iDreamPost

Beast Movie Review : బీస్ట్ రివ్యూ

Beast Movie Review : బీస్ట్ రివ్యూ

ఒకప్పుడు తెలుగులో అంతగా మార్కెట్ లేని విజయ్ తుపాకీ నుంచి ఇక్కడ చెప్పుకోదగ్గ ఫ్యాన్స్ ని ఏర్పరుచుకున్నారు. మరీ రజినీకాంత్ లెవెల్ కాదు కానీ ఉన్నంతలో తన ప్రతి సినిమా తెలుగులో డీసెంట్ ఓపెనింగ్స్ దక్కించుకుంటోంది. మాస్టర్ లాంటివి బయ్యర్లకు లాభాలు కూడా ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వచ్చిన కొత్త మూవీ బీస్ట్. పెద్దగా హడావిడి చేయకుండా వేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. కోకో కోకిల, డాక్టర్లతో మన ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న ఇతను తక్కువ టైంలోనే విజయ్ లాంటి స్టార్ తో చేసే అవకాశం దక్కించుకోవడం విశేషం. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథ

ఓ తీవ్రవాదిని పట్టుకునే క్రమంలో జరిగిన తప్పుకు బాధ్యతగా రా ఇంటలిజెన్స్ డిపార్ట్ మెంట్ నుంచి బయటికి వస్తాడు వీరరాఘవ (విజయ్). దాన్నే తలుచుకుంటూ మానసికంగా కృంగిపోతూ డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటూ ఉంటాడు. వేరే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న టైంలో ప్రియురాలు(పూజా హెగ్డే)తో కలిసి షాపింగ్ మాల్ లో ఇరుక్కుంటాడు. తమ నాయకుడిని విడిపించుకునే డిమాండ్ తో టెర్రరిస్టులు దాన్ని హైజాక్ చేస్తారు. దీంతో ప్రభుత్వానికి సహాయం చేసే బాధ్యత వీరరాఘవ మీద పడుతుంది. ముందు ఇష్టం లేకపోయినా తర్వాత సీరియస్ గా తీసుకుని ఫైనల్ గా ఏం చేశాడన్నది అసలు స్టోరీ

నటీనటులు

విజయ్ గొప్ప యాక్టర్ కాదు. కమల్ హాసన్ లాంటి వేరియేషన్లు, రజిని లాంటి వన్ మ్యాన్ మ్యానరిజం చూపించలేడు కానీ తనలో ఒకరకమైన మేజిక్ ఉంది. .స్టయిల్ తో మేనేజ్ చేస్తూ కేవలం మాస్ బ్లాక్ బస్టర్స్ తో ఇంత పెద్ద మార్కెట్ ని సృష్టించుకోగలిగాడు. అలాంటి దర్శకులు దొరకడమూ అతని లక్కే. బీస్ట్ కూడా అదే కోవలోకే వస్తుంది కానీ వాటి సరసన నిలిచే సీన్ అయితే లేదు. అయితే ఉన్నంతలో  ఈ పాత్రకు తగ్గట్టు అభిమానులు కోరుకున్నట్టు బాగానే చేశారు. ఒకరకంగా చెప్పాలంటే తన స్క్రీన్ ప్రెజెన్సే మరీ ఎక్కువ చిరాకు పుట్టించకుండా కాపాడింది. ఫ్యాన్స్ కి ఆశించింది ఇచ్చాడు కాబట్టి ఒకే

పూజా హెగ్డే ఎందుకు ఉందో ఏం చేస్తోందో అర్థం కాదు. మొదట్లో కొన్ని సీన్లు పడ్డప్పటికీ తర్వాత సైడ్ అయిపోయింది. రెండు పాటల్లో డాన్స్ వేయించి నాలుగైదు సీన్లు చేయించి మమ అనిపించేందుకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారు కాబోలు. సెల్వ రాఘవన్ సింపుల్ నటనతో బాగున్నారు కానీ ఆ పాత్ర కోరుకునే హోదా, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మిస్ అయ్యింది.  యోగిబాబు పెద్దగా నవ్వించలేదు. డాక్టర్ లో హైలైట్ అయిన రెడిన్ కింగ్స్లే కు స్కోప్ దక్కలేదు. విలన్ గ్యాంగ్ హెడ్ గా అంకుర్ వికల్ సోసోనే. ఉన్నంతలో విటివి గణేష్ స్లోగా మాట్లాడుతూ చేసిన కామెడీ అక్కడక్కడా పేలింది. లిల్లీపుట్ ఫరూక్ అసలు సూట్ అవ్వలేదు

డైరెక్టర్ అండ్ టీమ్

స్టార్ హీరో ఉంటే చాలు. వందల కోట్ల పెట్టుబడులతో క్యూ నిలబడి కుమ్మరించే డిస్ట్రిబ్యూటర్లు ఎలాగూ ఎగబడతారు. షోకి వెయ్యి అయిదు వందలు ఖర్చు పెట్టుకుని చూసే వీరాభిమానులున్నారు. ఎండాకాలంలో దొరికిందే నీరనుకుని థియేటర్లకు క్యూ కడుతున్న ఆడియన్స్ పెరుగుతున్నారు. సో కథా కాకరకాయలు పిచ్చ లైట్. ఇదీ ఇప్పటి కొందరు దర్శకుల ఆలోచనా తీరు.  బీస్ట్ చూశాక ఇదే అనుమానం కలుగుతుంది. ఎంతసేపూ హీరోయిజంని ఎలివేట్ చేస్తూ రెండున్నర గంటలు ఎలా గడుపుతున్నామాని స్క్రీన్ ప్లే రాసుకుంటున్నారు తప్ప నిజంగా మనం చెప్పాలనుకున్న ఉద్దేశం సరైన దిశలో వెళ్తోందా లేదా చెక్ చేసుకోవడం లేదు.

బందీలను అడ్డుగా పెట్టుకుని తమ డిమాండ్లు విలన్ బ్యాచ్ నెరవేర్చుకోవడమనే పాయింట్ కొత్తదేమీ కాదు. అలా అని తీసుకోకూడదని రూలేమీ లేదు. కాకపోతే విజయ్ రేంజ్ హీరో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి తమకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి. వాటిని ఎలా అందుకోవాలనే తాపత్రయం దర్శకులకు చాలా అవసరం. కానీ డాక్టర్ సక్సెస్ ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లనో ఏమో కానీ నెల్సన్ దిలీప్ కుమార్  ఈసారి సీరియస్ ప్లాట్ గా సిల్లీగా చెప్పాలని చూసి అటు నవ్వించలేక ఇటు ఆలోచింపజేయలేక చుక్కానిని మధ్యలోనే వదిలేయడంతో పడవ నడిసముద్రంలో మునిగిపోయే ప్రమాదం చాలాసార్లు కొనితెచ్చుకుంది.

విజయ్ ఎక్కడికక్కడ ప్యాచ్ వేసుకుంటూ కాపాడే ప్రయత్నం చేశాడు కానీ లాభం లేకపోయింది. ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయాక కూడా వాళ్ళ హెడ్డు హెడ్డు లేకుండా ప్రవర్తిస్తాడు. అంతా హీరోకు అనుకూలంగా జరిగేలా ఫైట్లు జరుగుతాయి. పోనీ వాటినైనా థ్రిల్ కలిగించేలా రాసుకున్నారా అంటే అదీ లేదు. తుపాకీ ఇంటర్వెల్ బ్లాక్ లో విజయ్ తన ఫ్రెండ్స్ తో ఒకేసారి టెర్రరిస్టు బ్యాచు మొత్తం చంపేస్తాడు. తీవ్రవాదులను కనీసం ముట్టుకోవడం కూడా జరగదు. వాహ్ ఏం తీశార్రా అనిపించే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటి వాటికి బీస్ట్ లో ఛాన్స్ ఉన్నప్పటికీ నెల్సన్ ఆ కోణంలో ఆలోచించలేదు. సింక్ కానీ కామెడీని బలవంతంగా ఇరికించబోయాడు.

కామెడీ ఎంటర్ టైనర్ అయితే ఎలాంటి లాజిక్స్ అక్కర్లేదు. కానీ తీసుకున్న పాయింట్ ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబందించినది అయినప్పుడు కనీసం ఫస్ట్ హాఫ్ అయ్యాకైనా నెరేషన్ లాజిక్స్ కి అందేలా గ్రిప్పింగ్ గా ఉండాలి. కానీ నెల్సన్ అవేవి పట్టించుకోలేదు. సగటు ఊర మాస్ సినిమా లాగా హీరో మీద బులెట్ల వర్షం కురుస్తున్నా ఒక్కటీ అతనికి తగలదు. క్లైమాక్స్ లో ఏకంగా పాకిస్థాన్ వెళ్ళిపోయి కరాచీ బేకరీలో బ్రెడ్డు తెచ్చినంత ఈజీగా ఆ దేశపు ఉగ్రవాదిని తెచ్చేస్తాడు. ఇక్కడ అదిరిపోయే విజువల్స్ ఉంటాయి. కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.  ఇవన్నీ చూస్తూ పైకి కాకపోయినా లోలోపల నవ్వొస్తూనే ఉంటుంది.

