iDreamPost

పాలకులు – నగర నిర్మాణం#2

పాలకులు – నగర నిర్మాణం#2

రాజధాని నిర్మాణంలో మొదటి భాగం పాలకులు – నగర నిర్మాణం#1 కు కొనసాగింపు …

అమరావతి ఆలోచనలో మరో లోపం కూడా ఉంది. ఎప్పుడో శతాబ్దాల క్రితమే నిర్మాణం ప్రారంభమై, దశాబ్దాలుగా రాజధాని నగరాలుగా వెలుగొందుతున్న అనేక నగరాలతో పోల్చితే అసలు ప్రారంభమేకాని అమరావతి నగరం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరం అయింది.

అమరావతిలో భూముల ధరలు హైదరాబాద్, బెంగుళూరు, చెన్నయ్ వంటి నగరాల ధరలకుమించి సృష్టించబడ్డాయి. చుట్టుపక్కల ఇళ్ళ అద్దెలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందనంత ఎత్తు ఎగిరిపోయాయి. మురికివాడలు లేని నగరంగా అమరావతి నిర్మించాలని అనుకోవడం ఆహ్వానించదగ్గ నిర్ణయమే అయినా, అసలు పేదలు, మధ్యతరగతి ప్రజలు ఈ నగర ప్రణాళికలో విస్మరించబడ్డారు. వీరికోసం అమరావతిలో తలపెట్టిన నిర్మాణాలు లేకపోవడం ఇది ప్రజల నగరం అనే భావన లేకుండా చేసింది. కడతాము అన్నవి లేదా కట్టిస్తున్నాము అన్న గృహసముదాయాలు మధ్యతరగతి ప్రజలకు అందనంత దూరంలోనే ఉన్నాయి. అమరావతి ప్రణాళికలో శ్రామిక వర్గానికి చోటు ఉంది అని ఎవరైనా చెప్పినా ప్రజల్లో అలాంటి నమ్మకం కలగలేదు.

బహుళ అంతస్తుల నిర్మాణం గురించి ఆలోచించిన పాలకులు ఆ నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీల గురించి, రేపు నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణకు పనిచేసే కూలీల గురించి మర్చిపోయారు. ఆ భవనాన్ని శుభ్రంగా ఉంచే కార్మికులు, విద్యుత్ నిర్వహణకు అవసరమైన ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, ఫిట్టర్లు… ఇలా రకరకాల మనుషులు అవసరం అని, వారికి కూడా ఇక్కడే, ఈ మురికివాడలు లేని నగరంలో చోటివ్వాలని పాలకులు ఆలోచన చేయలేదు. అందమైన రోడ్ల ప్రణాళిక సిద్ధం చేసిన పాలకులు, ఆ రోడ్లు తుడిచేవాళ్ళు ఎక్కడుండాలో ప్రణాళికలో చెప్పలేదు. గ్రీన్ సిటీ అంటూ పార్కులు ప్రణాళికలో చూపిన పాలకులు ఆ మొక్కలను పెంచే తోటమాలి ఎక్కడ నివాసం ఉండాలో చెప్పలేదు. ఎలక్ట్రీషియన్, లిఫ్ట్ మెకానిక్, ఏసీ మెకానిక్ ఎక్కడ ఉండాలో చెప్పలేదు. చివరికి రాజ్ భవన్, లేదా ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే వంట వారు కానీ, గుర్ఖా కానీ, ఆఫీస్ బాయ్ కానీ ఎక్కడుండాలో అమరావతి ప్రణాళికలో చెప్పలేదు. నగర ప్రణాళికలో పాలకులు విస్మరించిన అంశాలు ఇవి.

అసలు నగరం నిర్మించాలనుకోవడమే పాలకుడి పొరపాటు ఆలోచన అయితే, ఆ నిర్మాణంలో అడుగడుగునా, ప్రతినిత్యం అవసరమయ్యే నిరుపేదల జీవనాన్ని పట్టించుకోకపోవడం మరింత పెద్ద తప్పు. అందుకే “డబ్బు, అధికారం, అవకాశం” ఉన్న ఆ కొద్దిమందికే అమరావతి నగరంలా కనిపించింది కానీ మిగతా ప్రజలెవ్వరికీ అది పట్టలేదు. పాలకుడి అద్దాలమేడను శుభ్రంగా ఉంచే కార్మికుడు, పాలకుడు పాదాలకు మట్టి అంటకుండా రోడ్లు శుభ్రం చేసే కార్మికుడు, డ్రైనేజీ పొంగి పొర్లకుండా చూసుకునే కార్మికుడు, పాలకుడికి రుచికరమైన వంటలు చేసిపెట్టే వంట వాళ్ళు, దేవుడి గదిలో పూజకు రోజూ పూలు తెచ్చి ఇవ్వాల్సిన అవ్వలు, పొద్దున్నే పాలు తేవాల్సిన పాలవాళ్ళు, పేపరు తేవాల్సిన పేపర్ బాయ్స్… ఇలా ఏ ఒక్కరూ అమరావతిని “మా నగరం” అనుకోలేదు. వీరికెవరికీ భాగస్వామ్యం లేని ఏ నగరం అయినా అది అమరావతే అవుతుంది.

అయినా, ఇంద్రుడు నివాసం ఉండే అమరావతి అందరిదీ కాదుగా… సర్వ గణాధిపతులతో పాటు దేవవేశ్యలైన రంభ, ఊర్వశి, మేనక వంటి వాళ్ళు ఉండి, గానా బజానాలతో ఉంటుందని చెప్పుతుంటారు. ఆ అమరావతిలో పుణ్యవంతులకే చోటున్నట్టు, ఈ అమరావతిలో డబ్బు, అధికారం ఉన్నవారికే చోటు అనే భావం కూడా మామూలు ప్రజల్లో కలిగింది. బహుశా ఈ నగరం తమది కాదు అనే భావం కలగడం వల్లనేమో ఆ నగరం ఉన్న నియోజకవర్గంలో (కార్మికులకు రిజర్వు చేసిన) కూడా పాలకుడికి ప్రజల ఆమోదం లభించలేదు.

ఈ మధ్య కాలంలో చంద్రబాబు చెప్పే “సైబరాబాద్” నగరం కూడా ఒక మంచి ఉదాహరణే. నేదురుమిల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మాదాపూర్ ప్రాంతాన్ని ఐటీ కోసం ఎంపిక చేసి అక్కడ ఐటీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఐటీ భవనాన్ని సరికొత్త హంగులతో నిర్మించారు. ఆ తర్వాత కొన్ని ఐటీ కంపెనీలను ఆహ్వానించి ఆ భవనంలో వారి కార్యాలయాలకు విడిది ఏర్పాటు చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల అభివృద్ధి మొదలయింది. ఆ అభివృద్ధి పరిసర గ్రామాలకు విస్తరించి అంతిమంగా “సైబరాబాద్” నగరం ఏర్పడింది. అంతేకాని సైబరాబాద్ నగరం మొత్తం పాలకులు నిర్మించింది కాదు.

నగరాలన్నీ ఉపాధి ఆధారితంగా విస్తరిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు నగర ప్రణాళికల్లో ఈ ఉపాధి ఒక అంశంగా లేకుండా పోయింది. కేవలం మౌళిక వసతులు, భవన నిర్మాణ నిబంధనలు మాత్రమే ప్రాతిపదికగా నగరాల ప్రణాళికలు వస్తుండడంతో గ్రామాల్లో ఉపాధి కోల్పోయి పట్టణానికి వలస వచ్చే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేటి నగరాలు తయారు కావడం లేదు. అందువల్లనే నగరాల్లో నేరాల సంఖ్య పెరుగుతోంది. క్లబ్బులు, పబ్బులు విస్తరించినంత వేగంగా “ఉపాధి” కేంద్రాలు నగరాల్లో తయారుకావడం లేదు.

Also Read: పాలకులు – నగర నిర్మాణం#3

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి