iDreamPost

ఒకే అంశం.. రెండు న్యాయస్థానాలు.. భిన్నమైన తీర్పులు..

ఒకే అంశం.. రెండు న్యాయస్థానాలు.. భిన్నమైన తీర్పులు..

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా.. రేపటి నుంచి లాక్‌డౌన్‌ అంటూ ముందు రోజు రాత్రి 8 గంటలకు ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం వలసకూలీల బతుకుల్లో ఆరని కన్నీటి వేదనను నింపింది. లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక, ఉండేందుకు గూడు లేక, తినేందుకు తిండి లేక లక్షలాది మంది వలసజీవులు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు కాలినడకన బయలుదేరి సాహసం చేస్తున్నారు. కాళ్లకు చెప్పులులేక, తాగేందుకు నీళ్లు లేక, తినేందుకు తిండి లేక పసిపిల్లలతో వారు పడుతున్న అవస్థలు మాటల్లో వర్ణించలేం. మండు వేసవిలో అక్కడక్కడ దాతలు అందించే ఆహారం, నీరే వారికి దిక్కైంది.

దేశ నిర్మాణంలో రాళ్లేత్తిన వలసకూలీలు పడుతున్న అవస్థలు చూసి దేశం యావత్తు తల్లడిల్లుతోంది. వారికి సహాయం అందించిన ప్రభుత్వాలపై సోషల్‌ మీడియా వేదికగా గళం ఎత్తుతోంది. ఈ క్రమంలో పలువురు వారికి ప్రభుత్వాలు సహాయం చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దేశ న్యాయస్థానాల తలుపులు తడుతున్నారు.

వలస కూలీలకు తగిన రవాణా సౌకర్యాలు కల్పించేంత వరకూ వారికి ఆహారం, వసతి సౌకర్యాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేలా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని సుప్రింలో దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు దేశం యావత్తు ఖంగుతినేలా వ్యాఖ్యలు చేశారు. వసల కూలీలు వెళ్లకుండా ఆపలేమని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు చేపట్టాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదనేలా వ్యాఖ్యలు చేసింది. వలస కార్మికులు రైలు పట్టాలపై నిద్రిస్తుంటే ఎలా ఆపగలమంటూ ప్రశ్నించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయలేమంటూ పేర్కొని దేశ ప్రజల ఆగ్రహానికి గురైంది. సోషల్‌ మీడియాలో సుప్రిం తీర్పు వ్యాఖ్యలపై ఆగ్రహం, నిరసన వ్యక్తం చేస్తూ పలువురు నెటిజన్లు, మేధావులు పోస్టులు పెడుతున్నారు.

ఇదే సమయంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం భిన్నమైన వ్యాఖ్యలు చేసి మానవత్వాన్ని చాటుకుంది. సొంత ఊళ్లకు నడిచి వెళుతున్న వలస కార్మికులకు ప్రాధాన్యతా క్రమంలో తక్షణమే కొన్ని చర్యలు చేపట్టాలని ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. జాతీయ రహదారులు వెంట విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు, అక్కడ తాగునీరు సదుపాయం కల్పించాలని సూచించింది. నిస్సత్తువ ఆవరించకుండా టెంట్ల వద్ద గ్లూకోజ్‌ ప్యాకెట్లను వలసకూలీలకు అందించాలని ఆదేశించించి వలస కార్మికులకు కొంత ఊరటనిచ్చింది. అయితే ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ జాతీయ రహదారుల వెంట వెళుతున్న వారికి ఆహారం, నీరు అందించి.. వారి రాష్ట్రాల అధికారులతో సంప్రదించి వారిని బస్సుల్లో తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి