iDreamPost

అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి ..

అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి ..

అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అని కోరుకోవడం సహజం. కానీ ప్రస్తుత కోవిడ్‌ సమాజంలో అందరూ బాగుంటేనే అందులో మనమూ ఉంటాం. ఇది ప్రతి ఒక్కరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. వ్యాధి భారిన పడితే ఎవ్వరేం అనుకుంటారోనన్న అనుమానంతో ఇప్పటిక్కూడా పలువురు రహస్యంగానే ప్రవర్తిస్తున్నారు. రహస్యంగానే ఉంచుకున్నప్పటికీ జనసమూహాలకు దూరంగా ఉంటే ఎవ్వరికీ అభ్యంతరాలు ఉండవు. కానీ వారు మట్టుకు మందులు వాడేసి బైట విచ్చలవిడిగా తిరిగేస్తున్న ఉదాహరణలు కన్పిస్తున్నాయి. ఇది నేరుగా ఎదుటి వ్యక్తుల మీద హత్యాయత్నం లాంటిదేనని చెప్పాల్సి ఉంటుంది.

కోవిడ్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు జాగ్రత్తలను నిర్దారించింది. అందులో మాస్క్‌ ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతులను తరచు శుభ్రం చేసుకోవడం ప్రదానమైనవి. ఇక్కడ మాస్క్‌ ధరించడం అంటే మన నుంచి ఎదుటి వ్యక్తికి ప్రమాదం లేకుండా మనం జాగ్రత్త వహించడం. అయితే ఏ గెడ్డానికో, మెడ మీదికో మాస్క్‌ను పెట్టుకుని విచ్చలవిడిగా తిరిగేస్తున్నామంటే అది ఎదుటి వారిని హత్య చేయడానికి మనం సిద్ధంగా ఉన్నట్టే. అటువంటప్పుడు ‘అందరూ బాగుండాలి..’ అన్న భారతీయ తత్వానికి మనం ఎంత దూరంగా ఉంటున్నామో అర్ధం చేసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది.

చావు, పుట్టుకలు మన చేతుల్లో లేకపోయినప్పటికీ ప్రస్తుతం కోవిడ్‌ కారణంగా మృతుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పది లక్షలకు చేరువగా ఉన్నట్టు ఆయా దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇందులో పలువురికి కోవిడ్‌ ఎలా అంటుకుందో కూడా తెలిసి ఉండదు. కానీ సదరు మృతుల్లో కొన్నిటికైనా ఎదుటి వ్యక్తి నిర్లక్ష్యం ఎంతో కొంతైనా కారణం ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

ప్రమాదమని గుర్తుకు వస్తే వణుకుతున్న వారు సైతం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇప్పుడు మృతుల సంఖ్య పదిలక్షలకు చేరువగా ఉంది.. జనం ఇదే రీతిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ అంకెలు ఇరవైలక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే ఇక్కడ మరణాలను తగ్గించుకునేందుకు మనుషుల చేతుల్లోనే అవకాశం ఉందన్నది గుర్తుంచుకోవాలి. సామూహికంగా ఎదుర్కొవాల్సిన ఇటువంటి మహమ్మారుల విషయంలో వ్యక్తిగత నిర్లక్ష్యం అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. ఇదే విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది.

ఎక్కడైనా, ఎప్పుడైనా నియమ నిబంధనలను ఉల్లంఘించే విషయంలో మనమటుకు మనం మన దేశ పౌరులనే నిందిస్తుంటాం. కానీ కోవిడ్‌ విషయంలో ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కన్పించడం అత్యంత దారుణమే. ఎంతో క్రమశిక్షణగల దేశాలు అంటూ చెప్పుకొచ్చిన చోట్ల కూడా జనం నిర్లక్ష్యం కారణంగా వ్యాధి తీవ్రంగానే ప్రభలుతోంది. అంటే ఎదుటి వ్యక్తి ప్రాణాల పట్ల ప్రపంచ వ్యాప్తంగానే నిర్లక్ష్యం ఉందనుకోవాలేమో.

రోజువారి అత్యధిక పాజిటివ్‌లు బైటపడే దేశాల్లో మనదేశం కూడా ప్రథమ స్థానం కోసం పోటీపడుతోందన్నది నిపుణులు చెబుతున్న మాట. ఈ లెక్కన పోతున్న ప్రాణాలకు జనం వహిస్తున్న నిర్లక్ష్యమే కారణమని ఒప్పుకోక తప్పదు. మనం చేస్తున్న పనేంటో ఒక్కసారి ఆలోచించుకుని ముందుకు అడుగేయాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. లేక పోతే ఎవడో ఒక అమాయకుడు కరోనా భారిన పడి మృతి చెందడానికి మనం కూడా కారణం కావొచ్చు.

అదే రీతిలో మనింట్లో ఎవరికైనా వైరస్‌ అండుకోవడానికి ఇంకొకడెవడి నిర్లక్ష్యమో కారణమైనా ఆశ్యర్య పోనక్కర్లేదు. ఇక్కడ బలంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. మనమూ బాగుండాలి, ఎదుటి వాడు కూడా బాగుండాలి.. అప్పుడే వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయగలుగుతాం. అంతేగానీ మనం బాగుంటే చాలు అని సంకుచితంగా వ్యవహరిస్తే మాత్రం మనల్ని చుట్టేయడానికి వైరస్‌కు పక్కాగా సిద్ధంగానే ఉన్నట్టు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి