iDreamPost
iDreamPost
ఈ మధ్యకాలంలో చిన్న హీరోలు నటించిన ఓ సినిమాకు ఇంత హైప్ రావడం ఒక్క జాతిరత్నాలు విషయంలోనే జరిగింది. ఇంకా టాక్ తెలియకుండానే రిలీజ్ రోజుకు ముందు అడ్వాన్స్ బుకింగ్ విషయంలో టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ఈ మూవీకి మహానటి దర్శకుడు నాగ అశ్విన్ నిర్మాతగా వ్యవహరించడం, స్వప్న బ్యానర్ అధినేతలు ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో శివరాత్రికి ఇదో మంచి ఆప్షన్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ముందుగానే కలిగింది. అనుదీప్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ జాతిరత్నాలు టైటిల్ కు తగ్గట్టు సాగిందో లేదో రివ్యూలో చూద్దాం
కథ
తెలంగాణ రాష్ట్రం జోగిపేటలో ఉండే శ్రీకాంత్(నవీన్ పోలిశెట్టి)కి తండ్రి నడిపే లేడీస్ ఎంపోరియం కొనసాగించడం ఇష్టం ఉండదు. సిటీకి వెళ్లి ఏదైనా పెద్ద జాబ్ చేస్తూ అక్కడే సెటిల్ కావాలని కలలు కంటూ ఉంటాడు. ఓ ముహూర్తం చూసుకుని బయలుదేరతాడు. శ్రీకాంత్ వెంటే ఉండే చిన్ననాటి స్నేహితులు రవి(రాహుల్ రామకృష్ణ), శేఖర్(ప్రియదర్శి)లు కూడా హైదరాబాద్ వచ్చేస్తారు. ముగ్గురూ ఉద్యోగం వేటలో ఉండగా క్రీడా శాఖా మంత్రి చాణక్య(మురళి శర్మ)కుట్ర వల్లే మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అక్కడి నుంచి వీళ్ళ జీవితాలు ఉరుకులు పరుగులు పెడతాయి. అసలు ఇంత పెద్ద పద్మవ్యూహంలో వీళ్ళు ఎలా చిక్కుక్కున్నారనేది తెరమీదే చూడాలి
నటీనటులు
నవీన్ పోలిశెట్టిలో మంచి చలాకీతనం, ఇప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే కామెడీ టైమింగ్ పుష్కలంగా ఉన్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలో ఇతని పాత్ర తీరు తెన్నులు ఎలా ఉన్నా తన ఆహార్యం, నటనతో నిలబెట్టడమే హిట్టుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. కాస్త దూకుడుగా స్పీడుగా సాగే డైలాగ్ డెలివరీతో హడావిడి చేసినట్టుగా కనిపించినా ఇతని శైలినే ప్రత్యేకత తీసుకొచ్చిందనడంలో సందేహం అక్కర్లేదు. ఇందులోనూ ఆశించినట్టే చెలరేగిపోయాడు. ముఖ్యంగా వన్ లైనర్స్ ని పలికిన తీరు, క్లైమాక్స్ ని నిలబెట్టిన విధానం మంచి భవిష్యత్తు ఉందని చెప్పకనే చెబుతుంది
ఇక నవీన్ తో సమానంతో సినిమా మొత్తం కనిపించే ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు వాళ్ళ ఎనర్జీని పూర్తిగా వాడుకునే దర్శకుడు అనుదీప్ రూపంలో దొరికాడు. ఇలాంటి ఛాన్స్ కోసమే ఎదురు చూస్తున్న ఈ ఇద్దరూ దానికి తగ్గట్టే చెలరేగిపోయారు. నవీన్ ఎక్కడిక్కడ డామినేట్ చేస్తున్నా సరే తమ ఉనికిని గట్టిగానే చాటుకున్నారు. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత రాహుల్ రామకృష్ణ అదరగొట్టాడు. తాగుబోతుగా చాలా చోట్ల నవీన్ ని తలదన్నేలా నవ్వులు పూయించాడు. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హోమ్లీగా బాగుంది. కామెడీ సీన్స్ లో కూడా బాగానే నటించింది. మురళీశర్మ, బ్రహ్మాజీ, గిరిబాబు, నరేష్, వెన్నెల కిషోర్, రంగస్థలం మహేష్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్ తదితరులవి రెగ్యులర్ పాత్రలే కానీ అన్నీ చక్కగా కుదిరాయి
డైరెక్టర్ అండ్ టీమ్
టీవీలో వెగటు పుట్టించే డబుల్ మీనింగ్ కామెడీకి బలవంతంగా అలవాటు చేయబడ్డ తెలుగు ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సైతం మంచి హాస్యం కనిపించక చాలా కాలం అవుతోంది. అలా రాసేవాళ్ళు లేకనో అలా రాసినా తీసే ధైర్యం లేని నిర్మాతలు దొరకనో కారణం ఏదైనా బూతులు లేకుండా జనాన్ని నవ్వించడం పెద్ద సవాల్ గా మారిపోయింది. ఈ లోటుని దర్శకుడు కెవి అనుదీప్ సరిగ్గా పసిగట్టాడు.ఇప్పటి జెనరేషన్ పల్స్ ని సరిగ్గా పట్టుకున్నాడు. డైరెక్టర్ కంటే మెరుగ్గా తనలో కామెడీ రైటర్ ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. చిన్న చిన్న మాటలతోనే పెదవులపై వద్దన్నా నవ్వొచ్చేలా మెప్పించాడు
జాతిరత్నాలు నిజానికి ఎప్పుడు చూడని కథ కాదు. ట్రీట్మెంట్ లేకుండా జస్ట్ ఒక కథగా వింటే ఇందులో ఏముంది అనిపిస్తుంది. ముగ్గురు నిరుద్యోగులు సిటీకి వచ్చి కష్టాలు పడటం అనేది ఎప్పుడో దుబాయ్ శీను, వెంకీ లాంటి సినిమాల్లో ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇలాంటి పోలిక రాకూడదనే ఉద్దేశంతోనే అనుదీప్ చాలా హోమ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుంది. సరదాగా సీన్లు పరిగెత్తితే చాలు సినిమా చూసేవాళ్ళు పెద్దగా లాజిక్స్ గురించి పట్టించుకోరన్న అంచనాను గురి చూసి అందుకున్నాడు. ఎక్కడా విసుగు రాకుండా గ్రాఫ్ తగ్గిపోతున్న ప్రతిసారి మంచి కామెడీ సీన్ తో ఎక్కడిక్కడ నిలబెట్టుకుంటూ వచ్చాడు.
రెండున్నర గంటల నిడివి జాతిరత్నాలకు కొంత మైనస్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో ముగ్గురు హీరోలు జైలు నుంచి బెయిల్ మీద బయటికి వచ్చాక సాగే కొన్ని సన్నివేశాలు టెంపోని తగ్గించాయి. అది కొంత ఫీలయ్యే లోపల మళ్ళీ పరుగులు పెట్టించడంలో అనుదీప్ చాలా మటుకు సక్సెస్ అయ్యాడు. అయితే క్లైమాక్స్ లో పేలిపోయే డైలాగులు, నవీన్ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించినా ఫినిషింగ్ అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు.ఎక్కడా అశ్లీలత, అసభ్యతకు తావు లేకుండా కనీసం హీరో హీరోయిన్ మధ్య ఇంటిమసీ సీన్లు కూడా లేకుండా అనుదీప్ తీసుకున్న శ్రద్ధని మెచ్చుకోవలసిందే. అవి ఉంటేనే యువత కనెక్ట్ అవుతారనే భ్రమను బద్దలు కొట్టాడు
అలాని జాతిరత్నాలులో మైనస్సులు లేవని కాదు. లోపల బనియన్ లో ఎన్ని చిరుగులు ఉన్నా పైన ఖరీదైన డార్క్ కలర్ చొక్కా వేసినప్పుడు ఎలాగైతే రిచ్ నెస్ తో దర్జాతనం వస్తుందో ఈ సినిమాలో కూడా అదే జరిగింది. అయితే ముందే చెప్పినట్టు నిజ జీవితంలో ఇలా జరిగే అవకాశం ఉందా అనే ప్రశ్న జోలికి అనుదీప్ వెళ్ళలేదు. అదే అనుకుంటే అసలు చాలా సీరియస్ గా ఉండాల్సిన కోర్టు సన్నివేశాలు అంత కామెడీగా నవ్వించే అవకాశం ఉండదు. సో వాటిని పక్కనపెట్టి న్యూట్రల్ గా చూస్తే జాతిరత్నాలు ఒక క్లీన్ ఎంటర్ టైనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కాకపోతే ఫ్యామిలీ ఆడియన్స్ ఆశించే ఎమోషన్లు జీరో కావడంతో ఆ వర్గానికి ఇది ఎంత మేరకు నచ్చుతుందనే దాని మీద సక్సెస్ పర్సెంటేజ్ ఆధారపడి ఉంటుంది
రధన్ సంగీతం బాగుంది. పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఉన్న కాసిన్ని సందర్భాలకు మంచి ట్యూన్సే ఇచ్చాడు. ఎక్కువ సౌండ్ లేకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా సాగింది. సిద్ధం మనోహర్ ఛాయాగ్రహణం దర్శకుడి టేకింగ్ తో పోటీ పడింది. చక్కని క్వాలిటీని తెరమీద చూపించింది. అభినవ్ రెడ్డి ఎడిటింగ్ లో కొంత షార్ప్ నెస్ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్లు హటాత్తుగా జంప్ అయిపోయి ఇంకో సన్నివేశానికి వెళ్లిపోతాయి. సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ అయినట్టు అనిపిస్తాయి. స్వప్న బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగ్గట్టు రాజీ పడకుండా ఖర్చు పెట్టారు
ప్లస్ గా అనిపించేవి
నవీన్ పోలిశెట్టి పెర్ఫార్మన్స్
రాహుల్ రామకృష్ణ టైమింగ్
పాటలు ఇరికించకపోవడం
అనుదీప్ టేకింగ్
క్లీన్ కామెడీ
మైనస్ గా తోచేవి
కొంతమేర నిడివి
జీరో ఎమోషన్స్
స్టోరీ లైన్ పాతదే
కంక్లూజన్
జాతిరత్నాలు ఎలాంటి ఎంటర్ టైనరో ముందే చెప్పేశారు కాబట్టి అవే అంచనాలతో వెళ్తే మాత్రం హాయిగా నవ్వుకుంటూ బయటికి వస్తారు. ఇందులో లాజిక్స్ కి చోటు లేదు.వాటిని పట్టించుకోకుండా చూస్తే వినోదానికి లోటు లేకుండా సంతృప్తి పరుస్తుంది. స్టార్లు లేకుండా కేవలం ముగ్గురు యాక్టర్లను నమ్ముకుని అనుదీప్ చేసిన ఈ ప్రయత్నం నిస్సందేహంగా మెచ్చుకోదగినదే. సెకండ్ హాఫ్ లో జరిగిన హడావిడి మీద ఇంకాస్త హోమ్ వర్క్ చేసి ఉంటే దీని స్థాయి ఇంకా ఎత్తులో ఉండేది. ఫైనల్ గా శివరాత్రితో పాటు ఈ వీక్ ఎండ్ ని థియేటర్లో సరదాగా గడిపి రావాలంటే జాతిరత్నాలుని ఛాయస్ గా పెట్టుకోవచ్చు.
ఒక్కమాటలో – నవ్వించే రత్నాలు