iDreamPost

అలర్ట్‌.. రూ.2 లక్షల రుణమాఫీ.. కేవలం ఆ కార్డు ఉన్న రైతులకు మాత్రమేనా..!

  • Published Jun 17, 2024 | 10:02 AMUpdated Jun 17, 2024 | 10:02 AM

Rythu Runa Mafi: తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతుంది. ఆ కార్డ్‌ ఉన్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని తెలుస్తోంది. ఆ వివరాలు. .

Rythu Runa Mafi: తెలంగాణలో రైతు రుణమాఫీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతుంది. ఆ కార్డ్‌ ఉన్న వారికే రుణమాఫీ వర్తిస్తుందని తెలుస్తోంది. ఆ వివరాలు. .

  • Published Jun 17, 2024 | 10:02 AMUpdated Jun 17, 2024 | 10:02 AM
అలర్ట్‌.. రూ.2 లక్షల రుణమాఫీ.. కేవలం ఆ కార్డు ఉన్న రైతులకు మాత్రమేనా..!

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలకు కట్టుబడి ఉంది. ఇప్పటికే అనేక హామీలను నెరవేర్చగా.. మిగిలిన వాటి అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక రేవంత్‌ సర్కార్‌ ఇచ్చిన అన్ని హామీల్లో ముఖ్యమైనది 2 లక్షల రూపాయల రుణ మాఫీ. ఆగస్ట్‌ 15 నాటికి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అనేక సార్లు వెల్లడించారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందుకు మార్గదర్శకాలు రూపొందించే పనిలో ఉంది. అయితే అర్హులైన వారికే రుణమాఫీ వర్తింపజేసేందుకు అధికారులు వివిధ ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయపన్ను చెల్లించే వారు, ఉద్యోగులను దీని నుంచి మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

2 లక్షల రూపాయల రుణ మాఫీకి సంబంధించి పట్టాదారు పాస్‌ బుక్‌లు, రేషన్‌ కార్డులను ప్రామాణికంగా తీసుకోవాలని అధికారులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది. పంట రుణాల మాఫీపై ఈ వారంలో కేబినెట్ భేటీ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని ఆదేశించడంతో వ్యవసాయ అధికారులు.. క్షేత్రస్థాయిలో రూ.2 లక్షల వరకు లోన్లు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి కలెక్ట్‌ చేసుకునే పనిలో ఉన్నారు. ఈలోగా రుణమాఫీ ఎవరికి అమలు చేయాలనే దానిపై.. వ్యవసాయశాఖ వివిధ ప్రామాణికాల ప్రాతిపదికన అధ్యయనం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

రైతుబంధు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసుకున్న రైతుల సంఖ్య సుమారు.. 66 లక్షల మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో రూ.2 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారు కూడా ఇంత మందే ఉంటారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే రైతుబంధు లబ్ధిదారుల్లో దాదాపు ఆరు లక్షల మందికి పట్టాదారు పాస్‌బుక్‌లు లేనట్లు తెలిసింది. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కుటుంబంలోని ఇద్దరు, ముగ్గురికి రైతుబంధు వస్తోంది. అయితే వారందరికీ రేషన్‌ కార్డులు లేవు. కుటుంబంలో యజమానికి మాత్రమే రేషన్‌ కార్డు ఉంది.

ఈ క్రమంలో అధికారులు.. రుణమాఫీకి రేషన్‌కార్డు నిబంధన పెడితే కుటుంబంలో కేవలం ఒక్క రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. రుణమాఫీకి రేషన్‌ కార్డును లింక్‌ చేసి.. అమలు చేస్తే.. మరో 18 లక్షల మంది రైతులు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మినహాయిస్తే మరో రెండు లక్షల మంది రుణమాఫీ లబ్ధిదారులు తగ్గుతారని అంటున్నారు. వీరందరిని తొలగించడం ద్వారా చివరకు 40 లక్షల మంది మేరకే రుణమాఫీకి అర్హులవుతారని అధికారులు భావిస్తున్నారు.

ఇక 2018 డిసెంబరు 12 నుంచి తీసుకున్న పంట రుణాలు, రెన్యువల్‌ అయిన వాటికి రుణ మాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా రైతుల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే రుణమాఫీ అమలుకు సంబంధించి పలు ప్రతిపాదనలు రాగా.. దీనిపై మంత్రి మండలిలో సమగ్రంగా చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్‌కార్డు ఉన్న వారికే రుణమాఫీ అమలు అంటే.. చాలా మంది రైతులు న‍ష్టపోతారని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు స్పష్టత రాదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి