iDreamPost

ప్రజల నమ్మకాన్నిపొందాలి పవన్

ప్రజల నమ్మకాన్నిపొందాలి పవన్

జనసేన పార్టీకి మాజీ సిబిఐ జేడీ లక్ష్మి నారాయణ రాజీనామా పెద్ద ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. రాజీనామాకు ఆయన చెప్పిన కారణం కూడా పెద్ద సహేతుకమైనది కాకపోవచ్చు. బహుశా బయటకు చెప్పలేని/చెప్పకూడని వేరే ఏవైనా బలమైన కారణాలు కూడా ఉండి ఉండవచ్చు. బయటకు తెలియని కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఎన్నికలు ముగిశాక ఆయన పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో కానీ, పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో కానీ పెద్దగా కనబడలేదు, వినబడలేదు లేదా ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదేమో మరి. ఒక్క నాదెండ్ల మనోహర్ గారు తప్పించి వేరెవరికీ, కనీసం పార్టీ తరఫున గెలిచినా ఏకైక ఎమ్మెల్యే అయినా రాపాక గారికి కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరగడం లేదు. రాపాక గారు పలుమార్లు అదే విషయాన్ని చెప్పారు కూడా. పార్టీ సిద్ధాంత రూపకర్త, ఇజం పుస్తకం సహా రచయిత అయినా రాజు రవితేజ కూడా దాదాపు ఇలాంటి కారణాలనే ప్రస్తావించాడు – అంటే పార్టీ మూల సిద్ధాంతాలు, స్వయంగా పవన్ తాను చెప్పిన అంశాలకు దూరం జరుగుతూ ఉండటం అన్నది వారిని పార్టీకి దూరం చేసింది. పవన్ కళ్యాణ్ సంప్రదాయ రాజకీయ నేత కాదు; అలాగని నాయకత్వ లక్షణాలు కలిగిన మేధావి కూడా కాదు. తనను తాను ఏదేదోగా ఊహించుకునే వ్యక్తి అన్న అభిప్రాయం ఉంది. జేడీ లక్ష్మీనారాయణ, రాజు రవితేజ వంటివారు కూడా సాంప్రదాయ రాజకీయ నేతలుకారు పవన్ ఒక ప్రత్యామ్నాయం అవుతాడని నమ్మి వచ్చిన నేతలు.

ఇక లక్ష్మీనారాయణ గారి రాజీనామా విషయంలో ఆయన లేఖకు పవన్ కళ్యాణ్ గారి స్పందన, వేసిన తప్పటడుగును ఎలా సమర్థించుకోవాలో తెలియక ఏదో మాట్లాడినట్టు ఉంది. నాకు ఫ్యాక్టరీలు లేవు, వ్యాపారాలు లేవు, కుటుంబాన్ని (కుటుంబాలను అన్నారు) పోషించుకోవాలి అనడం హాస్యాస్పదంగా ఉంది. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు లేవు అంటే అది ఆయన తప్పు అవుతుంది కానీ ఇతర పార్టీ నాయకులదో లేక ప్రజలదో ఎలా అవుతుంది. ఆయన సమకాలీన హీరోలు అయిన మహేష్ బాబు లాంటివారు సినిమాల్లో వచ్చిన సంపాదనతోనే వ్యాపారాలు మొదలు పెట్టారు కదా. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది ‘నేను పుట్టినపుడు నా చుట్టూ నలుగురు లేకపోతే అది నా తప్పెలా అవుతుంది, నేను పోయినపుడు నా చుట్టూ నలుగురు లేకపోతే అది నా తప్పు అవుతుంది’ అని. నాకు వ్యాపారాలు లేవు, ఫ్యాక్టరీలు లేవు అంటూ ఉంటే అలా ఉంది. ఆ లెక్కన ఆ పార్టీల నాయకులు కూడా అనొచ్చు ‘మేము భరణం కింద కోట్లు ఇచ్చుకోలేదు’ అని. అయినా ఆ వ్యాపారాల్లో నష్టపోతే, దివాళా తీస్తే చంద్రబాబు, జగన్, లోకేష్ వంటివారు సినిమాల్లో నటించి సంపాదించుకోలేరు కదా. చార్టర్డ్ ఫ్లైట్స్ లో తిరగటానికి, ఊ ఆ అంటే ఢిల్లీకి వెళ్ళి రావటానికి ఆయనకు డబ్బెక్కడినుండి వస్తోందో వారెవరూ అడగలేదే.

అవును చంద్రబాబుకు, జగన్ కు, అనేకమంది ఇతర రాజకీయ నాయకులకు కేవలం రాజకీయాలే కాకుండా ఇతరేతర వ్యాపారాలు ఉన్నాయి. కానీ, వారు దాదాపు 99% సమయాన్ని పూర్తిగా రాజకీయాలకే పరిమితం చేస్తూ, ఆ వ్యాపారాలను కుటుంబం అజమాయిషీలో ఉంచారు. 2004 లో ఓడిపోయాక చంద్రబాబు ఎన్నికలు అయిదేళ్ళున్నాయి కదాని వెళ్ళి వ్యాపారాలు చేసుకోలేదు; 2009 లోనూ, 2019 లోనూ అంతే – ఓడిపోయాక ఎన్నికలకు సమయముంది కదాని వెళ్ళి వ్యాపారాలు చూసుకోలేదు. జగన్ కూడా అంతే తండ్రి మరణం తరువాత, సోనియాగాంధీ ఎన్నో విధాలా ఇబ్బందులు పెట్టినా కూడా వెళ్ళి వ్యాపారాలు చేసుకోలేదు; 2014 లో ఓడిపోయాక కూడా రాజకీయాలే చూసుకున్నాడు తప్పించి టైముంది కదాని వెళ్లి వ్యాపారాలు చేసుకోలేదు. మరో విషయం పార్టీని నడపటానికి ఆర్ధిక అవసరాల కోసం అనటం కూడా సరియైనది కాదు – ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరసన వ్యక్తం చేయటానికి, పోరాడటానికి మరీ ఎక్కువ ఖర్చు అవసరం లేదు; కానీ గొప్ప కోసం ఎక్కువమంది జనాలను చూపుకోవాలంటే మాత్రం అవసరమే. పవన్ లాంటి పాపులర్ నటుడు (అవును ఆయన ఇప్పటికీ నటుడిగానే ఎక్కువగా గుర్తింపబడతాడు)  జనంలోకి వస్తున్నాడంటే ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేదు, జన సమీకరణ కూడా. వ్యక్తిగత రక్షణ, జనాలను అదుపు చేయటానికి ముందుగా పోలీస్ శాఖతో అనుమతులు తీసుకుని తగిన ఏర్పాట్లు చేసుకుంటే సరిపోతుంది.

అయినా పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవలసింది ఏంటంటే రాజకీయాలు అంటే విరామ సమయంలో చేసేవి కాదు. అధినాయకుడిగా నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారికి తమ అధినాయకుడు తమ ఏకీకృత లక్ష్య సాధన పట్ల అంకిత భావనతో పనిచేస్తున్నాన్న నమ్మకం, భరోసా కలిగించాలి. మిగతా చోటామోటా నాయకులు వచ్చివెళుతున్నా పెద్ద ప్రభావం పడదు. ఉదాహరణకు చంద్రబాబు పార్టీలో జయదేవ్, రాయపాటి, సుజనా, సీఎం రమేష్ వంటివారు పక్కా వ్యాపారవేత్తలు. వారేమీ నిత్యం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండేవారు కాదు. కానీ, గతంలో చంద్రబాబు ఇమేజ్ మరియు చంద్రబాబు పట్ల ఉన్న నమ్మకం వల్ల వాళ్ళు గెలవగలిగారు (వివిధ ఇతర సమీకరణాలతో పాటు అవి కూడా ఉపకరించాయి). అలాగే 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరి పేరు కూడా ప్రజలకు తెలీదు. వాళ్ళ గెలుపు అంతా ఆ పార్టీ అధినేత పట్ల జనం కనబరచిన నమ్మకం మాత్రమే.

అధినేతగా ఉన్న వ్యక్తి ప్రజల్లో, కార్యకర్తల్లో అటువంటి నమ్మకాన్ని పొందగలిగినపుడు పార్టీ తరఫున అనామకుడిని నిలబెట్టి కూడా గెలిపించుకోగలరు.ఎవరూ ఊహించని, ఇంతవరకూ ఎరుగని ఘోర పరాజయం ఎదురైనా కూడా; ఈ వయసులోనూ పోరాటం వదలని చంద్రబాబు గారిని చూసైనా ఆయన నేర్చుకోవాలి. ఒకవైపు ప్రభుత్వం తప్పులు చేస్తుందేమో అని ఎదురు చూడటమే కాకుండా, ప్రభుత్వం చేసిన/చేస్తున్న పనుల్లో లోపాలను అందిపుచ్చుకుంటూ అస్తిత్వం నిలుపుకుంటూ, బలాన్ని పెంచుకోవాలన్న ఆరాటంతో కూడిన ఆయన పోరాటం నుంచి కాస్తయినా స్ఫూర్తి పొందాల్సింది. ఆయన గమనించవలసింది ఏంటంటే ఆయన ఇంతకుముందు ప్రజారాజ్యంలోలా పార్టీలో కీలక సభ్యుడు కాదు, జనసేన పార్టీకి అంతా తానే అని. నిత్యం ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, క్రింది స్థాయి నుండి పార్టీని నిర్మించాలి. అలా చెయ్యకపోతే – ట్విట్టర్లో, ప్రెస్ మీట్లలో, అపుడపుడూ ప్రజల మధ్య ఎంత గర్జించినా ఉపయోగం ఉండదు. ప్రజల దృష్టిలో ఆయన బోనులో (అంటే మరొకరి అదుపాజ్ఞలలో ఉన్నారు అన్న అభిప్రాయంలో) ఉన్న సింహం, అందుకే వారు ఆ సింహపు గర్జనను వినోదంగా భావిస్తున్నారు తప్పించి, ఆ సింహం వల్ల జరిగేది ఏమీ లేదనే భావనలో ఉన్నారు. అలాంటి భావన కలించడం ఆయన స్వయంకృతమే.

ఇక అత్యంత ప్రధానమైన విషయం ఆయన సినిమాల్లోకి పునఃప్రవేశంగురించి. ఆయన గుర్తించవలసిన విషయం ఏంటంటే ఆయన దాన్ని ఎలా భావిస్తున్నారో కానీ ఆయన సినిమాలు చేయడం తప్పని ఎవరూ అనట్లేదు, చేయొద్దని కూడా ఎవరూ అనలేదు. ఎవరైనా అలా అంటున్నారు అంటే వారు అలా అనేలా చేసుకున్నది ఆయనే – ‘జగన్ మంచిగా పాలన చేస్తే, నేను హ్యాపీగా సినిమాలు చేసుకుంటా’, ‘ఇకమీదట ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాలు చేయను, నా జీవితం ప్రజాసేవకే అంకితం’, ఒక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను, సినిమాల్లోకి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ లేదు‘ – ఈ వ్యాఖ్యలన్నీ ఎవరివో ఆయన గమనించుకోవాలి. ఎదుటివారి వైపు వేలెత్తి చూపేముందు, మిగతా వేళ్ళు తనవైపే చూపుతున్నాయని గమనించగలగాలి. నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని పొందగలిగితే – ఏమో గరం ఎగరావచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి