iDreamPost
android-app
ios-app

అశోక వనంలో అర్జున కళ్యాణం రివ్యూ

  • Published May 06, 2022 | 2:13 PM Updated Updated May 06, 2022 | 2:32 PM
అశోక వనంలో అర్జున కళ్యాణం రివ్యూ

సినిమాలో అసలు విషయం కంటే టీవీ9 తో హీరో విశ్వక్ సేన్ కు వచ్చిన వివాదం వల్ల ఎక్కువ పబ్లిసిటీ తెచ్చుకున్న సినిమా అశోక వనంలో అర్జున కళ్యాణం. తన రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ కి భిన్నంగా సాఫ్ట్ ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీని ఎంచుకున్న విశ్వక్ దీని మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. కుటుంబ ప్రేక్షకులకు దీంతో దగ్గరవ్వొచ్చనే నమ్మకం అతనిలో బలంగానే కనిపించింది. చెప్పుకోదగ్గ క్యాస్టింగ్ తో డీసెంట్ బడ్జెట్ లో పూర్తి చేసిన ఈ ఎంటర్ టైనర్ కు విద్యా సాగర్ చింత దర్శకుడు. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. అంచనాలు పెద్దగా లేకపోయినా సోషల్ మీడియాలో చర్చ ద్వారా హైప్ తెచ్చుకున్న ఈ అర్జునుడు గెలిచాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

అర్జున్ కుమార్ అల్లం(విశ్వక్ సేన్)కు 33 ఏళ్లకు సంబంధం కుదురుతుంది. కుటుంబాన్ని తీసుకుని ఎంగేజ్ మెంట్ కోసం గోదావరి జిల్లాకు వెళ్తాడు. సరిగ్గా తిరుగు ప్రయాణంలో కరోనా వల్ల లాక్ డౌన్ వచ్చి పెళ్లి కూతురు మాధవి(రుక్సర్ ధిల్లాన్)ఇంట్లోనే అందరూ చిక్కుబడిపోతారు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో మాధవి మాయమైపోతుంది. ఈ ట్విస్ట్ చాలక ఇంకొన్నేళ్లు అర్జున్ ఫ్యామిలీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి తలెత్తుంది. అప్పటికే లేట్ మ్యారేజ్ వల్ల చిరాకులో ఉన్న అర్జున్ జీవితం తర్వాత ఏ మలుపు తీసుకుంది. ఆ అమ్మాయి తిరిగి వచ్చిందా లేక మరొకరితో బంధం కుదిరిందా అనేది తెరమీద చూడాలి

నటీనటులు

డిఫరెంట్ గా అనిపించే మేకోవర్ తో మీసాలు ఉంచుకుని విశ్వక్ సేన్ చేసిన ప్రయోగం పాత్ర పరంగా బాగా కుదిరింది. పెర్ఫార్మన్స్ చేయడానికి కూడా స్కోప్ దక్కింది. ఎక్కడ ఆటిట్యూడ్ చూపించే అవసరం లేకుండా నీట్ గా సెటిల్డ్ గా చేసుకుంటూ పోయాడు. బరువైన సీన్లను బాగానే మోశాడు. రుక్సర్ ధిల్లాన్ ని మెయిన్ హీరోయిన్ అన్నట్టు ట్రైలర్ లో చూపించారు కానీ నిజానికి తను సపోర్టింగ్ రోల్ కన్నా తక్కువ స్పేస్ లో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో కనీసం మాటలు లేవు. ఎక్స్ ప్రెషన్లు భూతద్దం పెట్టి వెతుక్కోవాలి. క్యారెక్టర్ డిజైన్ అలా చేశారు కానీ నటన పరంగా తను కూడా ఎలాంటి హావభావాలు ఇవ్వకుండా చాలా జాగ్రత్త పడింది.

సడన్ సర్ప్రైజ్ గా చెప్పుకోవాల్సింది మాత్రం రితిక నాయక్ గురించి. హోమ్లీగా క్యూట్ గా చలాకిగా ఇచ్చిన పెర్ఫార్మన్స్ ఈ సినిమాకున్న బలాల్లో ఒకటి. చూపులతోనూ ఆకట్టుకుని టాలీవుడ్ కు కొత్త ఛాయస్ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ లో గోపరాజు రమణ కొంత గ్యాప్ తర్వాత తన టైమింగ్ తో ఆడుకున్నారు. కాదంబరి కిరణ్ కాస్త ఎక్కువ అరిచినట్టు అనిపించినా ఆ పాత్రకది అవసరమే. కేదార్ శంకర్, రాజ్ కుమార్ కసిరెడ్డిలకు కొంత స్కోప్ దక్కింది. మాములు కామెడీ ట్రాక్ తో వెన్నెల కిషోర్ మెప్పించలేకపోయాడు. మొత్తం మేల్ డామినేషన్ క్యాస్టింగ్ కావడంతో లేడీస్ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమి లేదు

డైరెక్టర్ అంటే టీమ్

అశోక వనంలో అర్జున కళ్యాణం టైటిల్ తెలుగుదనంతో ఆహ్లాదకరంగా ఉంది. అలా అని సినిమా మొత్తం అలాగే అనిపిస్తుందని కాదు కానీ దర్శకుడు విద్యాసాగర్ చింత దీన్నో క్లీన్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాలని చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. అసభ్యత లేకుండా వీలైనంత సహజంగా తెరకెక్కించినందుకు తన టేకింగ్ తో మెప్పిస్తాడు. అయితే రాజావారు రాణిగారు డైరెక్టర్ రవికిరణ్ కోలా దీనికి కథ మాటలు స్క్రీన్ ప్లే అందించడంతో అతని ముద్ర ఇందులోనూ స్పష్టంగా కనిపిస్తుంది. సన్నని లైన్ తీసుకుని దాని చుట్టూ కామెడీ సన్నివేశాలు అల్లుకుని ఎమోషనల్ గా ఒక ప్రేమకథను జోడించే స్టైల్ ఇతనిది. ఇందులోనూ అదే రిపీట్ అయ్యింది.

కాకపోతే హాస్యం కోసమే ప్రేక్షకులు థియేటర్ కు రావడానికి సరిపడా మెటీరియల్ ఇందులో పూర్తిగా లేకపోయింది. హీరోని అక్కయ్య వద్దనుకుంటే అతన్ని చెల్లి లవ్ చేసి పెళ్లికి సిద్ధపడటం అనేది మురళీమోహన్ జగపతిబాబులతో మొదలుపెట్టి ఇప్పటిదాకా ఎందరో వాడేసిన పాత ఫార్ములా. దర్శకుడు విద్యాసాగర్ దానికి కరోనా లాక్ డౌన్ అనే పాయింట్ ని ముడిపెట్టి ఎంటర్ టైన్ చేద్దామనున్నారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ సినిమా చాలా బాగుందని ఫీలవ్వడానికి సరిపడా సరుకు సమకూరలేదు. అసలు కాంఫ్లిక్ట్ ఇంటర్వెల్ లో రివీల్ అయ్యేదాకా సీన్లన్నీ ఒకే ఇంట్లో జరుగుతాయి. అలా అని ఎక్కువ బోర్ కొట్టవు.

కొన్ని నవ్విస్తాయి. కొన్ని ఎందుకు వచ్చాయనిపిస్తాయి. ఇవన్నీ ఎలా ఉన్నా ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా డీసెంట్ గానే సాగిపోతుంది. అసలు సమస్య రెండో సగంలో వచ్చి పడింది. ఒక్కసారి టర్నింగ్ పాయింట్ జరిగిపోయాక ఇంకో గంటంపావు సరిపడా కంటెంట్ లేకపోయింది. అందుకే విశ్వక్ రితిక మధ్య లవ్ స్టొరీని సాగదీయాల్సి వచ్చింది. అదైనా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉందా అంటే అంతగా అనిపించదు. పైగా హీరో మీద ఆ అమ్మాయికి ప్రేమ పెరగడం కోసం మార్కెట్ లో తనను ఏడిపించిన ఆకతాయిలతో ఫైట్ ఇవన్నీ లెన్త్ కోసం పడ్డ తాపత్రయమే. అంతా ఆడియెన్స్ ఊహలకు అనుగుణంగా సాగిపోవడంతో ఆసక్తి మెల్లగా సన్నగిల్లుతుంది. స్పీడ్ బ్రేకర్స్ లా నిలిచింది ఇవే.

ఇలాంటి సినిమాల్లో కథా కథనాలు కొత్తగా లేకపోయినా పర్లేదు. ట్రీట్ మెంట్ ఫ్రెష్ గా ఉండాలి. సింపుల్ జోకుల కోసం జనం థియేటర్లకు రారు. నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావ్ లలో కనీవినీ ఎరుగని స్టోరీ ఉండదు. అందులో ఫన్, తాజాగా అనిపించే వినోదం, మళ్లీ ఇంకోసారి చూడొచ్చనే ఫీలింగ్ వాటిని బ్లాక్ బస్టర్స్ గా నిలిపాయి. కానీ ఆ స్థాయి కసరత్తు ఈ అశోకవనంకు జరగలేదు. మంచి క్వాలిటీ క్యాస్టింగ్ రైటింగ్ లోని బలహీనతలను కవర్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా హాల్ ఎక్స్ పీరియన్స్ ని డిమాండ్ చేసేంత బలంగా అశోకవనం లేకపోయినా చూస్తే పూర్తిగా నిరాశ చెందకుండా జస్ట్ ఒకే మార్కులతో పాస్ అయ్యింది

సంగీత దర్శకుడు జే క్రిష్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగానూ ఆకట్టుకున్నాడు. ఇన్స్ ట్రుమెన్టేషన్ బాగా కుదిరింది. దర్శకుడు కోరుకున్న ఫీల్ ని క్యారి చేయగలిగాడు. పవి కె పవన్ ఛాయాగ్రహణం చక్కగా ఉంది. విప్లవ్ నైషదం ఎడిటింగ్ ల్యాగ్ ని కంట్రోల్ చేయలేకపోయినా ఫైనల్ కట్ ఈ మాత్రం చెప్పుకునేలా వచ్చిందంటే ఇందులో అతని పాత్ర ఎక్కువే. సంభాషణలు పర్లేదు. గుర్తుపెట్టుకుని మరీ నవ్వేవి లేకపోయినా ఒకే అనిపించాయి. నిర్మాణ విలువలు భారీగా లేవు. విశ్వక్ మార్కెట్ కి తగ్గట్టు ఇలాంటి సబ్జెక్టులు నిర్మాతలకు ఫలితంతో సంబంధం లేకుండా సేఫ్ అవుతాయి

ప్లస్ గా అనిపించేవి

విశ్వక్ సేన్
రితిక నాయక్ నటన
ఫస్ట్ హాఫ్

మైనస్ గా తోచెవి

కథ పాతదే
సెకండ్ హాఫ్ ల్యాగ్
రిపీట్ ఎమోషన్స్
కామెడీ బలంగా ఉండాల్సింది

కంక్లూజన్

ఎంటర్ టైనర్ అంటే ప్రేక్షకుల దృష్టిలో హాయిగా నవ్వించి, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి శుభం కార్డు దాకా టైం పాస్ చేయించి ఇంకో నలుగురికి చెప్పేలా చేసేది. అంతే తప్ప ఎమోషన్ల పేరుతో అవసరానికి మించిన భావోద్వేగాలను జోప్పిస్తే అది అసంతృప్తికి దారి తీసే ప్రమాదం ఉంది. అశోకవనంలో అర్జున కళ్యాణం ప్రామిసింగ్ గా మొదలై క్రమంగా ఓ యావరేజ్ సినిమాగా మిగిలిపోయి మంచి అవకాశాన్ని తగ్గించుకుంది. అయినా కూడా కాసిన్ని జోకులు, ఎక్కువ విసుగు రాకుండా ఉంటే చాలనుకుంటే అశోకవనంలోకి ఓ రౌండ్ వేసి రావొచ్చు. కాకపోతే మీరు ఊహించుకున్నంత స్థాయి పువ్వులు పూసి ఉండేవేమో కానీ ముళ్ళు గుచ్చుకోకుండా సాఫీగానే బయటికి పంపిస్తుంది.

ఒక్క లైన్ లో – డీసెంట్ కళ్యాణం