iDreamPost
android-app
ios-app

Chandramukhi 2 Review: రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 రివ్యూ & రేటింగ్!

Chandramukhi 2 Review: రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 రివ్యూ & రేటింగ్!

ఒక డాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన లారెన్స్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. ఆ తర్వాత హారర్ జానర్ తో హీరో, డైరెక్టర్ గా కూడా మంచి మార్కులు కొట్టేశాడు. హారర్ జానర్ అంటే రాఘవ లారెన్స్ పేరు గుర్తొచ్చేలా చేశాడు. లారెన్స్ తీసిన కాంచన సిరీస్ ఎంత హిట్టో అందరికీ తెలుసు. ఇప్పుడు పి.వాసు డైరెక్షన్ లో చంద్రముఖి-2తో ప్రేక్షకులను భయపెట్టేందుకు వచ్చేశాడు. దాదాపు 18 ఏళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకి సీక్వెల్ తెరకెక్కింది. మరి.. మోస్ట్ అవైటెడ్ చంద్రముఖి సీక్వెల్ ఎలా ఉంది? ఎవరు ఎలా చేశారు? లారెన్స్- వాసు సక్సెస్ అయ్యారా? అనే విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ చదివేయండి.

కథ:

చంద్రముఖి సినిమా కథ అందరికీ తెలిసిందే. ఒక పాడుబడిన బంగ్లాలో ఉన్న చంద్రముఖి ఆత్మను జ్యోతిక నిద్ర లేపుతుంది. జ్యోతికను ఆవహించిన ఆత్మను మభ్య పెట్టి వెంకటపతి రాజుని చంపినట్లు రజినీకాంత్ నాటకం ఆడి పంపేస్తారు. ఈ మూవీలో రజినీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్, జ్యోతిక పాత్రలో కంగనా రనౌత్ నటించారు. పార్ట్ 1 ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే ఈ సీక్వెల్ ని నడిపించారు. రంగనాయకి(రాధిక) కుటుంబం.. వారికి వచ్చిన కష్టాలను, ఇబ్బందులను తొలగించుకునేందుకు కులదైవానికి పూజ చేయాలని స్వామీజీ(రావు రమేశ్) చెప్తాడు. కులదైవం పూజ కావడం, కుటుంబం మొత్తం కలిసి చేయాలి అని చెప్పడంతో వేరే మతస్తుడితో లేచిపోయిన కూతురు పిల్లను కూడా పిలావల్సి వస్తుంది. వారితో కలిసి మదన్(లారెన్స్) కూడా వస్తాడు.

కులదైవం గుడి దగ్గరలో ఉండే బంగ్లా(చంద్రముఖిలో ఉన్న మహల్)లోనే వీళ్లు దిగుతారు. కైలాష్ కుటుంబం వెళ్లిపోయాక బసవయ్య(వడివేలు) ఆ మహల్ యజమానిగా ఉంటాడు. మహల్ లో దక్షిణం వైపు వెళ్లద్దు అని పదే పదే చెప్పివెళ్తాడు. రాధిక కుటుంబం సమస్యలను వదిలించుకునేందుకు వచ్చి.. కొత్త సమస్యల్లో ఇరుక్కుంటారు. పార్ట్ 1లో కేవలం చంద్రముఖి పాత్రను పరిచయం చేశారు అంతే. కానీ, ఈ పార్ట్ లో మాత్రం అసలు నర్తకి చంద్రముఖి ఎవరు? ఆమె గతం ఏంటి? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? చంద్రముఖి పగ నెరవేరిందా? వెట్టై రాజుని చంపగిలిగిందా? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే మీరు చంద్రముఖి 2 సినిమాని థియేటర్లలో చూడాల్సిందే.

విశ్లేషణ:

చంద్రముఖి సినిమా హారర్ జానర్ లో ఒక క్లాసిక్ అనే చెప్పాలి. అప్పటివరకు తాను టచ్ చేయని ఒక పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించి మెప్పించిన మూవీ అది. ఆ సినిమాకి ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే కచ్చితంగా భారీ అంచనాలే ఉంటాయి. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఒకటి మాత్రం ఫిక్స్ అవుతారు. పార్ట్ 1 కథను పాత్రలు మార్చి తీశారు అనే ఫీలింగ్ కలుగుతుంది. స్ర్ర్కీన్ ప్లే కూడా పార్ట్ 1ని గుడ్డిగా ఫాలో అయ్యారు అనే ఫీలింగ్ కలుగుతుంది. హీరోకి అవమానాలు జరగడం మొదలు అతను ప్రేమలో పడటం, వడివేలుతో కామెడి ట్రాక్ ఇలా అన్నీ అచ్చం చంద్రముఖి సినిమాని మళ్లీ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ మూవీకి సంబంధించి చేసిన మార్పులు క్లైమాక్స్ ని మార్చి మూవీ నిడివి పెంచడం అనే చెప్పాలి. సినిమా కథ ప్రథమార్థంలో కాస్త నెమ్మదిగా సాగుతుంది. రజినీ- వడివేలు ట్రాక్ పండినట్లు.. లారెన్స్- వడివేలు ట్రాక్ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఇంటర్వెల్ కు చంద్రముఖి పాత్రను పరిచయం చేయడం ఆకట్టుకుంటుంది. కథలో కాస్త వేగం పెరిగింది అనుకునే సమయానికి.. లారెన్స్ లవ్ ట్రాక్- పాటలు కాస్త విసిగించిన ఫీలింగ్ కలిగిస్తాయి. తర్వాత వేటయ్య రాజుని పరిచయం చేసిన తర్వాత కథ మళ్లీ పరుగులు పెడుతుంది. ఫ్లాష్ బ్యాక్ లో కథ పరంగా పెద్దగా ఆసక్తికరంగా ఏమీ ఉండదు. కానీ, లారెన్స్- కంగనా రనౌత తమ నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తారు.

ఎవరెలా చేశారు?:

ఈ సినిమాలో లారెన్స్ పాత్రను పెద్దగా ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే అప్పుడెప్పుడో వచ్చిన మునితో మొదలు పెట్టి లారెన్స్ అన్నీ హారర్ పాత్రల్లోనే నటించాడు. అతని హిట్లు మొత్తం అదే జానర్ కి చెందినవి. కాబట్టి లారెన్స్ యాక్టింగ్ ప్రేక్షకులకు అంత ఫ్రెష్ గా ఏమీ అనిపించదు. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే వట్టేయ రాజు పాత్రలో ఇప్పటివరకు లారెన్స్ నటించలేదు. అక్కడ మాత్రం లారెన్స్ నటన అందరికీ తెగ నచ్చేస్తుంది. ఇంక కంగనా కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా కోసం కంగనా నృత్యం కూడా నేర్చుకున్నాను అని చెప్పింది. డాన్స్ సీక్వెన్స్ లో కంగనా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఆమె అభినయం, నృత్యంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంక రాధికా, వడివేలు, రావ్ రమేశ్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్ అందరూ తమ పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ వర్క్:

చంద్రముఖితో మెప్పించిన పి.వాసు చంద్రముఖి సీక్వెల్ తో మాత్రం ఒకింత నిరాశ పరిచారనే చెప్పాలి. ఎందుకంటే కథ, స్క్రీన్ ప్లే మొత్తం చూస్తున్నంతసేపు చంద్రముఖినే గుర్తు చేస్తూ ఉంటాయి. అక్కడ మాత్రం వాసు విఫలమయ్యారు. ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి సంగీతం అక్కడక్కడ మెప్పిస్తుంది. కొన్ని పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే కీరవాణి అందించారంటే నమ్మబుద్ది కాదు. పోరాట సన్నివేశాల్లో మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటుంది. ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. లైకా సంస్థ నిర్మాణం విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.

ప్లస్:

  • రాఘవ లారెన్స్
  • కంగనా రనౌత్
  • అక్కడక్కడ మెప్పించే సన్నివేశాలు

మైనస్:

  • రొటీన్ కథ, స్క్రీన్ ప్లే
  • సినిమా నిడివి
  • చంద్రముఖి ఎమోషన్ మిస్

చివరిగా: అంచనాలతో వెళ్లకుంటే మంచిది..

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి