PM

టీ20 ప్రపంచ కప్-2024లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. డీఆర్ఎస్ విషయంలో బంగ్లాదేశ్ టీమ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

టీ20 ప్రపంచ కప్-2024లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. డీఆర్ఎస్ విషయంలో బంగ్లాదేశ్ టీమ్ వ్యవహరించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

  • Published Jun 17, 2024 | 3:21 PMUpdated Jun 17, 2024 | 3:21 PM
DRS కోసం డ్రెస్సింగ్ రూమ్ సాయం.. రూల్​ను అతిక్రమించినట్లా? కాదా?

టీ20 ప్రపంచ కప్-2024 గ్రూప్ దశ ముగింపునకు చేరుకుంది. మెగా టోర్నీ లీగ్ స్టేజ్​లో ఇంకా రెండు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. సూపర్-8 బెర్త్​లు కన్ఫర్మ్ అయిపోయాయి. ఏయే టీమ్స్ నెక్స్ట్​ స్టేజ్​కు చేరుకుంటాయో తేలిపోయింది. ఉన్న ఒకే ఒక్క సూపర్ బెర్త్​ను బంగ్లాదేశ్​ ఖాయం చేసుకుంది. నేపాల్​ మీద ఘనవిజయం సాధించి గ్రూప్-డీ నుంచి రెండో టీమ్​గా సూపర్-8కి క్వాలిఫై అయింది. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న నెదర్లాండ్స్​కు నిరాశే మిగిలింది. నేపాల్​తో మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది. షకీబల్ హసన్ (17) టాప్ స్కోరర్​గా నిలిచాడు. నేపాల్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో బంగ్లా బ్యాటర్లను కట్టిపడేశారు. సందీప్ లామిచానె, సోంపాల్, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడెల్ చెరో 2 వికెట్లతో రాణించారు. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన నేపాల్ తీవ్రంగా ఇబ్బంది పడింది.

ఆసిఫ్ (17) తప్ప టాపార్డర్​లో ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. కుశాల్ (27), దీపేంద్ర సింగ్ (25) పోరాడినా టీమ్​ను విజయతీరాలకు చేర్చలేకపోయారు. వాళ్లిద్దరూ తక్కువ గ్యాప్​లో పెవిలియన్​కు చేరడంతో నేపాల్ 19.2 ఓవర్లలో 85 పరుగులకు కుప్పకూలింది. ఇదే స్కోరుపై ఆ జట్టు ఆఖరి 4 వికెట్లు కోల్పోయింది. బంగ్లా బౌలర్ తన్జిమ్ నాలుగు వికెట్లతో ప్రత్యర్థి జట్టు వెన్ను విరిచాడు. అతడికి ముస్తాఫిజుర్ రెహ్మాన్ (3/7), షకీబ్ (2/9) మంచి సపోర్ట్ అందించారు. అయితే ఈ మ్యాచ్​లో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. బంగ్లా ఇన్నింగ్స్ 14వ ఓవర్​లో తంజిమ్​ను ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు లమిచానే. దీంతో పెవిలియన్​ దిశగా నడవసాగాడు తన్జిమ్. అయితే డీఆర్ఎస్​ అందుబాటులో ఉండటంతో నాన్​స్ట్రైకర్​ ఎండ్​లో ఉన్న జేకర్ అలీ ఓ పని చేశాడు. డీఆర్ఎస్​ కోసం డ్రెస్సింగ్ రూమ్​ వైపు చూశాడు.

డీఆర్ఎస్ తీసుకోవాలా? వద్దా? అంటూ డ్రెస్సింగ్ రూమ్​ వైపు సాయం కోసం చూశాడు జేకర్ అలీ. అటు నుంచి తీసుకోమంటూ సిగ్నల్ రావడంతో వెంటనే డీఆర్ఎస్​కు అప్లై చేశాడు. తంజిమ్ కూడా తన చేతితో డీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు అంపైర్ వైపు చూశాడు. దీంతో అంపైర్ రివ్యూకు ఆదేశించాడు. అప్పటికే 15 సెకన్ల టైమర్ అయిపోయినా అంపైర్ అదేమీ పట్టించుకోకుండా రివ్యూకు అనుమతించాడు. రివ్యూలో నాటౌట్​గా తేలడంతో తంజిమ్ బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

డీఆర్ఎస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ సాయం తీసుకోవడం ఏంటి? ఇది ఐసీసీ రూల్స్​లో ఉందా? అనే అనుమానాలు వస్తున్నాయి. ఇలా కూడా డీఆర్ఎస్ తీసుకోవచ్చా? అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే అంపైర్ నాన్​స్ట్రయికర్​ను సరిగ్గా గమనించలేదని.. అందుకే ఈ పొరపాటు జరిగిందని కొందరు నెటిజన్స్ అంటున్నారు. మరికొందరు మాత్రం ఇది కరెక్ట్ కాదని.. రూల్స్​కు విరుద్ధంగా బంగ్లా ప్లేయర్లు వ్యవహరించారని విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై ఐసీసీ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. మరి.. డీఆర్ఎస్ కోసం డ్రెస్సింగ్ సాయం తీసుకోవడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి