iDreamPost

పోకిరి జల్సా తర్వాత 4K బిల్లా

పోకిరి జల్సా తర్వాత 4K బిల్లా

ఊహించిన దానికన్నా పెద్ద స్థాయిలో టాలీవుడ్ రీ రిలీజుల ట్రెండ్ నడుస్తోంది. ఒక్కడు వేస్తే మంచి స్పందన వచ్చింది. పోకిరికి ఏకంగా హౌస్ ఫుల్ బోర్డులతో కోటి డెబ్భై లక్షల దాకా గ్రాస్ ఇచ్చింది. ఈ వారం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వేస్తున్న జల్సాకు అభిమానుల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది. తమ్ముడుకి ఒక్క హైదరాబాద్ లోనే వందకు పైగా షోలు పడటం చిన్న విషయం కాదు. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే రికార్డులు నమోదవుతున్నాయి. కొత్త సినిమాల టికెట్ రేట్లతో సమానంగా వీటికి ధరలు నిర్ణయిస్తున్నప్పటికీ ఫ్యాన్స్ లెక్క చేయడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో వసూళ్లను చూస్తే నోరెళ్లెబెట్టడం ఖాయం. అంత రచ్చ జరుగుతోంది.

ఇప్పుడీ వరసలో ప్రభాస్ బ్యాచ్ వస్తోంది. అక్టోబర్ 23న డార్లింగ్ బర్త్ ని పురస్కరించుకుని బిల్లాని 4కెలోకి మార్చి థియేటర్లలో స్క్రీన్ చేయబోతున్నారు. మెహెర్ రమేష్ డైరెక్షన్ లో రూపొందిన ఈ రీమేక్ అప్పట్లో బాగానే ఆడింది. మరీ ఛత్రపతి, వర్షం రేంజ్ కాదు కానీ ఇందులో ప్రభాస్ లుక్స్ కి మంచి పేరొచ్చింది. తమిళంలో చేసిన అజిత్ స్టయిలింగ్ కి ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రెజెంట్ చేసిన తీరు అప్పుడేమో కానీ ఇప్పుడు ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ థ్రిల్ ఓ రేంజ్ లో ఉంటుంది. పైగా అనుష్క హీరోయిన్. మణిశర్మ సంగీతం, రెబెల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర. సెలెబ్రేట్ చేసుకోవటానికి ఇంతకన్నా కారణాలు ఏం కావాలి.

మొత్తానికి టాలీవుడ్ లో ఒక కొత్త పోకడ మొదలయ్యింది. కొత్త సినిమాలకే సరైన కలెక్షన్లు లేక నిర్మాతలు లబోదిబోమంటుంటే ఇలా పాత చిత్రాలకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడం విశేషం. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం అన్న ఎన్టీఆర్ దానవీరశూరకర్ణని కొత్త ప్రింట్లతో రిలీజ్ చేస్తే కోటి రూపాయలు రాబట్టి బయ్యర్ల మతులు పోగొట్టింది. అయితే అప్పుడు ఇంటర్నెట్, పైరసీ సైట్లు, వీడియో ఆప్షన్లు, యుట్యూబ్ లు లేవు. కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఓల్డ్ బ్లాక్ బస్టర్స్ కి దక్కుతున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇదిలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఒరిజినల్ నెగటివ్స్ ని పట్టుకుని వాటిని రీ మాస్టర్ చేసి సౌండ్ గట్రా చేసుకోవడం మాత్రం పెద్ద పనే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి