iDreamPost

డబ్బు కక్కుర్తికి పరాకష్ట

డబ్బు కక్కుర్తికి పరాకష్ట

మనిషి పుట్టకేపుట్టినా గానీ.. లోపలి బుద్ది ఎలా ఉంటుందో చూసి చెప్పడం కష్టం. సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి పోటీగా డబ్బుచుట్టూ మనిషి తిరగడం ప్రారంభించాక కొందరి మనుష్యుల బుద్దులు 360 డిగ్రీల వక్రమార్గం పట్టిపోతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ విపరీత పోకడలను సామాజికవేత్తలు నెత్తీనోరు కొట్టుకుని చెబుతున్నా విని తలకెక్కించుకునే తీరిక ‘కొందరి’కి ఉండడం లేదు. ఇక్కడ మనిషినే పూర్తిగా అనలేం, ఆ బుద్దిపుట్టే అవకాశాన్ని కల్పిస్తున్న పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తే.. మనిషిని నిందించాలా? పరిస్థితుల్నా? అన్నది తేల్చుకోవడం క్లిష్టమైనదే అవుతుంది.

ఒక పక్క మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ లేని ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా కొందరు వ్యాపారులు బరితెగించి నిత్యావసర వస్తువులు, శానిటైజర్లు, మాస్కులు తదితర వస్తువులను పక్కదారి పట్టించడం ఇప్పటి వరకు బైటకు వచ్చాయి. ఎక్కడికక్కడ ప్రభుత్వాలు అప్రమత్తమై, యంత్రాంగం ఆ దిశగా దృష్టి సారించడంతో ఇటువంటి అక్రమార్కుల ఆటలు ఎక్కువ రోజులు కొనసాగలేదు. అయితే హైదరాబాదు నగరంలో ఆసుపత్రుల్లో వినియోగించే ఆక్సిజన్‌ సిలెండర్లు బ్లాక్‌లో అమ్ముతున్న రెండు ముఠాలను టాక్స్‌ఫోర్స్‌ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి వద్దనుంచి కొన్ని ఆక్సిజన్‌ సిలెండర్లు స్వాధీనం చేసుకున్నారు.

కోవిడ్‌ 19 వైరస్‌ శరీరంలోకి చేరి ఉధృతమయ్యాక, ఐసీఈయూల్లో ఊపిరి అందని పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్‌ సిలెండర్లను అమర్చిన వెంటిలేటర్‌లే రోగులకు ప్రాణవాయువు అందిస్తాయి. అంటే ఊపిరి అందక, ఛాతీ పట్టేసి, మొదడు మొద్దుబారిపోయి.. శరీరం మొత్తం నరకయాతన పడే రోగులకు వీటి సాయంతో ఊపిరిని అందిస్తుంటారు. రోగులకు ఏర్పడే విపరీత శారీరకక బాధ నుంచి ఉపసమనం కలిగించేందుకు ఈ కృత్రిమ ఊపిరి ద్వారా వైద్యులు శ్రమించి ప్రాణాం నిలబెడతారు. అటువంటి ఈ ఆక్సిజన్‌ సిలెండర్లను కూడా బ్లాక్‌ చేసి అధిక రేట్లకు అమ్మి డబ్బులు సంపాదించుకునే స్థాయికి మనిషి చేరిపోయాడంటే కరోనా కంటే ఎక్కువ భయం పుట్టక మానదు. ఇటువంటి వాళ్ళకు విధించే శిక్షల ద్వారా ఇదే తరహాలో వ్యవహరించే వాళ్ళకు కనువిప్పు కలిగే విధంగా యంత్రాంగం పటిష్టచర్యలు చేపట్టాలనేది అందరి అభిమతం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి