Tirupathi Rao
Kalki 2898 AD- Ashwathama Character: నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఈ కథలో అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ పాత్రను రివీల్ చేశారు. అయితే ఆ వీడియోలో అశ్వత్థాముడికి రక్తం కారడం వెనకాల పెద్ద కథే ఉంది.
Kalki 2898 AD- Ashwathama Character: నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. ఈ కథలో అమితాబ్ బచ్చన్ చేసిన అశ్వత్థామ పాత్రను రివీల్ చేశారు. అయితే ఆ వీడియోలో అశ్వత్థాముడికి రక్తం కారడం వెనకాల పెద్ద కథే ఉంది.
Tirupathi Rao
ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల రీత్యా వాయిదా పడింది. అయితే ఏప్రిల్ 21న బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన పాత్రను వివరిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. అందులో అమితాబ్ చేయబోయేది మహాభారత కాలానికి చెందిన ధ్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థాముడి పాత్ర అనే విషయాన్ని వెల్లడించారు. అయితే ఆ వీడియోలో కొన్ని విషయాలు గమనించారా? అశ్వత్థాముడి నుదుటిన ఒక గాయం ఉంది. అలాగే శరీరం నుంచి రక్తం కారుతోంది. మరి.. అలా ఎందుకు జరుగుతోందో మీకు తెలుసా. దాని వెనుక చాలా పెద్ద కథ ఉంది.
పురాణాల ప్రకారం మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉంటారు. అంటే వారికి ఎప్పటికీ చావు ఉండదు. ఆ ఏడుగురిలో ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థాముడు కూడా ఒకడు. అయితే చిరంజీవిగా మెలగడం అందరికీ వరం అయితే.. అశ్వత్థాముడికి మాత్రం శాపం. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు ఎదురు లేకుండా పోరాడుతూ ఉంటాడు. అతడిని అశ్త్ర సన్యాసం చేయించి హతమార్చాలి అనేది పాండవుల వ్యూహం. ఎవరు చెప్పినా నమ్మరని ధర్మరాజుతో.. ‘అశ్వత్థామ హతహః.. కుంజరహ అనిపిస్తారు’. అప్పుడు ద్రోణుడు అస్త్రసన్యాసం చేస్తాడు. అలా ద్రోణాచార్యుడిని హతమారుస్తారు. తండ్రి మరణ వార్త తెలుసుకున్న అశ్వత్థాముడు కోపోద్రిక్తుడు అవుతాడు.
పాండవుల సైన్యంలో దొరికిన వారిని దొరికినట్లు హతమారుస్తూ ఉంటాడు. అర్జునుడు, కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థామే. అయితే రాత్రిపూట పాండవుల నిద్రిస్తున్న స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అశ్వత్థాముడు దాడి చేస్తాడు. ఆ దాడిని ముందే పసిగట్టిన కృష్ణుడు పాండవులను తప్పిస్తాడు. కానీ, ఆ దాడిలో పాండవ పుత్రులు మరణిస్తారు. అశ్వత్థాముడిని వెంబడించిన అర్జునుడు నిలువరించే ప్రయత్నం చేస్తాడు. ఎదురుతిరిగిన అశ్వత్థాముడు బ్రహ్మాశ్త్రాన్ని ప్రయోగిస్తాడు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ రెండు అస్త్రాలు ఢీ కొంటే దాదాపుగా ప్రపంచం అంతమమైపోతుందని భావించిన రుషులు అస్త్రాలను వెనక్కి తీసుకోవాలని కోరతారు.
అర్జునుడు పాశుపతాస్త్రాన్ని వెనక్కి తీసుకోగా.. అశ్వత్థాముడు ప్రయోగించిన బ్రహ్మాశాస్త్రం మాత్రం ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. దానిని వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. ఆ అస్త్రాన్ని అర్జునుడి కోడలు ఉత్తర గర్భంలో పెరుగుతున్న పరీక్షితుడికి ఎక్కు పెడతాడు. తీవ్రంగా గాయపడిన పరీక్షితుడిని రక్షించిన శ్రీకృష్ణుడు.. అశ్వత్థాముడికి శాపం పెడతాడు. 3 వేల సంవత్సరాలు చావు లేకుండా, శరీరం మొత్తం గాయాలు, రక్తం కారుతూ, నిద్రాహారాలు లేకుండా ఒంటరిగా జీవించాలని శపిస్తాడు. అలాగే అశ్వత్థాముడి నుదుటిన ఉండే మణిని లాక్కుంటాడు. ఆ మణి ఉంటే అశ్వత్థాముడిని ఎవరూ ఏమీ చేయలేరు. అలాగే అన్నపానీయాల అవసరం కూడా లేదు.
అలా కృష్ణుడి శాపంతో అశ్వత్థాముడు శరీరం మొత్తం గాయాలు, రక్తం కారుతూ ఉంటాడు. కల్కిలో ఆ అశ్వత్థాముడి పాత్రనే చూపించారు. అంతిమ యుద్ధం కోసం నేను వేచి ఉన్నాను. ఆ సమయం వచ్చింది అంటూ అశ్వత్థాముడు చెప్పిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అలాగే అశ్వత్థాముడి యంగ్ లుక్ ని కూడా రివీల్ చేశారు. నుదిటిన ప్రకాశవంతమైన మణితో యుద్ధభూమిలో ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని పురాణ, ఇతిహాసాల నేపథ్యంలో తీస్తున్న విషయాన్ని ఇప్పటికే నాగ్ అశ్విన్ ప్రకటించాడు. ఇప్పుడు ఒక్కో క్యారెక్టర్ రివీల్ చేస్తూ కథను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అశ్వత్థాముడి పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.