iDreamPost

దున్నపోతు.. దూడ సామెతలా ఉంది!

దున్నపోతు.. దూడ సామెతలా ఉంది!

దున్నపోతు ఈనింది అంటే.. దూడని కట్టేసావా అన్నాడంట వెనకటికొక ఆసామి. అసలు దున్నపోతు ఎలా ఈనుతుందన్న సందేహమే కలగలేదా ఆసామికి. సగటు భారతీయ వినియోగదారుడి మానసిక పరిస్థితి కూడా ఆ ఆసామి మాదిరిగానే ఉంటుందని భావిస్తుంటాయి పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు. మన జీవితాలను కార్పొరేట్‌ కంపెనీలు సృష్టించిన ‘మార్కెట్‌’ శాసిస్తుందని మొన్నామధ్య వచ్చిన రామ్‌చరణ్‌ ధృవ సినిమాలో సామాన్యుడికి కూడా అర్ధమయ్యేటట్లే చెప్పారు. మనం ఏం తినాలి, ఏం తాగాలి, ఏ వస్తువులు వినియోగించాలి, ఏ టీవీ చూడాలి… తదితర విషయాలన్నింటినీ మార్కెట్‌ ద్వారా సంబంధిత కార్పొరేట్‌ కంపెనీలే నిర్దేశిస్తుంటాయన్నది ఒక వర్గం మేథావుల అభిప్రాయం. అదే విషయాన్ని ఈ సినిమాలో చర్చించారు. ఏది ఏమైనా లోతుగా ఆలోచిస్తే ఇది కూడా నిజమేనని అనిపించకమానదు.

ఉన్నట్టుండి ఓ రోజు కరోనాకు మందొచ్చేసింది అంటూ మీడియా నానా హడావిడీ చేసిపడేసింది. టాబ్లెట్‌ ఖరీదు రూ. 100 రూపాయలని, ఇన్ని టాబ్లెట్లు వాడాల్సి ఉంటుందని కూడా డోస్‌లు నిర్ణయించేసింది. అయితే ఇక్కడ రావాల్సి డౌట్‌ ఒకటి మనకి రాకుండా సంబంధిత మీడియా కప్పేసిందనే చెప్పాలి. కరోనాకి ఇప్పుడే మందు వస్తే ఇప్పటి వరకు జరిగిన ట్రీట్‌మెంట్‌ సంగతేంటంట? అన్నదే ఈ ప్రశ్న. అంటే ఇప్పటి వరకు ఎటువంటి ట్రీట్‌మెంట్‌ లేదని, మందు బిళ్ళ కనిపెట్టారు కాబట్టి ఇక్కడి నుంచే ట్రీట్‌మెంట్‌మొదలవుతుందనుకోవాలా?. సదరు న్యూస్‌ వ్యాప్తితో బాటే చివరాఖర్న ఓ మహత్తరమైన విషయం కూడా చెప్పుకొచ్చారు. కానీ ఆ విషయాన్ని మాత్రం ప్రజలకు పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాల్లేవనే చెప్పాలి. బాగా సీరియస్‌ స్థితిలో ఉన్న రోగులకు ఇది పెద్దగా ఉపయోగపడదనేది దాని సారాంశం. అంటే వ్యాధి ప్రారంభ దశలోనే ఇప్పుడు వచ్చిన మందు పనిచేస్తుందన్నమాట. ఆ లెక్కడ భారత దేశంలో వైరస్‌ భారిన పడుతున్న వారిలో ఎంత మందికి సీరియస్‌ అవుతుంది? అలా సీరియన్‌ అయిన వాళ్ళలో ఈ మందు కాపాడేదెందరిని? ఇప్పటి వరకు అటువంటి సీరియన్‌ స్థితిలో ఉన్నవాళ్ళను ఇక్కడి వైద్యులు ఎలా కాపాడుతున్నారు? ఇటువంటి ప్రశ్నలకు ముక్కుసూటి సమాధానాలైతే లేవనే చెప్పాలి.

ఇదే కోవలో పతంజలి సంస్థ కోవిడ్‌ నివారణమందును మార్కెట్‌లోకి తెస్తున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించింది. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఆయుష్‌ శాఖ ఖండించింది. ఈ మందును గురించి ప్రకటనలు మాత్రం ఇవ్వొద్దని చెప్పింది. అంతేగానీ మార్కెట్‌లోకి రాకుండా మాత్రం ఆపుతామని ఎక్కడా ప్రకటించిన దాఖలాల్లేవు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కరోనా అలియాస్‌ కోవిడ్‌ 19 కారణంగా ప్రపంచం మొత్తం వైద్యపరంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. నివారణ కోసం అందుబాటులో ఉన్న ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేదు. అదే సమయంలో ఇప్పుడు వచ్చిన మందులే సంజీవనులు అని చెబుతున్న దాఖలాలు కూడా ఎక్కడా లేవు. అందుబాటులో ఉన్నవాటిల్లో మెరుగైనవి అని మాత్రమే చెబుతున్నారు. జనం ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లాక్డౌన్‌ ఎత్తేస్తే కరోనా రాదనుకోవడం ఎంత అమాయకత్వమో, మందులు వచ్చేసాయని విచ్చలవిడి తనంతో నిర్లక్ష్యంగా తిరగడం కూడా అంతే ప్రమాదకరం. ముందు చెప్పినట్లు సగటు భారతీయుడి జీవితాన్ని మార్కెట్‌ మాత్రమే నియంత్రిస్తుందన్నది ఒప్పుకోకపోయినా నిజం. ఈ నేపథ్యంలో మార్కెట్‌మాయలో పడిపోకుండా నిజానిజాలను ఒకటిరెండుసార్లు పరిశీలించుకుని నిర్దారణకు రావడం ఎంతో ముఖ్యం. ఇందుకు ప్రభుత్వాలు కూడా నేరుగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితులోల ఎంతైనా ఉందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి