iDreamPost

హ్యాపీ బర్త్ డే రివ్యూ

హ్యాపీ బర్త్ డే రివ్యూ

హ్యాపీ బర్త్ డే రివ్యూ

ఈ వారం అంతో ఇంతో చెప్పుకోదగ్గ అంచనాలతో వచ్చిన సినిమా హ్యాపీ బర్త్ డే. స్టార్ హీరో లేకుండా కేవలం కమెడియన్లు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇమేజ్ ని నమ్ముకుని దర్శకుడు చేసిన వెరైటీ ప్రయోగమిది. మత్తు వదలరాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రానా దర్శకుడు కావడంతో యూత్ లో అంతో ఇంతో హైప్ ఏర్పడింది. మైత్రి లాంటి సంస్థ అండగా నిలవడంతో పాటు ప్రమోషన్ పరంగా తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ మూవీకి ప్లస్ అయ్యింది. పైగా టికెట్ రేట్లు 110, 177 రూపాయలని పదే పదే పబ్లిసిటీలో చెప్పుకోవడం జనాన్ని ఆకట్టుకుంది. మరి ఇంత కూల్ గా వచ్చిన ఈ హ్యాపీ బర్త్ డే చూసినవాళ్లను హ్యాపీ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం.

కథ

ఇదో ఊహాతీత ప్రపంచం అనిపించే బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. రక్షణాశాఖ మంత్రి రిత్విక్ సోది(వెన్నెల కిషోర్) దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి గన్ వచ్చేలా కొత్త చట్టం తీసుకురావడంలో సక్సెస్ అవుతాడు. దీంతో ప్రతిఒక్కరి చేతికి పెన్ను ఉన్నంత సులభంగా తుపాకీ వచ్చేస్తుంది. బర్త్ డే పార్టీ కోసం రిట్జ్ హోటల్ కు వెళ్లిన పసుపులేటి హ్యాపీ త్రిపాఠి(లావణ్య త్రిపాఠి)కు అక్కడున్న పబ్బులో మత్తు మందు కలిపిన డ్రింక్ తాగడం వల్ల అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. తను కిడ్నాప్ కు గురవుతుంది. తర్వాత రకరకాల పాత్రలు ప్రవేశించి ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఆ తర్వాత జరిగేది స్క్రీన్ మీద చూస్తేనే కిక్కు

నటీనటులు

ఇందులో ప్రధాన పాత్రగా చెప్పుకున్న లావణ్య త్రిపాఠిది వన్ విమెన్ షో కాదు. అందరిలోనూ తనూ ఒకర్తి. కాకపోతే కీలకమైన ట్విస్టు ఈ క్యారెక్టర్ చుట్టూ సెట్ చేశారు కాబట్టి కొంత ప్రాముఖ్యత పెరిగింది. చావు కబురు చల్లగా లాంటి సినిమాల్లో చాలా నీరసంగా కనిపించిన లావణ్య దానికి పూర్తి వ్యతిరేకంగా ఇందులో ఆకర్షించే గ్లామర్ తో అందంగా కనిపించడమే కాదు డిఫరెంట్ వేరియేషన్ లో ఉండే పెర్ఫార్మన్స్ ని చక్కగా ఇచ్చింది. ఇది తను తప్ప ఎవరూ చేయలేరనేంత సీన్ లేదు కానీ తన మీద దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంది. స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మరీ ఇబ్బంది పెట్టలేదు కాబట్టి హ్యాపీనే.

హాస్య బృందం విషయానికి వస్తే సత్య మరోసారి తన టైమింగ్ తో చెలరేగిపోయాడు. ఈ మధ్య రొటీన్ అయిపోతున్న వెన్నెల కిషోర్ ఫ్రెష్ గా అనిపించి నవ్వుల్లో భాగమయ్యాడు. ఇది చూసేందుకు ఒకే కారణం చాలనుకుంటే వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు. గుండు సుదర్శన్, రాహుల్ రామకృష్ణ మేమేం తీసిపోలేదన్నట్టు కరెక్ట్ సీన్స్ వచ్చినప్పుడు ఆడుకున్నారు. సేనాపతితో ఆడియన్స్ దృష్టిలో పడ్డ నరేష్ అగస్త్య ఓకే అనిపించాడు కానీ వీళ్ళ గోలలో అతని పెర్ఫార్మన్స్ కలిసిపోయింది. గెటప్ శీను, రాకెట్ రాఘవ, రోహిణిలను వాడుకోవడంలో సరైన ఎపిసోడ్స్ పడక రితేష్ తడబడ్డాడు. ఫలితంగా కొంత మంచి క్యాస్టింగ్ వృథా అయ్యిందనే చెప్పాలి.

డైరెక్టర్ అండ్ టీమ్

టాలీవుడ్ జనాలకు అంతగా పరిచయం లేని సర్రియల్ కామెడీని తీసుకున్న రితీష్ ఆలోచన మంచిదే. అమెరికా లాంటి దేశాల్లో విపరీతంగా ఉన్న గన్ కల్చర్ ఎంత దారుణాలకు దారి తీస్తోందో నిత్యం మీడియాలో చూస్తున్నాం. దాన్ని సీరియస్ గా కాకుండా హాస్యభరితంగా చెబితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్ కి రితీష్ రాసుకున్న ట్రీట్ మెంట్ కొంత వరకే వర్కౌట్ అయ్యింది. కొన్ని జోకులు మనసారా నవ్విస్తాయి. మరుక్షణం కొన్ని సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. కొంత సరదాగా అనిపిస్తే దానికి రెట్టింపు స్థాయిలో కొంత చిరాకు కలుగుతుంది. ఇలా హ్యాపీ బర్త్ డే ఒక ప్రాపర్ గ్రాఫ్ అంటూ లేకుండా ఎగుడుదిగుడుగా సాగిపోయిది.

మత్తు వదలరాలో ఏదైతే ఎంటర్ టైన్మెంట్ ని సింపుల్ పద్ధతిలో చెప్పి మెప్పించాడో రితీష్ మళ్ళీ అలాంటిదే ఫాలో అయినా బాగుండేది. కానీ ఈసారి లౌడ్ గా నవ్వించాలని చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. యుట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్ టా రీల్స్ అంటూ రకరకాల మాధ్యమాల్లో బోలెడంత కామెడీ పబ్లిక్ కి అందుబాటులో ఉంది. అది కూడా ఫ్రీగా. అలాంటప్పుడు థియేటర్ కు వచ్చే ఆడియన్స్ కి అదే టైపులో వినోదాన్ని ఇస్తామంటే కుదరదు. ఆ మాత్రం దానికి అవే చూస్తాం కదా అంటారు ప్రేక్షకులు. అందులోనూ ఇప్పుడు పేలవమైన సన్నివేశాలను తమ టైమింగ్ తో నిలబెట్టే ఆర్టిస్టులు తక్కువ. ఏ మాత్రం బాలన్స్ తప్పినా బోల్తా కొట్టడమే

హ్యాపీ బర్త్ డే లో బోలెడు ఫన్ కు అవకాశం ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ ఓ మోస్తరుగా నడిపించిన రితీష్ రెండో సగం వచ్చేటప్పటికి అక్కర్లేని ప్రహసనాలు జొప్పించడంతో లెన్త్ ఎక్కువైపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంటర్వెల్ దాకా ఓ మాదిరి టెంపో మైంటైన్ చేసి ఆసక్తి రేపిన తర్వాత ఆపై వచ్చేది అంతకు డబుల్ డోస్ తో ఉంటుందని ఆశిస్తాం. కానీ జరిగేది ఇంకోలా ఉంటుంది. దొంగతనం, జైలు తతంగం, సాడ్ యాప్ ఇవన్నీ అనుకున్న రేంజ్ లో పేలలేదు. చాఫ్టర్స్ టైపులో నెరేట్ చేసుకుంటూ వెళ్లిన రితీష్ వాటిని ప్రాపర్ గా కనెక్ట్ చేసి క్లైమాక్స్ ని హై వోల్టేజ్ కామెడీతో డిజైన్ చేసి ఉంటే దీని స్థాయి ఎక్కడికో వెళ్ళేది. కానీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నాడు.

మన ఆడియన్స్ కి అలవాటు లేదు కాబట్టి ప్రయోగాలు చేయకూడదనే రూల్ ఏమి లేదు. ఆ మాటకొస్తే జంబలకిడిపంబ సబ్జెక్టు ఆ సమయానికి అతి పెద్ద రిస్క్. కానీ ఈవివి సత్యనారాయణ తన బలమంతా సామాన్యులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో రాసుకున్న హాస్యంలో ఉంది. కానీ హ్యాపీ బర్త్ డే కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేయడానికి ప్రయత్నించడంతో మాములు జనానికి ఒక దశ దాటాక అసలేం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురవుతారు. క్యారెక్టర్స్ ని రిజిస్టర్ చేయడానికి అంత సమయం తీసుకున్న రితీష్ స్క్రీన్ ప్లే మీద ఎక్కువ హోమ్ వర్క్ చేసుంటే డెబ్యూ మూవీ కన్నా గొప్ప ఫలితం ఖచ్చితంగా దక్కేది.

నవతరం దర్శకులు థియేటర్ ఎక్స్ పీరియన్స్ తాలూకు డెఫినిషన్ ని మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిందే. హాలు దాకా రావాలంటే ఆషామాషీ కంటెంట్ ఉంటే సరిపోదని కరోనా తర్వాత చాలా సినిమాలు ఋజువు చేశాయి. వాటిని ఉదాహరణగా తీసుకుని ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ కార్డు దాకా కనీసం 70 శాతం మెప్పించేలా ఉన్నా చాలు బ్లాక్ బస్టర్లు కొట్టేయొచ్చు. అది యాభై శాతం లోపే ఉంటే మాత్రం తేడా కొట్టేస్తుంది. దురదృష్టవశాత్తు హ్యాపీ బర్త్ డే రెండో క్యాటగిరిలో పడిపోయింది. బయటికొచ్చిన వాళ్ళను బాగుందా అని అడిగినప్పుడు నెట్ ఫ్లిక్స్ లో వస్తుందట అందులోనే చూసుకోమని సలహా ఇచ్చారంటే అది ఫెయిల్ కిందే లెక్క

కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో దాన్ని ఫీలవొచ్చు. కానీ పాటలు మాత్రం ఏ మాత్రం భరించేలా లేవు. క్యాచీ ట్యూన్స్ ఇచ్చి ఉంటే కనీసం వాటి కోసమైనా వచ్చే వాళ్ళు ఉంటారు. సురేష్ సారంగం ఛాయాగ్రహణం హ్యాపీ బర్త్ డే థీమ్ ని ప్రెజెంట్ చేయడంలో చక్కగా తోడ్పడింది. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సోసోనే. చాలా చోట్ల తగ్గించే అవకాశం ఉన్నా దాన్ని వాడుకోకపోవడంతో లెన్త్ పెరిగిపోయింది. డైలాగులు అక్కడక్కడా బాగా పేలాయి. నిర్మాణ విలువలను మెచ్చుకోవచ్చు. రాజీ లేకుండా అవసరమైనంత ఖర్చు పెట్టారు. ఇలాంటి రిస్క్ తీసుకునే ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి అవసరమే

ప్లస్ గా అనిపించేవి

సత్య పెర్ఫార్మన్స్
నేపధ్య సంగీతం
కొంత భాగం కామెడీ

మైనస్ గా తోచేవి

సెకండ్ హాఫ్
నిడివి
పాటలు

కంక్లూజన్

కాన్సెప్ట్ వెరైటీగా ఉండి చెప్పుకోదగ్గ కామెడీ కొంత ఉన్నంత మాత్రాన సినిమాలు థియేటర్లలో ఆడే రోజులు కావివి. ప్రేక్షకులు సంథింగ్ మోర్ అంటూ డిమాండ్ చేస్తున్నారు. రితీష్ రాతలో ఎంత వైవిధ్యమున్నా అది తీతలో కనిపించనప్పుడు చివరికి నిట్టూర్పే మిగులుతుంది. ఎంత యూత్ కోసమని చెప్పుకున్నా కూడా వాళ్ళూ రెండున్నర గంటల్లో సగానికే న్యాయం జరిగినప్పుడు మద్దతు ఇవ్వరుగా. ఫైనల్ గా చెప్పాలంటే బిగ్ స్క్రీన్ మీద ఏదో ఒకటి చూడనిదే శుక్రవారం గడవదు అనుకునే వాళ్ళకు ఓకే కానీ టికెట్ కు టైంకు న్యాయం జరగాలని డిమాండ్ చేసే వాళ్లకు మాత్రం ఈ హ్యాపీ బర్త్ డే విషెస్ చేదుగా ఉంటాయి

ఒక్క మాటలో – నాట్ హ్యాపీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి