iDreamPost

పౌరసత్వ సవరణ చట్టం ( CAA ) రాజేసిన మంటల్లో ఆట్టుడుకుతున్న దేశం

పౌరసత్వ సవరణ చట్టం ( CAA ) రాజేసిన మంటల్లో ఆట్టుడుకుతున్న దేశం

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు ఊపందుకున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాలలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విపక్షాలతోపాటు యువత పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి తమ నిరసన గళం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఆందోళనల ఉధృతి రోజు రోజుకి ఇతర నగరాలు పట్టణాలకి కూడా వ్యాపిస్తుంది. ఆందోళన చేస్తున్న నిరసనకారులని అదుపు చేసేందుకు ముందు జాగ్రత్తగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో 144 సెక్షన్ ని విధించడంతో పాటు భారీ ఎత్తున పోలీసు బలగాలని మోహరించినప్పటికీ పూర్తి స్థాయిలో నిరసనకారులను అదుపు చేయలేకపోతున్నారు.పలువురు ప్రముఖులు సెలబ్రిటీలు రోడ్లమీదకు వచ్చి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

మిగతా రాష్ట్రాలకన్నా దేశ రాజధాని ఢిల్లీకి ఈ ఉద్యమ సెగ బాగా తగిలింది. ఉదయం ఎర్రకోట వద్దకి పెద్ద ఎత్తున నిరసనకారులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా ఢిల్లీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. ఢిల్లీ NCR రీజియన్ లో ముఖ్యంగా నోయిడా, గుర్గావ్ లో అన్ని ప్రయివేట్ కార్యాలయాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుడి బయటకి రావద్దని హెచ్చరించాయి. నిరసనలు ధాటికి ఉదయం 9 గంటల నుండి కిలోమీటర్ల మేరా రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. నగరంలో 18 ప్రధాన మెట్రో స్టేషన్లని మూసివేశారంటే ఢిల్లీలో పరిస్థితి ఎలావుందో అర్ధం చేసుకోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మీడియా ముందుకి వచ్చి ఢిల్లీ పౌరులు సంయమనం పాటించాల్సిందిగా కోరాడు. చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న డి. రాజా, యోగేంద్ర యాదవ్ తో పాటు పలువురు నిరసన కారులని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించారు.

మరో వైపు దక్షిణాదిన కేరళ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లలో కూడా శాంతియుతంగా నిరసనకారులు తమ నిరసనలు తెలియచేస్తున్నారు.బెంగుళూరు టౌన్ హాల్ దగ్గర ప్రముఖ చరిత్రకారుడు, గాంధేయవాది రామచంద్ర గుహ ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. హైద్రాబాద్ చార్మినార్ మరియు సెంట్రల్ యూనివర్సిటీలో నిరసన తెలుపుతున్న పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు.

పాట్నా, లక్నోలతో పాటు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్రాల్లో కూడా పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఉత్తరప్రదేశ్ లోని సంబల్ పూర్ లో ఆందోళన కారులు పలు బస్సులకు నిప్పు పెట్టారు. అహ్మాదాబాద్, జమ్మూ కాశ్మీర్ లో కూడా పలు చెదురుమదురు సంఘటనలు జరిగాయి. పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ స్వయంగా మీడియా ముందుకొచ్చి పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకి తన మద్దతు తెలియజేయడమే కాక శాంతియుతంగా తమ నిరసన తెలపాలని కోరారు.

కాగా ముందుగా అనుకున్నట్టు ఈరోజు ఢిల్లీలో జరగాల్సిన బిజెపి హైలెవల్ కమిటీ మీటింగ్ వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోమ్ మంత్రి కాసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కొత్త చట్టం గురించి ప్రజల్లో అనుమానాలు నివృత్తి చేయడానికి మీడియాలో ప్రకటనలు, వివిధ కార్యక్రమాలు రూపంలో ఎంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆ విషయంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేకపోతుంది.

కొద్ధిసేపటి క్రితమే ఢిల్లీ హైకోర్ట్ జామియా యూనివర్సిటీలో విద్యార్ధులపై దాడి చేసిన కేసులో ఢిల్లీ పోలీసులకి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి