iDreamPost

ప్రేమకు అర్థం చెప్పిన త్యాగమూర్తి – Nostalgia

ప్రేమకు అర్థం చెప్పిన త్యాగమూర్తి – Nostalgia

ఏ హీరోకైనా ఒక బ్రేకింగ్ పాయింట్ ఒకటొస్తుంది. చిరంజీవికి ఖైదీ, నాగార్జునకు శివ ఇలా ఒక ట్రెండ్ సెట్టర్ అందుకున్నాక తర్వాత చేసుకునే కెరీర్ ప్లానింగ్ కత్తి మీద సాములా మారుతుంది. ఏ మాత్రం పొరపాటు చేసినా మాములు దెబ్బలు తగలవు. 1996లో పెళ్లి సందడి రూపంలో ఇండస్ట్రీ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన శ్రీకాంత్ కు ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. వచ్చిన ప్రతి సినిమాను ఒప్పుకుని గ్యాప్ లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా సినిమాలు చేస్తూ పోవడం తీవ్ర ప్రభావం చూపించింది. ఆ తర్వాత చేసినవాటిలో వన్స్ మోర్, వినోదం, ఎగిరే పావురమా, తాజ్ మహల్, ఆహ్వానం, మా నాన్నకు పెళ్లి మాత్రమే విజయం సాధించాయి.

1999లో సుప్రసిద్ధ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు ప్రేయసి రావే కథను పంపించినప్పుడు శ్రీకాంత్ పది ఫ్లాపుల్లో ఉన్నాడు. సుప్రభాతం, గమ్యం, శుభలేఖలు, ఆయనగారు, మాణిక్యం, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు, మనసులో మాట, అనగనగా ఒక అమ్మాయి, పిల్ల నచ్చింది, పంచదార చిలక ఇలా ఏ ఒక్కటి కనీసం యావరేజ్ కూడా అనిపించుకోలేదు. సహజంగానే బయ్యర్లకు శ్రీకాంత్ అనే బ్రాండ్ మీద మెల్లగా అపనమ్మకం మొదలైన సమయమది. చంద్రమహేశ్ అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీ కొంత రిస్క్ గా అనిపించినా నాయుడు గారి జడ్జ్ మెంట్ మీద నమ్మకంతో శ్రీకాంత్ ఏం ఆలోచించలేదు.

ప్రాణంగా ప్రేమించిన మహాలక్ష్మి(రాశి) మరొకరిని(పృథ్వి రాజ్) పెళ్లి చేసుకుంటే తట్టుకోలేకపోయిన వంశీ(శ్రీకాంత్) ముందు తప్పుడు ఆలోచనలు చేసి ఆ తర్వాత మార్పు తెచ్చుకుని ప్రేయసి సుఖాన్ని కోరుకోవడం కంటే కావలసింది ఏముందని గుర్తిస్తాడు. యాక్సిడెంట్ లో ఆమె భర్తకు ప్రాణ గండం ఏర్పడితే తన గుండెను ఇచ్చేందుకు ఆత్మహత్య చేసుకుంటాడు.  ఎవరూ ఊహించని రీతిలో హీరో పాత్ర చిత్రణ ఉండటంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. అతని త్యాగాన్ని మనసారా ఆశీర్వదించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం, పోసాని సంభాషణలు ప్రేయసి రావే విజయంలో కీలక పాత్ర పోషించాయి. 1999 నవంబర్ 19న సుమన్ రామసక్కనోడుతో పాటుగా విడుదలైన ఈ సినిమా సుమారు పాతిక సెంటర్లలో వంద రోజులు ఆడి శ్రీకాంత్ కు కొత్త లైఫ్ ఇచ్చింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి