iDreamPost

రైతు ఉద్యమానికి ముగింపు పడుతుందా..? అమిత్‌ షా ముందస్తు మంతనాలు

రైతు ఉద్యమానికి ముగింపు పడుతుందా..? అమిత్‌ షా ముందస్తు మంతనాలు

దాదాపు 30 రోజులకు పైగా రాజధాని ఢిల్లీలో రైతు ఉద్యమం హోరాహోరీగా కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ తీవ్రమవుతోంది. రైతుల రాక పెరుగుతోందని, ఆ సంఖ్య ఇంకా పెరిగితే కట్టడి కష్టమని ఓ దశలో పోలీసులు కూడా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రోజూ వందల మంది వచ్చి ఉద్యమంలో చేరుతున్నారు. కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి 3వేల మంది రైతులు బైక్‌లు, చిన్న చిన్న క్యాబ్‌ల్లో ఢిల్లీకి యాత్రగా వచ్చారు. రైతులకు కేంద్రం మరోసారి వర్తమానం పంపిన నేపథ్యంలో రైతు సంఘాలు ఇటీవలే సరేనన్నాయి. అటు కేంద్రం, ఇటు రైతు సంఘాలు నేడు సమావేశం కానున్నాయి. రైతులతో బుధవారం చర్చలు జరపనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారమే ముందస్తు కసరత్తు ప్రారంభించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇతర మంత్రులతో ఢిల్లీలోని తన నివాసంలో సమావేశమయ్యారు. మంత్రులు నరేందర్‌సింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రైతులతో జరపాల్సిన మంతనాలపై చర్చలు జరిపినట్లు తెలిసింది. మరోవైపు.. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు చర్చలకు వస్తామని కిసాన్‌ మోర్చా లేఖ రాసింది.

రైతు సంఘాల భేటీ..

కేంద్రం లేఖపై రైతు సంఘాలు కూడా ఓ నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే 5 సార్లు చర్చలు జరిగాయి. మరోసారి చర్చల్లో రైతు సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయని కొందరు భావిస్తున్నారు. ‘మా డిమాండ్‌ ఏంటో ప్రభుత్వానికి తెలియదా? చట్టాలను పూర్తిగా రద్దు చేసి తీరాలి.. ఆ తరువాతే ఏదైనా..’ అని రైతు సంఘం నేత అభిమన్యు కుహర్‌ స్పష్టం చేశారు. ఖచ్చితమైన, పకడ్బందీ అయిన పరిష్కారాన్ని చూపితే ఆందోళనలు విరమిస్తామని మరో సంఘం నేత చెబుతున్నారు. ‘2005లో ఏపీఎంసీల రద్దు వల్ల బిహార్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఎంఎస్పీ వ్యవస్థ లేక రైతు సర్వనాశనమయ్యాడు. పంట అమ్ముకునే దారి లేక, అమ్ముకున్నా గిట్టుబాటు రాక గడచిన ఇరవయ్యేళ్లుగా బాధలు పడుతున్నాడు. ఇపుడు అక్కడ కూడా ఓ ఆందోళన మొదలయ్యింది. ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలన్న డిమాండ్‌ వచ్చింది’ అని మోర్చా నేత గుర్నామ్‌ సింగ్‌ చదౌనీ చెప్పారు. ఇప్పటికే రైతు సంఘాలు తమ నాలుగు అంశాలతో కూడిన ఎజెండాను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి