Idream media
Idream media
అరిగిపోయిన కథతో చితకబాదిన రూలర్
భయపడిందే జరిగింది. ట్రైలర్ చూసినప్పుడే అనుమానం వచ్చింది. బాలకృష్ణ రక్తం కారేట్టు కొడుతాడని. సింహగర్జనతో రూలర్ టైటిల్ పడినప్పుడే హెచ్చరించారు. ఆ సింహం నేరుగా మన మీదికి దూకుతుందని.
అసలీ సినిమా కొత్తగా తీశారా, లేదంటే బాలకృష్ణ పాతసినిమాల క్లిప్పింగులు అతికించి మళ్లీ చూపించారా అని మనకి Doubt కూడా వస్తుంది. ఈ విషయంలో దర్శకుడు KS Ravikumar సక్సెస్ అయ్యాడు.
మహాభారతం రాసినప్పుడు వ్యాసుడు ఊహించి ఉండడు. అజ్ఞాతవాసం Conceptని భవిష్యత్‌లో సినిమా వాళ్లు సబ్బు బిళ్లలాగా అరగతీసి వాడుతారని. బాషా సినిమా తీసిన రవికుమార్ అదే కథని ఇంకోలా చెప్పి రూలర్ తీశాడు. ఈ కథ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతుంది. బాషా బొంబాయిలో జరుగుతుంది.
ఈ సినిమా 1987లో ప్రారంభమవుతుంది. ఒక ఏరియాలో రౌడీయిజం, హత్యలు, నేరాలు ఎక్కువైపోతే ప్రకాశ్‌రాజ్ ఒక కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తాడు. రైతులని రప్పించి వ్యవసాయం చేయిస్తే నేరాలు తగ్గిపోతాయట. ఉత్తరప్రదేశ్‌లో రైతులే లేనట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది మంది రైతులని రప్పించి , వాళ్లకి ఉచితంగా భూములిచ్చి వ్యవసాయం చేయిస్తాడు.
కట్ చేస్తే 2017లో జయసుధ కారుకి రక్తం కారుతున్న బాలకృష్ణ ఎదురొస్తాడు. ఆమె అతన్ని కాపాడి కొడుకులా చూసుకుంటుంది. బాలకృష్ణకి గతం గుర్తు ఉండదు. దాంతో ఫస్టాప్ అంతా విచిత్రమైన గడ్డంతో కనిపిస్తూ ఉంటాడు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న అమ్మాయిని హెలికాప్టర్‌లో నుంచి కాపాడుతాడు. హీరోయిన్‌తో పాట పాడుతాడు. తలాతోకా లేని కామెడీతో హింసిస్తాడు. ధనరాజ్, అదుర్స్ రఘు, శ్రీనివాస్‌రెడ్డి, రఘుబాబు ఛీప్ కామెడీతో టార్చర్ పెడతారు.
కథ ఉత్తరప్రదేశ్‌కి వెళుతుంది. అక్కడో విలన్. వాడు తెలుగు రైతుల్ని హింసిస్తూ ఉంటాడు. గతంలో జయసుధని బెదిరించి ఉంటాడు. దాంతో బాలకృష్ణ అక్కడికి వెళ్లి సోలార్ పవర్ ప్రాజెక్ట్‌కి భూమిపూజ ప్రారంభిస్తాడు. విలన్ మనుషులు ఎంట్రీ. వాళ్లని గాల్లోకి ఎగరేసి తంతాడు. తన్ని ఎగరేస్తాడు. ఆ ఊరి ప్రజలు బాలకృష్ణని చూసి ధర్మ అంటారు. ఇంటర్వెల్. ఆ తర్వాత మన ఖర్మ.
సెకెండాఫ్‌లో ధర్మ అనే పోలీస్ ఆఫీసర్‌గా హీరో Entry. సెకెండ్ హీరోయిన్‌గా వేదిక, సప్తగిరి కామెడీ, విలన్ మనుషులని ఉతకడం, మధ్యలో భూమిక ఎపిసోడ్. ప్రకాశ్‌రాజ్ కూతురు భూమిక, ప్రేమ పెళ్లి చేసుకుంటే కులాన్ని అవమానించిందని ఆమె భర్తని ప్రకాశ్‌రాజ్ తమ్ముడు హత్య చేస్తాడు. వాళ్లని హీరో కాపాడి తన ఇంట్లో పెట్టుకుంటాడు.
ఇలాంటి సినిమాలు ఎన్ని చూసి ఉంటామో లెక్కలేదు. రవికుమార్ ఏ ధైర్యంతో తీశాడో తెలియదు. ఫైటింగ్‌లు ఎక్కువ ఉంటే మాస్‌కి ఎక్కుతుందని ఆయన నమ్మకం కావచ్చు. అందుకే బాలకృష్ణ కర్రతో , కత్తితో, తుపాకీతో, సుత్తితో అన్ని రకాల ఆయుధాలని వాడుతాడు.
భూమికని చూస్తే జాలి కలుగుతుంది. ఒకప్పటి అందాల హీరోయిన్ ఈమేనా అని అనుమానం వస్తుంది. సప్తగిరిని చూస్తే అయ్యో అనిపిస్తుంది. హీరో కావాలనుకుని , కమెడీయన్‌గా కూడా పనికి రాకుండా పోయాడు. జయసుధ ఉన్నా ఏం ఉపయోగం లేదు.
ఫైటింగ్‌లకి అదనంగా రైతుల గురించి పొడుగాటి డైలాగ్‌లు ఉంటాయి. నిజానికి ఇది రైతుల సమస్యపైన సినిమా కాదు. పోనీ పోలీస్ అధికారిగా హీరో క్యారెక్టర్ ఎలివేట్ అయ్యిందా అంటే అదీ లేదు. పాటలు వస్తే భయమేస్తుంది. బాలకృష్ణ చిత్రవిచిత్రమైన స్టెప్ లేస్తాడు కాబట్టి.
పరుచూరి మురళి కథ ఇచ్చాడు. బాలకృష్ణ పాత సినిమా బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటాడు. డైరెక్టర్ ఎలాగూ బాషా Hangover లో ఉన్నాడు కాబట్టి గుర్తు పట్టి ఉండడు.
ఎండ్ టైటిల్స్‌లో కథ కోసం ఏడుగురు రచయితలు పనిచేసినట్టు పేర్లు కనిపించాయి. సద్ది అన్నాన్ని కొత్తగా వండిందేమిటో?
ఈ సినిమాలో విలన్ మనిషి ముక్కులోంచి రక్తం వస్తే నాకు ఏమైంది అని అడుగుతాడు. హీరో కొట్టాడని పక్కనున్న వాడు చెబుతాడు. అదే డైలాగ్ ప్రేక్షకుడికి కూడా వర్తిస్తుంది.