అప్పుడెప్పుడో కన్నడలో వచ్చిన నిష్కర్ష, రాజశేఖర్ మగాడు, నాగార్జున గగనంతో మొదలుపెట్టి నెట్ ఫ్లిక్స్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మనీ హీస్ట్ దాకా ఎన్నో రిఫరెన్సులు బీస్ట్ అణువణువునా కనిపిస్తాయి. కానీ వాటిలో ఉండే డెప్త్, ఇంటెన్సిటీ బీస్ట్ లో మిస్ అయ్యింది. అరెస్టింగ్ అనిపించే యాక్షన్ బ్లాక్స్ కానీ అదిరిపోయే పోరాటాలు కానీ ఏమి ఉండవు. నెల్సన్ తన బ్రాండ్ కామెడీని చూపించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలాంటి టెర్రరిస్టు సెటప్ తీసుకోవడమే మొత్తం వ్యవహారాన్ని సిల్లీగా మార్చేసింది. ఇలా కాకుండా బీస్ట్ ని యాక్షన్ ఎంటర్ టైనర్ గా మార్చి ఉంటే దీని లెవెల్ ఇంకోలా ఉండేది. కానీ మంచి ఛాన్స్ ఇలా వృధా అయ్యింది

అనిరుద్ రవిచందర్ ఇచ్చింది రెండు పాటలే. ఒకటి ఆల్రెడీ హిట్ అయిన అరబ్బీ సాంగ్. చూసేందుకు బాగానే ఉంది కానీ లిరిక్స్ మాత్రం కర్ణకఠోరంగా ఉన్నాయి. శుభం కార్డు పడ్డాక వచ్చే పాట ఓపికను డిమాండ్ చేయదు కాబట్టి అదయ్యేలోగా ఇంటికి వచ్చేయొచ్చు. మనోజ్ పరమహంస ఛాయాగ్రహణం మాత్రం చాలా బాగుంది. నిర్మాత పెట్టిన ఖర్చు విజువల్ గా ఎలివేట్ చేయడం కొందరికే సాధ్యం. ఇందులో ఈయన పర్ఫెక్షనిస్ట్. నిర్మల్ ఎడిటింగ్ కొంత ల్యాగ్ ని తగ్గించాల్సింది. సన్ పిక్చర్స్ సంస్థ స్టార్ల లెక్కల్లో తప్ప కథల బరువు మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. అందుకే మొన్న పెద్దన్న, నిన్న ఈటి ఇప్పుడు బీస్ట్

ప్లస్ గా అనిపించేవి

విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్
అనిరుద్ బిజిఎం
కెమెరా వర్క్

మైనస్ గా తోచేవి

అంతగా పేలని కామెడీ
పూజా హెగ్డే
గాలికొదిలేసిన లాజిక్స్
సెకండ్ హాఫ్

కంక్లూజన్

పండగలు పబ్బాల్లాగే తమిళ ప్రేక్షకుల అభిరుచులు మనవి వేర్వేరు. ఈ బీస్ట్ వంటకం మనకు సూటవ్వని ఆరవ సాంబార్. పోనీ ఏదోలా అడ్జస్ట్ అవుదామంటే కారం బదులు అందులో చక్కర వేస్తే ఇడ్లీ ఎంత బాగున్నా అందులో నంజుకుని తినలేం. ఏదో విజయ్ అంటే టాటూలు వేసుకుని రక్తం ఇచ్చేంత అభిమానం ఉంటే తప్ప ఈ బీస్ట్ ఓ మాదిరిగా కూడా మెప్పించడం కష్టం. ప్రొడక్షన్ వేల్యూస్, విజయ్ స్టార్ ఇమేజ్ ఏదో చివరిదాకా థియేటర్లో కూర్చొనిచ్చాయి కానీ ట్రెండ్ మారిపోయిన ఈ ఓటిటి కాలంలో కుటుంబ ప్రేక్షకులను, యూత్ ని థియేటర్ల దాకా రప్పించేంత బలమైన మ్యాటర్ బీస్ట్ లో లేదు. ఆపై మీ ఇష్టం మరి

ఒక్క మాటలో – సిల్లీ టేస్ట్

 

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి