iDreamPost

“పారాసైట్” కథను మనవాళ్లెప్పుడో తీశారా – Nostalgia

“పారాసైట్” కథను మనవాళ్లెప్పుడో తీశారా – Nostalgia

ఆస్కార్ పురస్కారాల్లో ఫస్ట్ నాన్ హాలీవుడ్ ఫిలింగా బెస్ట్ మూవీ, డైరెక్టర్ తో పాటు పలు విభాగాల్లో అవార్డులు ఎగరేసుకుపోయిన కొరియన్ సినిమా పారసైట్ మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ సినిమాలో ఏముందనే ఆసక్తితో పాటు ఆన్ లైన్ లో ఎక్కడ చూడాలి అనే గూగుల్ సెర్చులు ఎక్కువయ్యాయి. దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ మల్టీ ప్లెక్స్ లో దీనికి ప్రత్యేక స్క్రీనింగ్ వేసేంత. అది కూడా అవార్డుల ప్రకటన రావడానికి కొన్ని రోజుల ముందు కావడం విశేషం.

పారసైట్ మరీ మనం కనివిని ఎరుగని కథ కాదు. ఆ మాటకొస్తే ఇదే లైన్ మీద తెలుగు తమిళ్ లోనూ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ ముచ్చట తర్వాత చెప్పుకుందాం. స్టోరీ విషయానికి వస్తే ఒక పెద్ద మిలియనీర్ ఇంటిలో వేర్వేరు ఉద్యోగాలతో ఓ పేద కుటుంబం (తల్లి, తండ్రి, కొడుకు, కూతురు) పనిలో కుదురుకుంటుంది. ఓ రోజు రాత్రి ఓనర్ కొడుకు పుట్టినరోజుకని వాళ్లంతా కలిసి బయటికి వెళ్ళినప్పుడు హీరో ఫ్యామిలీ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈలోగా చిన్న ట్విస్టు జరిగి ఇదే ఇంట్లో గతంలో పని చేసిన వంటామె ఎంట్రీ ఇచ్చి వీళ్ళ రహస్యం కనుక్కుంటుంది. ఆమెకు సంబంధించిన మరో సీక్రెట్ వీళ్లకు తెలిసిపోతుంది. ఈలోగా యజమాని కుటుంబం వస్తోందని ఫోన్ వస్తుంది. ఇక అక్కడినుంచి దోబూచులాట మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందన్నదే అసలు కథ

నిజానికి స్టోరీ ఇలా చదివితే ఇందులో ఏముందబ్బా అనిపిస్తుంది. కానీ మేజిక్ మొత్తం దర్శకుడు బాంగ్ జాన్ హూ టేకింగ్ లో ఉంది. సింపుల్ కథను సరైన రీతిలో ఎమోషన్స్, థ్రిల్ ని మిక్స్ చేసి తీసిన తీరు అబ్బురపరుస్తుంది. దానికి తోడు నటీనటుల సహజమైన నటన సినిమాను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లింది. ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ స్ఫూర్తితో స్క్రీన్ ప్లే రాసుకున్న ఈ డైరెక్టర్ పనితనంలో కూడా అదే స్థాయిని చూపించడం విశేషం. టేకాఫ్ స్లోగా మొదలైనా ఆ తర్వాత క్రమంగా కథతో పాటు మనల్ని ప్రయాణం చేసేలా ఎంగేజ్ చేయడం అతన్ని ఉత్తమ దర్శకుడిని చేసింది.

అయితే 1999లో ఇలాంటి పోలికలున్న కథతో విజయ్ హీరోగా మిన్సార కన్నా అనే సినిమా వచ్చిందని సోషల్ మీడియాలో ఆ హీరో ప్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఇలాంటి థీమ్ తోనే తెలుగులోనూ శ్రీకాంత్ రవితేజ హీరోలుగా తిరుమల తిరుపతి వెంకటేశా వచ్చింది. ఓ మోస్తరు విజయం కూడా అందుకుంది. ఈ రెండూ తీక్షణంగా గమనిస్తే పారసైట్ లోని కీ పాయింట్ తో ఈజీగా సరిపోలుతాయి. అయితే ట్రీట్మెంట్ లో ఉన్న తేడాల వల్ల పారసైట్ వరల్డ్ స్టాండర్డ్ మూవీగా గుర్తింపు తెచ్చుకుంది. మళ్ళి మన దర్శక రచయితలు ఎవరన్నా పారసైట్ స్ఫూర్తితో కథలు రాసుకున్నా ఆశ్చర్యం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి