పందెంకోడితో ఒకప్పుడు తెలుగులోనూ బలమైన మార్కెట్ ఏర్పరుచుకున్న విశాల్ కు గత కొత్త కాలంగా టైం కలిసి రావడం లేదు. చాలా ఫ్లాపులు వరసబెట్టి పలకరించాయి. అభిమన్యుడు మంచి విజయాన్ని అందించగా పందెం కోడి 2 కమర్షియల్ గా ఓకే అనిపించుకుంది. అందుకే చక్ర మీద బోలెడు నమ్మకంతో ఎన్ని ఓటిటి ఆఫర్లు వచ్చినా వేచి చూసి మరీ థియేటర్లో రిలీజ్ చేశారు. టీజర్లు ట్రైలర్లు దీన్నో సైబర్ క్రైమ్ థ్రిల్లర్ అనే విషయాన్ని స్పష్టం చేయడంతో అంచనాలు మెల్లగా పెరిగాయి. ఎంఎస్ ఆనందన్ దర్శకత్వం వహించిన చక్ర ఈ రోజు మరో మూడు సినిమాలతో పోటీ పడుతూ థియేటర్లలో అడుగు పెట్టింది. మరి చక్రం తిప్పిందో లేదో రివ్యూలో చూద్దాం
కథ
హైదరాబాద్ లో ఒకేరోజు యాభై ఇళ్లలో కలిపి 7 కోట్ల విలువైన దొంగతలను జరుగుతాయి. హంతకులెవరో అంతుచిక్కని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ గాయత్రి(శ్రద్ధ శ్రీనాధ్)కు ఎంత ప్రయత్నించినా ఆధారాలు దొరకవు. బాధితుల్లో ఓ పెద్దావిడ(కెఆర్ విజయ)ఆసుపత్రిలో చేరడంతో ఆమె మనవడు చంద్రు(విశాల్)మిలిటరీ నుంచి వచ్చి తనతో బ్రేకప్ చేసుకున్న గాయత్రితో కలిసి విచారణ మొదలెడతాడు. ఎన్నో రకాలుగా శోధించిన తర్వాత దీని వెనుక చెస్ కోచ్ లీల(రెజీనా కసెండ్రా) ఉందని తెలుస్తుంది. అసలైన సవాల్ అక్కడి నుంచి మొదలవుతుంది. లీలాను చంద్రు ఎలా పట్టుకున్నాడు అనేదే అసలు స్టోరీ
నటీనటులు
హీరోగా 17 ఏళ్ళ అనుభవమున్న విశాల్ నటన గురించి కొత్తగా చెప్పేదేమి లేదు. ఎప్పటిలాగే తనదైన టైమింగ్ తో చంద్రు పాత్రలో ఒదిగిపోయాడు. అభిమన్యుడు ఛాయలు ఎక్కువగా ఉండటంతో ఇది దానికి కొనసాగింపులా కనిపిస్తుందే తప్ప యాక్టింగ్ పరంగా వాడు వీడు తరహాలో ఛాలెంజ్ చేసే క్యారెక్టర్ అయితే కాదు. తన శారీరక భాషకు తగ్గట్టు కథలను ఎంచుకునే విశాల్ చక్ర విషయంలో ఎక్కువ అలోచించినట్టు లేడు. అయితే తన పరిధి కేవలం నటించడం వరకే కాబట్టి ఆ కోణంలో చూసుకుంటే పెద్దగా మైనస్సులైతే ఏమి లేవు. స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కూడా విశాల్ పెర్ఫార్మన్స్ కు సహజత్వం తెచ్చిపెడుతోంది.
చాలా సెలెక్టివ్ గా విలక్షణమైన సినిమాల్లో మాత్రమే కనిపించే హీరోయిన్ శ్రద్ధ శ్రీనాధ్ కు ఒకరకమైన అయోమయం పోలీస్ పాత్ర దక్కింది. బాగానే చేసినప్పటికీ క్యారెక్టర్ ని దర్శకుడు సరిగా డిజైన్ చేయకపోవడంతో ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. తన కంటే ఎక్కువగా రెజీనా హై లైట్ అయ్యింది. పెర్ఫార్మన్స్ పరంగా బెస్ట్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికే సవాల్ విసిరేంత పవర్ ఫుల్ బిల్డప్ తనకు అంతగా సెట్ కాలేదు. అయినా కూడా తన టైమింగ్ తో రెజీనా చాలామటుకు లీలను కాపాడింది. కేఆర్ విజయ్ నామమాత్రంగా ఉన్నారు. లీల తమ్ముళ్లుగా నటించిన ఆర్టిస్టులను సహజంగా సెట్ చేసుకున్నారు. మిగిలినవాళ్ళు జస్ట్ సపోర్టింగ్ కి పనికొచ్చారు. అంతగా గుర్తుంచుకోదగిన వాళ్ళు లేరు
డైరెక్టర్ అండ్ టీమ్
దర్శకుడు ఎంఎస్ ఆనందన్ ఎంత కాదని చెప్పుకున్నా చక్ర కథ పూర్తిగా అభిమన్యుడుని స్ఫూర్తిగా తీసుకున్న వాస్తవం ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. ఆఖరికి విలన్ సెట్ చేసుకున్న సైబర్ డెన్ తో సహా అచ్చు గుద్దినట్టు దాన్నే వాడుకోవడం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. మన జీవితంలో నిత్యభాగమైపోయిన డిజిటల్ వరల్డ్ లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఎంతగా మన డేటాని కార్పొరేట్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయో చెప్పే ప్రయత్నం మంచిదే. కానీ దానికి కేవలం హీరో విలన్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఒకటే సెట్ చేస్తే సరిపోదు. ప్రేక్షకులు థ్రిల్ అయ్యేలా కొత్త విషయాలు చూపించాలి. అప్పుడే డ్రామా పండుతుంది.
కానీ చక్రలో ఇవి కొంతమేరకు మాత్రమే ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపుఎంత వద్దనుకున్నా అభిమన్యుడు గుర్తుకు వస్తూనే ఉంటుంది. అందులో అర్జున్ పాత్ర గొప్ప స్థాయిలో ఎలివేట్ అయ్యింది కాబట్టి అతను చేసే మోసాలకు మనం కనెక్ట్ అయ్యాం. కానీ చక్రలో లీలా బ్యాక్ డ్రాప్ ని అంత పవర్ ఫుల్ గా సెట్ చేయకపోవడంతో ఇదో సాధారణ సినిమాగా అనిపిస్తుంది. ఎంత మిలిటరీ నుంచి వచ్చినా కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ మొత్తం హీరో కనుసన్నల్లో పరిగెత్తుతుందనేలా, వాళ్లకు ఇంకే ఆలోచనా రాదనేలా చూపించడం లాజిక్ కు దూరంగా లాక్కెళ్ళింది. కమర్షియల్ ఫ్లేవర్ కోసం జొప్పించిన ఫైట్లు కూడా రొటీన్ గానే ఉన్నాయి.
ఇలాంటి కథలు జనాన్ని ఆలోచింపజేయాలి. మనం ఇన్ని రకాలుగా మోసపోతున్నామా అనే షాక్ అయ్యేలా చూపించాలి. కానీ చక్రలో ఒకదశ దాటాక ఎంతసేపూ విశాల్ రెజీనాల మధ్య ఛాలెంజ్ డ్రామా తప్ప ఇంకే ఎగ్జైటింగ్ సన్నివేశాలు అంతగా ఉండవు. మలుపులు వస్తుంటాయి పోతుంటాయి కానీ మరీ ఎక్కువ షాక్ కు గురయ్యేవి తక్కువే. విశాల్ మీద ఎంత లేదన్నా అభిమన్యుడు సక్సెస్ తాలూకు ప్రభావం చాలా ఉంది. అందుకే ఆనందన్ చెప్పిన కథను అదే టెంప్లెట్ లో చూపించమని ఒత్తిడి చేసినట్టు ఉన్నాడు. దానికి తగ్గట్టే ఎక్కువ హోమ్ వర్క్, రీసెర్చ్ చేయకుండా కొన్ని నాటకీయ మలుపులతో నడిపించే ప్రయత్నం యావరేజ్ ఫలితాన్నే ఇచ్చింది.
యువన్ శంకర్ రాజా సంగీతం బీజీఎమ్ పరంగా బాగుంది. ఉన్న ఒక్క పాట విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కు వాడుకోవడం అవసరం లేదు. కానీ లెన్త్ కోసం పెట్టారు. తీసేసినా నష్టం లేదు. బాలసుబ్రమణియం ఛాయాగ్రహణం బాగుంది. మంచి రిచ్ నెస్ తీసుకొచ్చారు. తియాగు ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే కథనం పరుగులు పెట్టేది. కొన్ని రిపీటెడ్ సీన్స్ అలాగే ఉంచేయడం అక్కడక్కడా బోర్ కొట్టించింది. అరసు పోరాటాలు బాగున్నాయి. విశాల్ స్వంత బ్యానర్ కాబట్టి ఖర్చు విషయంలో రాజీ పడలేదు. సబ్జెక్టు తగట్టు ఖర్చు పెట్టారు. సింగిల్ సిటీ లొకేషనే కాబట్టి బడ్జెట్ ఎక్కువ డిమాండ్ చేయలేదు
ప్లస్ గా అనిపించేవి
విశాల్
నేపధ్య సంగీతం
రెజీనా నటన
కొన్ని ట్విస్టులు
మైనస్ గా తోచేవి
ఎమోషన్ లేకపోవడం
ఉన్న ఒక్క పాట
అభిమన్యుడు రేంజ్ డెప్త్ మిస్ కావడం
సినిమాటిక్ లిబర్టీ
కంక్లూజన్
సైబర్ క్రైమ్ ని నేపథ్యంగా తీసుకున్న సినిమాల్లో విస్తుగొలిపే వాస్తవాలతో పాటు వాటి వల్ల బాధితులుగా ఉన్న వాళ్ళ ఎమోషన్లు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అభిమన్యుడులో ఈ రెండు బ్యాలన్స్ అయ్యాయి కాబట్టే అది సక్సెస్ అయ్యింది. కానీ చక్రలో ఇవి సమపాళ్ళలో కుదరలేదు. డేటా దొంగతనం అనే మంచి పాయింట్ ని తీసుకున్న దర్శకుడు దాని మీద లోతుగా వెళ్లకుండా పైపై పూతలతో హీరో విలన్ మధ్య దాగుడుమూతల ఆటగా మార్చేయడంతో ఎక్కువ అంచనాలు పెట్టుకున్నవాళ్ళకు అసంతృప్తి కలిగిస్తుంది. ఓ మోస్తరు డ్రామా ఉన్నా పర్లేదు సైబర్ క్రైమ్స్ ని ఇష్టపడతాం అనుకునేవాళ్లకు తప్ప అందరికీ చక్ర నచ్చడం డౌటే
ఒక్క మాటలో – స్పీడు సరిపోని చక్రం