iDreamPost
iDreamPost
కెరీర్ ని చిన్న పాత్రలతో మొదలుపెట్టినప్పటికీ కేవలం రెండు సినిమాలతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. లాస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ తర్వాత ఏకంగా ఏడాది పైగా గ్యాప్ రావడంతో అభిమానులు దీని మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆడియో కాస్త వీక్ గా ఉండటంతో పాటు ప్రమోషన్ పరంగా విజయ్ దేవరకొండ గత చిత్రాల స్థాయిలో దీనికి పబ్లిసిటీ జరక్కపోవడం, హైప్ కూడా కాస్త లో ప్రొఫైల్ మైంటైన్ చేయడం లాంటి కారణాలు ఫ్యాన్స్ ని కొంత టెన్షన్ పెట్టినా ఒకేసారి నలుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేశాడు కాబట్టి ఇది ఖచ్చితంగా రొటీన్ కు భిన్నంగా ఉంటుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మించిన ఈ వరల్డ్ ఫేమస్ లవర్ ప్రేమికుల రోజున అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం
కథ:
ఇది నాలుగు ప్రేమకథల కలబోత. కాకపోతే వాటిలో ఒక్కటే నిజం. మిగిలినవి ఊహల్లో జరిగేవి. గౌతమ్(విజయ్ దేవరకొండ) యామిని(రాశి ఖన్నా) చాలా ఘాడంగా ప్రేమించుకుని సహజీవనంలో ఉంటారు. కానీ రచయిత కావాలన్న లక్ష్యంతో ఉన్న గౌతమ్ చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఏ పనీ చేయకుండా మొద్దులా మారిపోతాడు. అతని ప్రవర్తనకు విసుగు చెందిన యామిని బ్రేకప్ కు సిద్ధపడుతుంది. దాంతో తనలో రైటర్ కు పని కల్పిస్తాడు గౌతమ్. అందులో భాగంగా తనే కథానాయకుడిగా కొత్త లవ్ స్టోరీస్ ఊహించుకుని రాయడం మొదలుపెడతాడు. సువర్ణ(ఐశ్యర్య రాజేష్), స్మిత(క్యాథరిన్ త్రెస్సా), ఇజా(ఇజాబెల్లె)లతో వేర్వేరు ప్రాంతాల్లో నేపధ్యాల్లో వాళ్ళతో నడిపిన ప్రేమను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. అసలు ఇన్నేసి వలపు కథల్లో ఏం జరిగింది, అన్నింటిలోనూ హ్యాపీ ఎండింగ్ ఉందా, చివరికి నిజమైన జంట గౌతమ్ యామినిల గొడవ సమిసిపోయి కలిసిపోయారా లేదా అనేది తెరమీద చూడాలి
ఎలా చేశారు:
విజయ్ దేవరకొండ గొప్ప నటుడనే కితాబిస్తే తొందరపాటు అవుతుంది కానీ అతనిలో ఉన్న స్పార్క్, యూత్ ని విపరీతంగా ఆకట్టుకునే బాడీ లాంగ్వేజ్ స్టార్ గా మలచిన మాట నిజం. సగటు యువకుల ప్రవర్తనకు అద్దంలా నిలిచే విజయ్ సాధ్యమైనంత సహజత్వంతో కూడిన నటనను బాగా మిక్స్ చేయడంతో ఈజీగా కనెక్ట్ అవుతూ వచ్చాడు. ఇందులోనూ అదే జరిగింది. కాకపోతే వన్ ప్లస్ త్రీ ఆఫర్ లాగా ఒకే సినిమాలో మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేయాల్సి రావడంతో పెర్ఫార్మన్స్ పరంగా మంచి స్కోప్ దొరికింది.
అలా అని ఇదేదో కమల్ హాసన్ చేసిన ట్రిపుల్ రోల్ లాంటి కథ కాదు కానీ ఉన్నంతలో నలుగురు అమ్మాయిలను వేర్వేరుగా ప్రేమించే యువకుడిగా మాత్రం విజయ్ దేవరకొండ పర్ఫెక్ట్ ఛాయస్ గా నిలిచాడు. గౌతమ్ పాత్ర టేకాఫ్, దాని ప్రవర్తన రెగ్యులర్ షేడ్ లోనే ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అర్జున్ రెడ్డి ఛాయలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఆ తర్వాత వచ్చే శీనయ్యగా విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్ గా ఫ్రెష్ గా కనిపిస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే సువర్ణతో శీనయ్య ట్రాకే సినిమా మొత్తంలో చూడొచ్చు అనే ఫీలింగ్ కలిగిస్తుంది. విజయ్ దేవరకొండను రొటీన్ పాత్రల్లో కాకుండా ఎలా వాడుకోవచ్చో మంచి ఉదాహరణగా ఈ ఎపిసోడ్ ని చూపించొచ్చు.
ఇక యామినిగా రాశి ఖన్నా బాగా సింక్ అయ్యింది. ఎమోషన్స్ అవసరమైన చోట దానికి తగ్గట్టు మంచి ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ పాత్రను నిలబెట్టే ప్రయత్నం గట్టిగా చేసింది. కాకపోతే డైలాగ్స్ కంటే ఏడుపులే ఎక్కువిచ్చాడు దర్శకుడు. కాకపోతే స్టోరీ పరంగా మిగిలిన ముగ్గురికి కూడా స్క్రీన్ స్పేస్ ఉండటంతో రాశికి సినిమా మొత్తం ఉండే లెన్త్ లేకపోయింది. అయినా కూడా తనదే కీలక రోల్. ఇక వీళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మన్స్. పక్కా మాస్ లో సగటు పేదింటి అమ్మాయిగా సాలిడ్ గా నటించేసింది. కౌసల్య కృష్ణమూర్తి తర్వాత తనవరకు గుర్తించుకోవాల్సిన సినిమా ఇది. విజయ్ దేవరకొండ లాంటి యాక్టర్ కు ధీటుగా ఆయా సీన్లను పండించేసింది. ఇక క్యాథరిన్ త్రెస్సా లుక్స్ తో పాటు నటనలోనూ జస్ట్ ఓకే అనిపించింది. ఇక ఇసాబెల్లె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమి లేదు. ఉన్నంతలో బాష రాకపోయినా కెమిస్ట్రీని బాగా పండించింది. వీళ్ళు తప్ప ప్రియదర్శి, జయరాం, శత్రులాంటి వాళ్లవి ఇలా వచ్చి అలా వెళ్లే పాత్రలు కాబట్టి ఎవరి గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎక్కువగా పడలేదు
దర్శకుడి గురించి:
దర్శకుడు క్రాంతి మాధవ్ సెన్సిబిలిటీస్ ఉన్న రైటర్. అది ఓనమాలులో కొద్దిగా బయటపడితే మళ్ళీ మళ్ళీ రాని రోజు తారాస్థాయికి చేర్చింది. అందులో ఎమోషన్ ని ఎక్స్ ప్లోర్ చేసిన తీరు, కథను నడిపించిన విధానం, ముఖ్యంగా కట్టిపడేసేలా ఉన్న సంభాషణలతో సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ ను కూడా అదే పంథాలో నడిపించాలనే ప్రయత్నం చేసిన క్రాంతి మాధవ్ ఒక స్టేజిలో విజయ్ దేవరకొండకు ఇమేజ్ ఉంది కాబట్టి అతన్ని ఇలా చూపిస్తేనే జనం రిసీవ్ చేసుకుంటారనే ఆలోచనతో కథ రాసుకోవడం సెకండ్ హాఫ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
హీరో జరగని ప్రేమకథను ఊహించి చెప్పడమో లేదా ఈ సినిమాలో డీల్ చేసినట్టు పుస్తకం రాసుకుంటూ చూపించడమో అంత ఈజీగా కనెక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే తెరమీద చూస్తున్న జంటల మధ్య కెమిస్ట్రీ కృత్రిమం అని ఎప్పుడైతే ప్రేక్షకుడికి అనిపిస్తుందో ఇక అక్కడి నుంచి పాత్రలతో ట్రావెల్ చేయడం ఆపేస్తాడు. అలా కాకుండా అసలు ఆ తలపే రాకుండా హీరో పాత్ర తాలూకు భావోద్వేగాలను ఆస్వాదిస్తూ లీనం చేయడం అనేది స్క్రీన్ ప్లే ని బట్టి ఉంటుంది. క్రాంతి మాధవ్ టేకాఫ్ పరంగా బాగానే మొదలుపెట్టినా, మొదటి సగంలో ఓ మాదిరి ఇంప్రెషన్ ని క్రియేట్ చేసినా దాన్ని చివరిదాకా కొనసాగించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు
ప్రేమ అనేది కాలంతో సంబంధం లేని ఎమోషన్. కానీ దాన్ని సరిగ్గా ఆవిష్కరించగలిగితేనే దర్శకుడు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వగలడు. ఇందులో ఏ మాత్రం తడబడినా సాగదీసినా ఆడియన్స్ నిర్ధాక్షిణ్యంగా తిరస్కరిస్తున్న రోజులివి. ఎక్కడిదాకో ఎందుకు గత వారం కల్ట్ క్లాసిక్ రీమేక్ గా వచ్చిన జాను ఆశించిన ఫలితం అందుకోలేకపోవడానికి కారణం ఇదేగా. వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ తో ఇదో గొప్ప ప్రేమ కథ అని చెప్పే క్రాంతి మాధవ్ లక్ష్యం నీరుగారడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. శీనయ్య వెనుక స్మిత అంత సులువుగా అతనంటే పడిచచ్చిపోయేలా వెనుకబడటం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. కాకపోతే ఆ ఎపిసోడ్ లో ఉన్న ఫ్రెష్ నెస్, తెలంగాణా స్లాంగ్ ఈ లోపాన్ని బాగా కవర్ చేశాయి.
అయితే ఏ కథలోనూ ఎమోషనల్ థ్రెడ్ బలంగా లేకపోవడం వరల్డ్ లవర్ కున్న ప్రధాన బలహీనత. రైటర్ కావాలన్న గోల్ తో ఉన్న గౌతమ్ అంత బాధ్యతారాహిత్యంగా ఎందుకు మారిపోయాడో సరిగా చూపించలేదు. ఆ కోణంలో గౌతమ్ కన్నా యామిని మీదే ఎక్కువ సానుభూతి కలుగుతుంది. ఖచ్చితంగా అర్జున్ రెడ్డి స్టైల్ లోనే గౌతమ్ పాత్ర ఉండాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో కానీ అదే ఆ క్యారెక్టర్ ప్రత్యేకతను పూర్తిగా తగ్గించేసింది. దీని బదులు ఇళ్ళెందు గ్రామంలోనే పూర్తి లవ్ స్టోరీగా దీన్ని ప్లాన్ చేసుకుని ఉంటే ఈ లవర్ ఇంకా బాగా మెప్పించేవాడేమో. తనకు తానే రొటీన్ అవుతున్నాడని గుర్తించాడు కాబోలు విజయ్ దేవరకొండ ఇకపై ప్రేమకథలు చేయనని ప్రకటించాడు. ఆ నిర్ణయం సబబే అని సినిమా అయ్యాక అనిపిస్తుంది. ఒకరకమైన మూసలోకి తనను తోస్తున్న సినిమాల నుంచి విజయ్ దేవరకొండ బయటికి రావడం ఇప్పుడు చాలా అవసరం
సాంకేతిక వర్గం:
నిజానికి ఇలాంటి ప్రేమకథలకు బలంగా నిలవాల్సిన సంగీతం ఎందుకో వీక్ గా ఉంది. గతంలో ఇదే హీరోకు గీత గోవిందం లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చిన గోపి సుందర్ పని ఒత్తిడి వల్లనో లేక ఇంకే కారణమో తెలియదు కానీ చాలా యావరేజ్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. ఒకటి తప్ప ఇంకే పాటా మళ్ళీ వినాలనిపించేలా ఉండదు. నేపధ్య సంగీతం కూడా మరీ గొప్పగా ఏమి అనిపించదు. ఏదో అలా అలా సాగుతుంది. కొన్ని సీన్స్ లో మాత్రం మూడ్ కి తగ్గట్టు ఎలివేట్ అయ్యే మ్యూజిక్ ఇచ్చాడు గోపి సుందర్. ఒకవేళ పాటలు కనక అద్భుతంగా ఉండి రిపీట్ వేల్యూ ఉంటే కనక వరల్డ్ ఫేమస్ లవర్ కనీసం సాంగ్స్ కోసమైనా ఒక ఛాయస్ గా నిలిచే వాడు. ఆ అవకాశమూ లేకుండా పోయింది.
జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం చాలా బాగుంది. కథ పరంగా థీమ్ మారుతూ వెళ్తున్న కొద్ది ఆ ఫీల్ ని మిస్ కాకుండా దర్శకుడు కోరుకున్న విజువాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపడంలో సక్సెస్ అయ్యాడు. కోటగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ లెన్త్ ని కంట్రోల్ చేయలేకపోయింది. రెండున్నర గంటలే ఉన్నప్పటికీ చాలా సాగతీత ఉంది. ఇంకో ఇరవై నిముషాలు కోత వేసినా పెద్ద నష్టమేమి ఉండేది కాదు కానీ ఎందుకో జరగలేదు. నిర్మాణ విలువలు క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ కు తగ్గట్టు రిచ్ గా ఉన్నాయి. నిర్మాత వల్లభ సబ్జెక్టు డిమాండ్ మేరకు బాగానే ఖర్చు పెట్టారు
ప్లస్ గా అనిపించేవి
విజయ దేవరకొండ నటన
ఐశ్వర్య రాజేష్
సినిమాటోగ్రఫీ
ఫస్ట్ హాఫ్
మైనస్ గా తోచేవి
సీరియస్ టోన్ లో సాగడం
పాటలు
ఐదు పాత్రలే ఉండటం
ఇటలీ లవ్ ఎపిసోడ్
సెకండ్ హాఫ్
క్లైమాక్స్
చివరి మాట
ప్రేమ అనే అనిర్వచనీయమైన అనుభూతిని తెరపై ఇప్పటికే కొన్ని వేల సార్లు చూసిన ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ దాన్ని చూపించి మెప్పించాలంటే కావాల్సింది ఎమోషన్. అది బలంగా లేకుండా ఎంత వెరీయేషన్ తో ఎన్ని లవ్ స్టోరీస్ చూపించినా కనెక్ట్ కావడం సులభం కాదు. వరల్డ్ ఫేమస్ లవర్ అడుగులు మొదట్లో బాగానే మొదలైనా సరైన డైరెక్షన్స్ లేకపోవడంతో పడుతూ లేస్తూ ఆఖరికి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అనే ఆక్సీజన్ మాస్కుతో కొనఊపిరితో ప్రాణమైతే నిలబెట్టుకున్నాడు కానీ అది బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు పెట్టేందుకు సరిపోదు
ఒక్కముక్కలో చెప్పాలంటే
వరల్డ్ క్లాస్ లవర్ – జారిపడ్డ ప్రేమికుడు