iDreamPost

పల్లెకు పొగపెడుతున్న జేసీ.. ఈ సారి సక్సెస్‌ అవుతారా..?

పల్లెకు పొగపెడుతున్న జేసీ.. ఈ సారి సక్సెస్‌ అవుతారా..?

శాసనసభ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. ఆయా పార్టీలలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ సీటు కాపాడుకోవడం కోసం కొందరు, కొత్తగా పోటీ చేసేందుకు మరికొందరు, తన వర్గం వారికి టిక్కెట్‌ ఇప్పించుకోవాలనే ప్రయత్నాల్లో సీనియర్‌ నేతలు తమ తమ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తాజాగా మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి చేసిన చర్యల ద్వారా స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లాలో టీడీపీలో తనకంటూ ప్రత్యేకమైన, బలమైన వర్గం తయారు చేసుకోవాలనే లక్ష్యంతో ఉన్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఇంఛార్జిలతో సంబంధం లేకుండా పర్యటిస్తున్నారు.

తాజాగా పుట్టపర్తి నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశమైన జేసీ సైకం శ్రీనివాసరెడ్డిని వారికి పరిచయం చేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో మచ్చలేని శ్రీనివాసరెడ్డికి పుట్టపర్తి టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పల్లె రఘునాథరెడ్డికి టిక్కెట్‌ ఇస్తే టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని హెచ్చరించారు. పల్లెకు తప్పా ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా పుట్టపర్తిలో టీడీపీ గెలుస్తుందంటూ చెప్పిన జేసీ.. పల్లెకు మళ్లీ పొగపెట్టడం ప్రారంభించారు.

పల్లె రఘునాథరెడ్డి గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి 1999లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 వరకు ఐదు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు. 1999, 2009, 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఇప్పుడు పల్లె రఘునాథరెడ్డికి పొగ పెట్టేందుకు జేసీ యత్నించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పల్లె స్థానాన్ని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి అయిన సైకం శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలంటూ ఆయన బహిరంగంగా డిమాండ్‌ చేస్తుండడం విశేషం.

పల్లెతో వైరం ఎందుకు..?

పల్లె రఘునాథరెడ్డి సీనియర్‌ కావడం, 1999లోనే మంత్రి కావడంతో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆయనకే మంత్రి పదవి వస్తోంది. రఘునాథరెడ్డి లేకపోతే 2014లో తనకు మంత్రి పదవి వచ్చేదని జేసీ ప్రభాకర్‌ రెడ్డి భావించారు. అప్పటి నుంచి పల్లెపై జేసీ వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో పుట్టపర్తి టీడీపీ స్థానాన్ని జేసీ దివాకర్‌ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు పీఎస్‌గా పని చేసిన మేడసాని సురేష్‌ రెడ్డికి ఇప్పించాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో పుట్టపర్తి ఏర్పడినప్పుడు కాంగ్రెస్‌ టిక్కెట్‌ను మేడసాని సురేష్‌రెడ్డికి ఇప్పించాలని కూడా జేసీ ప్రయత్నించారు.

ఎవరీ సైకం శ్రీనివాసరెడ్డి..?

పల్లె రఘునాథరెడ్డిని తప్పిస్తే.. మంత్రి పదవికి ఇక తనకు అడ్డులేనదే భావనతో ఉన్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. తన ప్రయత్నాలను మళ్లీ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అనామకుడు, పుట్టపర్తి నియోజకవర్గానికి ఏ మాత్రం పరిచయంలేని సైకం శ్రీనివాసరెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. సైకం శ్రీనివాసరెడ్డి సొంత ఊరు రాయచోటి నియోజకవర్గంలో ఉండగా.. పుట్టపర్తికి చెందిన చెన్నారెడ్డి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వాస్తవంగా చెన్నారెడ్డి కదిరి టౌన్‌లో నివాసం ఉంటున్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చెన్నారెడ్డి కుటుంబం గురించి ఎవరికీ తెలియదు. పూర్తిగా స్థానికేతరుడు.

తెరపైకి సైకం చరిత్ర..

సైకం శ్రీనివాసరెడ్డి మచ్చలేని నాయకుడు అంటూ జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్రశంసలు కురిపిస్తుండగా.. శ్రీనివాసరెడ్డి అసలు రూపం ఇది అంటూ.. ఆయన పూర్వ స్నేహితులు, అతనితో కలసి వ్యాపారం చేసి మోసపోయిన వారు చెబుతున్నారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి అలా శ్రీనివాసరెడ్డిని మచ్చలేని నాయకుడు అని అన్నారో లేదో.. ఇలా శ్రీనివాసరెడ్డి బాల్యస్నేహితుడు, పూర్వ వ్యాపార భాగస్వామి అయిన ఎస్‌.ప్రేమనాథ్‌రెడ్డి పుట్టపర్తి ప్రజలను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో శ్రీనివాస్‌ రెడ్డి గత చరిత్ర గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రాజకీయాల్లోకి వస్తున్నాడని తెలిసి.. తాను ఈ విషయాలను వెల్లడిస్తున్నాని చెప్పారు. ఆ ప్రయత్నాలు మానుకోకపోతే ఆధారాలతో సహా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని ప్రేమనాథ్‌ రెడ్డి ఆ బహిరంగ లేఖలో హెచ్చరించారు.

పల్లెకు పొగ పెట్టి తన మనిషి అయిన సైకం శ్రీనివాసరెడ్డిని పుట్టిపర్తి బరిలో దించాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డి ప్లాన్‌ చేయగా.. ఆ ప్రయత్నాలకు శ్రీనివాసరెడ్డికి ఒకప్పటి స్నేహితుడు, వ్యాపార భాగస్వామి అయిన ప్రేమనాథ్‌ రెడ్డి రూపంలో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మరి ఈ అడ్డంకులను అధిగమించి పల్లె స్థానం సైకంకు వచ్చేలా ఈసారైనా జేసీ చక్రం తిప్పుతారా..? లేదా పల్లె రఘునాథరెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంటారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి