iDreamPost

రిస్క్ అనిపించే దర్శకులతో రామ్ చరణ్ ?

రిస్క్ అనిపించే దర్శకులతో రామ్ చరణ్ ?

ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ మీద బాలీవుడ్ దర్శకుల కన్ను పడుతోంది. అల్లూరి సీతారామరాజు గెటప్ ని నార్త్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకోవడంతో తనను మంచి కమర్షియల్ సబ్జెక్టులో కనక చూపిస్తే ప్రభాస్ లా ఎదిగే అవకాశం ఉందని గుర్తించిన దర్శకులు దానికి తగ్గట్టే గేలం వేయడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి వ్యక్తి వివేక్ అగ్నిహోత్రి. ది కాశ్మీర్ ఫైల్స్ తో మూడు వందల కోట్ల వసూళ్లు ఇచ్చిన చిన్న బడ్జెట్ డైరెక్టర్ గా ఈయన పేరు ఏ స్థాయిలో మారుమ్రోగిందో అందరికీ తెలిసిందే. డాక్యుమెంటరీ స్టైల్ తోనూ అందరినీ మెప్పించగలిగారు.

కాకపోతే ఒక వర్గానికి చెందిన భావజాలాన్ని మాత్రమే బలంగా సమర్ధించే వాడిగా ఈయన మీద సోషల్ మీడియాలో వ్యతిరేకత భారీగానే ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండటం పనిగా పెట్టుకున్నారు. ఇటీవలే పఠాన్ లో షారుఖ్ ఖాన్ దీపికా పదుకునే ఎక్స్ పోజింగ్ సాంగ్ మీద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం వైరల్ అయ్యింది. క్లీన్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తనతో టై అప్ చేసుకుంటే రిస్క్ ఉండకపోదు. ఎందుకంటే వివేక్ అగ్నిహోత్రి రెగ్యులర్ ఫార్మాట్ లో సినిమాలు తీసే రకం కాదు. అవి అన్ని వర్గాలకు చేరవు కూడా. అలాంటప్పుడు ప్యాన్ ఇండియా ఇమేజ్ ని లక్ష్యంగా చేసుకున్న చరణ్ కు ఇది ఇబ్బంది కాకుండా పోయే అవకాశం ఉంది

ఇక రెండో పేరు రోహిత్ శెట్టి. మాస్ మసాలా ఎంటర్ టైనర్స్ ఇవ్వడంలో పేరు గాంచిన ఇతను తాజాగా సర్కస్ అనే సూపర్ డూపర్ డిజాస్టర్ ఇచ్చాడు. దీని నష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే పెట్టుబడిలో కేవలం పాతిక శాతమే వెనక్కు వచ్చేంత. ఒకప్పుడు చెన్నై ఎక్స్ ప్రెస్, సింగం, సింగం రిటర్న్స్ లాంటి యాక్షన్ మూవీస్ ఇచ్చిన ఇతగాడు ఈ మధ్య లయతప్పాడు. మరి చరణ్ ని కొత్తగా చూపిస్తాడని ఆశించలేం. ప్రస్తుతం మెగా పవర్ శంకర్ డైరెక్షన్ లో ఆర్సి 15 చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత సుకుమార్ తో ఓ కమిట్ మెంట్ ఉంది. అదయ్యాక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనాది ఉంటుంది. ఈలోగా ఈ సమీకరణాల్లో ఏమేం మార్పులు వస్తాయో చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి