iDreamPost
android-app
ios-app

Karthikeya 2 Review కార్తికేయ 2 రివ్యూ

  • Published Aug 13, 2022 | 2:25 PM Updated Updated Aug 13, 2022 | 2:25 PM
Karthikeya 2 Review కార్తికేయ 2 రివ్యూ

కొన్నేళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమా టైటిల్ కు రెండు నెంబర్ జోడించి ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఎందరో హీరోలు దర్శకులు బాక్సాఫీస్ వద్ద షాకులు తిన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మన్మథుడు 2, సత్య 2, కిక్ 2 లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందుకే కార్తికేయ 2ని అనౌన్స్ చేసినప్పుడు ఈ టాలీవుడ్ నెగటివ్ ట్రెండ్ ని బ్రేక్ చేస్తుందా అనే అనుమానాలు [లేకపోలేదు. విడుదల కోసం నానా పురిటి నెప్పులు పడుతూ వాయిదాల మీద వాయిదాలు తింటూ వచ్చిన ఈ అడ్వెంచర్ డ్రామా కోసం హీరో నిఖిల్ చాలా కష్టపడ్డాడు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో అంచనాలు పెరిగాయి. మరి మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

దేవుడి మీద నమ్మకాల కంటే సైన్స్ ని ఎక్కువగా నమ్మే డాక్టర్ కార్తికేయ(నిఖిల్ సిద్దార్థ్)కు అనుకోకుండా ఓ ప్రమాదం తప్పుతుంది. దీంతో తల్లి మాట కాదనలేక శ్రీకృష్ణుడి దర్శనం కోసం ద్వారకా బయలుదేరతాడు. అయితే ఊహించని విధంగా కార్తికేయను అనూహ్యమైన పరిస్థితుల మధ్య పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనను తప్పించిన అమ్మాయి(అనుపమ పరమేశ్వరన్)వల్ల దేశానికో గొప్ప ప్రయోజనం కలిగించే ఓ పెద్ద బాధ్యత తన మీద ఉందని గుర్తిస్తాడు. కృష్ణభగవానుడి ఆభరణం కోసం వేట మొదలుపెడతాడు. వీళ్ళ వెనుకే డాక్టర్ శంతను(ఆదిత్య మీనన్)ముఠా ఉంటుంది. మరి కార్తికేయ తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడనేదే అసలు స్టోరీ

నటీనటులు

ఒప్పేసుకుంటూ పోతే ఇప్పటికే ఓ యాభైకి పైగా సినిమాలు చేసే అవకాశమున్న నిఖిల్ ఎందుకింత నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడో కార్తికేయ 2 చూశాక అర్థమవుతుంది. ఒకపక్క తన తోటి యూత్ హీరోలు అర్థం లేని మాస్ హీరోయిజం కోసం వెంపర్లాడుతూ ఉంటే తను మాత్రం క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే అర్జున్ సురవరం తర్వాత ఇంత పెద్ద గ్యాప్ ని సంతృప్తిగా పూడ్చేలా ఇందులో పెర్ఫార్మన్స్ నిలిచింది. ఎక్కువ విజువల్స్ మీద ఆధారపడ్డ గ్రాండియరే అయినప్పటికీ తనవరకు కార్తికేయ క్యారెక్టర్ కు కావాల్సిన సాలిడ్ యాక్టింగ్ ని దర్శకుడి అంచనాల మేరకు పూర్తిగా ఇచ్చాడు. లుక్స్ పరంగానూ ఆకట్టుకున్నాడు.

లేట్ ఎంట్రీ ఇచ్చినా అనుపమ పరమేశ్వరన్ కు మంచి స్కోప్ దక్కింది. పాటల గోల లేకుండా, సోది లవ్ ట్రాక్స్ లో ఇరుక్కోకుండా కేవలం కార్తికేయకు అండగా నిలిచే పాత్రలో మంచి ఆప్షన్ గా నిలిచింది. దాదాపు నిఖిల్ తో సమానంగా స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీనివాసరెడ్డి ఓవర్ కామెడీ చేయకుండా డీసెంట్ గా సెటిల్డ్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. విలన్ గా చేసిన ఆదిత్య మీనన్ బరువైన సూటు వేసుకుని అయిదారు డైలగులు చెప్పడం కన్నా ఎక్కువ స్కోప్ దక్కలేదు. విగ్రహం నిండుగా ఉంది కానీ దాన్ని వాడుకోలేదు. అనుపమ్ ఖేర్ ఉన్నది ఒక్క సీనే అయినా బాగా పేలింది. వైవా హర్ష, తులసి ఇంకా ఇతర తారాగణం మొత్తం క్యాస్టింగ్ నీట్ గా ఉంది


డైరెక్టర్ అండ్ టీమ్

లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే ఫాంటసీ జానర్ ని డీల్ చేయడం చాలా కష్టం. దర్శకుడు చందూ మొండేటి మొదటి భాగానికి ఈ రిస్క్ ఫేస్ చేయలేదు. ఎందుకంటే అది క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్ లో వెళ్లిపోవడంతో ఆడియన్స్ కి కాన్సెప్ట్ కన్నా ఎక్కువగా థ్రిల్ కిక్ ఇచ్చింది. కానీ ఇప్పుడీ కార్తికేయ 2 పూర్తిగా దానికే మాత్రం సంబంధం లేకుండా శ్రీకృష్ణుడి భావజాలాన్ని ఒక అడ్వెంచర్ తో ముడిపెట్టి తీసిన ప్రయత్నం. ఏ అంశం బ్యాలన్స్ తప్పినా ఫలితం తేడా కొట్టేస్తుంది. అందుకే స్క్రీన్ ప్లే విషయంలో చందూ తీసుకున్న జాగ్రత్తలు అవుట్ ఫుట్ నీట్ గా వచ్చేందుకు దోహదపడ్డాయి. కుర్చీ అంచుల్లో కూర్చోబెట్టకపోయినా లేచి వెళ్లిపోయేలా మాత్రం ముమ్మాటికీ చేయలేదు.

నాస్తికుడైన హీరోని లోక కళ్యాణం కోసం ప్రేరేపించి అతనితో సాహసాలు చేయించడమనే పాయింట్ లో రెండున్నర గంటలు కాదు ఇరవై గంటలకు సరిపడా మెటీరియల్ రాసుకునే బలముంది. చందూ చాలా తెలివిగా ఈ థీమ్ ని ఎంచుకున్నాడు. దానికి తగ్గట్టే ద్వారకా, మధుర నగరాలకు సంబంధించిన రీసెర్చ్, కృష్ణుడి తాలూకు పురాణాల్లో ఉన్న రెఫెరెన్సులు అన్నీ వాడుకున్నాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో మెయిన్ కాంఫ్లిక్ట్ ని బలంగా రిజిస్టర్ చేయడంలో కొంత తడబడిన మాట వాస్తవం. నిఖిల్ ద్వారకాకు వెళ్ళగానే చాలా ఎగ్జైటింగ్ ఎపిసోడ్స్ ఆశిస్తాం. కానీ వచ్చేవన్నీ ఎంగేజింగ్ గా అనిపిస్తాయి కానీ వాటిలో వావ్ ఫ్యాక్టర్ ఉండాల్సిన మోతాదులో లేదు.

అందుకే మైండ్ బ్లోయింగ్ రేంజ్ లో ఎలివేట్ అవ్వాల్సిన ఇంటర్వెల్ బ్లాక్ జస్ట్ ఓకే రేంజ్ లో సింపుల్ గా వెళ్ళిపోతుంది. ఒక్కో చిక్కుముడిని కార్తికేయ బృందం విప్పుకుంటూ వెళ్లిన తీరు ఇంకాస్త బలంగా ఉండాల్సింది. కొన్ని చోట్ల ఇంత తేలిగ్గానా అనిపిస్తుంది. కానీ విజువల్స్ ని ప్రెజెంట్ చేసిన ఇలాంటి మైనస్సులను బాగా కవర్ చేశాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి గుహలోకి ప్రవేశించాక జరిగే పరిణామాలను చందూ మొండేటి చాలా బాగా తీశాడు. గోవర్ధనగిరి కొండ ఎపిసోడ్ తర్వాత గ్రాఫ్ కొంచెం డౌన్ అయ్యిందని ఫీలవుతున్న తరుణంలో అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ తో ఇప్పించిన శ్రీకృష్ణుడి ఎలివేషన్ మళ్ళీ నిటారుగా కూర్చునేలా చేసింది. ఇదో బెస్ట్ సీన్.

ఇందులో గొప్పగా మెచ్చుకోవాల్సిన అంశం చందూ మొండేటి ఎలాంటి డైవెర్షన్ తీసుకోకపోవడం, నిఖిల్ అనుపమ మధ్య ప్రేమకథ ఓ రెండు పాటలు పెట్టే స్కోప్ ఉన్నప్పటికీ అసలు వాటి జోలికి వెళ్లకుండా రెగ్యులర్ ఫార్మాట్ అడ్డుగోడలను బద్దలుకొట్టేసి హమ్మయ్య అనిపిస్తాడు. బహుశా కొంతవరకు బడ్జెట్ పరిమితులు కూడా చందూని ప్రభావితం చేసి ఉండొచ్చు. నిఖిల్ మార్కెట్ ని మించి ఖర్చు పెట్టినప్పటికీ అది మరీ ఓవర్ ది బోర్డు వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవేళ వందల కోట్ల మార్కెట్ ఉన్న ఇంకో పెద్ద హీరో అయితే ఈ హద్దులు చెరిగి ఇంకా బెటర్ గా వచ్చేదేమో. అంజిలో కోడిరామకృష్ణ చేసిన పొరపాట్లు ఇక్కడ చందూ చేయలేదు. అంతే చాలు.

అలా అని కార్తికేయ 2ని అత్యద్భుతమైన థియేటర్ ఎక్స్ పీరియన్స్ అని చెప్పడం లేదు కానీ కానీ బిగ్ స్క్రీన్ మీద రికమండ్ చేసే కంటెంట్ అయితే ఉంది. ముందే చెప్పినట్టు కథనాన్ని ఇంకాస్త బిగితో అరెస్టింగ్ ఎపిసోడ్స్ డిజైన్ చేసుకుని ఉంటే దేనికీ తీసిపోని బెస్ట్ ఫాంటసీ మూవీగా మిగిలిపోయేది. అయినా కూడా ఇన్ని లిమిటేషన్స్ మధ్య ఈ సినిమాను మలిచిన విధానం అధిక శాతం ప్రేక్షకులను మెప్పిస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. అసలే హిందూతత్వపు సెంటిమెంట్లు బలంగా ప్రభావం చూపిస్తున్న టైంలో ఈ కార్తికేయ 2 తెలుగుతో పాటు నార్త్ లోనూ మంచి ఆదరణ దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే మార్కెటింగ్ చేసుకోవాలి.

అయితే జానర్ ఏదైనా సరే ప్రతినాయకుడు బలంగా ఉంటేనే హీరో లేదా కాన్సెప్ట్ బలంగా ఎలివేట్ అవుతుందని చాలాసార్లు చెప్పుకున్నాం. కార్తికేయ 2లోనూ ఇది వీక్ పాయింట్ అయ్యింది. డాక్టర్ శంతను చేసే పనులేవీ ఛాలెంజింగ్ అనిపించవు. చాలా కన్వీనియంట్ గా పాత్ర స్వభావంలోని క్రూరత్వాన్ని తగ్గించేశారు. దాని ఇంపాక్ట్ వల్లే ఏదో మిస్ అవుతున్న అసంతృప్తి కలుగుతుంది. అబ్బ ఏం మలుపు తిప్పాడన్న ట్విస్టుల కంటే టెక్నికల్ గా ప్రశంసలు అందుకునే సన్నివేశాలే ఎక్కువగా ఉన్నాయి. వీటిని ఏ మేరకు పబ్లిక్ ఆదరిస్తారనే దాన్ని బట్టే కార్తికేయ 2 కమర్షియల్ మీటర్ ఏ స్థాయికి వెళ్తుందనేది వేచి చూడాలి. హిట్టా అని డౌటాల్సిన పని లేదు

కంటెంట్ సంగతి కాసేపు పక్కనపెడితే ఇలాంటివి టాలీవుడ్ నుంచే వస్తున్నందుకు మనం గర్వపడాలి. ఆర్ఆర్ఆర్, బింబిసార, సీతారామం, కార్తికేయ 2 ఇవన్నీ ప్యూర్ తెలుగు ప్రోడక్ట్స్. ఒకపక్క రొడ్డకొట్టుడు మసాలాలు ఎన్ని వస్తున్నా వేటిని తిప్పికొట్టాలో వేటిని నెత్తినబెట్టుకోవాలో జనాలు చాలా క్లారిటీతో ఉన్నారు. కార్తికేయ 2 రెండో క్యాటగిరీలో పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలాగూ మూడో భాగానికి కూడా హింట్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడిది హిట్ అయితే మరింత గ్రాండ్ స్కేల్ ని కొనసాగింపులో ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. తనకు సూటయ్యే వాటిని మాత్రమే ఏరికోరి ఎంచుకుంటున్న నిఖిల్ మరికొందరికి స్ఫూర్తినివ్వాల్సిన అవసరం ఉంది.

కాలభైరవ నేపధ్య సంగీతం కార్తికేయ 2కి దన్నుగా నిలిచింది. కొన్ని చోట్ల ఇంకా మంచి స్కోర్ పడుంటే బాగుండేదనిపిస్తుంది కానీ ఓవరాల్ గా చూస్తే ఇతని పనితనం మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ లో ఆస్వాదించవచ్చు. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం గురించి చెప్పాలంటే టాప్ నాచ్ అనే పదం సరిపోతుంది. ఎడిటింగ్ బాధ్యతలు కూడా అతనివే. ల్యాగ్ ఫీలింగ్ ఇవ్వలేదు. కథ విస్తరణ ప్లస్ మాటలు రాసిన మణిబాబు పనితనం బాగుంది. నిఖిల్ కోడూరు విఎఫ్ఎక్స్ మెప్పిస్తుంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ విలువలు మాత్రం మెచ్చుకోవలసిందే. ఈ కాంబో మీద ఇంత ఖర్చు పెట్టేందుకు ముందుకు రావడం సబ్జెక్టు మీద నమ్మకమే

ప్లస్ గా అనిపించేవి

నిఖిల్ పాత్ర
విజువల్స్
సెకండ్ హాఫ్
శ్రీకృష్ణ తత్వం

మైనస్ గా తోచేవి

అంత ఎగ్జైటింగ్ అనిపించని ట్విస్టులు
స్లోగా సాగే ఫస్ట్ హాఫ్
కొన్ని లాజిక్స్ ని లైట్ తీసుకోవడం

కంక్లూజన్

ఒకపక్క ఎలాంటి సినిమాలు తీయాలో అర్థం కాక అర్బన్ డ్రామాల మత్తులో ఊగిపోతూ జనాన్ని థియేటర్లకు దూరం చేసుకుంటున్న బాలీవుడ్ మననుంచి నేర్చుకోవాల్సిన మరో పాఠం ఈ కార్తికేయ 2. విజువల్ మాయాజాలానికి ప్రాధాన్యత ఇస్తున్న ట్రెండ్ లో ఇలాంటి స్పిరిచువల్ కం అడ్వెంచర్ డ్రామాలు రావాల్సిన అవసరం మరింత ఉంది. భగవద్గీత చదివే ఓపిక ఇప్పటి జనరేషన్ కు ఎలాగూ లేదు కానీ కనీసం ఇలాంటి ప్రెజెంటేషన్స్ ద్వారా ఆ తత్వాన్ని సినిమాటిక్ రూపమైనా సరే కొంతైనా చెప్పే అవకాశం దక్కుతుంది. మొత్తానికి ఏదో ఓ మోస్తరుగా ఉంటుందేమోననే అంచనాల నుంచి బాగానే తీశారుగా అనే ఫీలింగ్ ఇవ్వడంలో కార్తికేయ 2 సక్సెస్ అయ్యింది

ఒక్కమాటలో – పాసైన కృష్ణుడి మాయ